పరశురామావతారం గురించి కొన్ని నిజాలు !

0
2276

పరశురాముడికి కోపం, ఆవేశం ఎక్కువ. ఇతడు ఏ కార్యాన్ని తలపెట్టిన అసలు వెను తిరగడు, విజేయుడై వస్తాడు. అయితే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరొవ అవతారమే పరశురామావతారం అని చెబుతారు. అయితే దుర్మర్గులు అయినా క్షత్రియులని సంహరించడానికి శ్రీమహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడు.  మరి పరశురాముడు ఎప్పుడు జన్మించాడు? శివుడికి పరమ భక్తుడైన పరశురాముడి పాత్ర రామాయణ, మహాభారతంలో ఎలా ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

parasuramuduజమదగ్ని మహర్షి, రేణుకాదేవి దంపతుల సంతానమే పరశురాముడు. ఆయన వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ నాడు జన్మించారు. అదే రోజు అక్షయ తృతీయ మనం జరుపుకుంటాము. పరమేశ్వరుడి పరమభక్తుడైన పరశురాముడు ఆ ముక్కంటి దగ్గరే సకల విద్యలూ నేర్చుకున్నాడు. శివుడి నుంచి శక్తిమంతమైన గొడ్డలిని కానుకగా పొంది పరశురాముడన్న పేరును సార్థకం చేసుకున్నాడు.

parasuramuduఅయితే  ఓసారి కార్తవీర్యార్జునుడు అనే రాజు జమదగ్ని ఆశ్రమంలోని మహిమాన్వితమైన గోవును చూశాడు. ఆ గోమాత కరుణతోనే మహర్షి ఎంతమంది అతిథులు వచ్చినా, మృష్టాన్నం వడ్డించేవాడు. దాన్ని తనకు అప్పగించమని కార్తవీర్యార్జునుడు ఒత్తిడి చేశాడు. మహర్షి కాదనడంతో, బలవంతంగా తనతో తీసుకెళ్లాడు. ఆ విషయం తెలిసిన పరశురాముడు వేయి చేతుల కార్తవీర్యార్జునుడిని ఒక్క పెట్టున నేల కూల్చి, గోమాతను వెనక్కి తీసుకొచ్చాడు. ఒకానొక సందర్భంలో అర్ధాంగి మీద ఆగ్రహించిన జమదగ్ని మహర్షి ఆమె తలను తెగనరకమని కన్నకొడుకును ఆదేశించాడు. తండ్రిమాటను శిరసావహించాడా తనయుడు. అప్పుడు పితృభక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమని అడిగితే, తల్లి ప్రాణాల్ని తిరిగి ప్రసాదించమని వేడుకున్నాడు పరశురాముడు. అలా తండ్రి మాట జవదాటకుండానే, తల్లి ప్రాణాల్ని కాపాడుకున్నాడు.

parasuramuduఅయితే కార్తవీర్యార్జునుడి అహంకారం కారణంగా మొత్తం క్షత్రియజాతి మీదే కోపాన్ని పెంచుకున్న పరశురాముడు ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రియుల్ని అంతమొందించాడు. ఆ తర్వాత తాను గెలిచిన భూభాగాన్నంతా కశ్యపుడికి దానంగా ఇచ్చి తపస్సు చేసుకోడానికి వెళ్లాడు. మళ్లీ సీతాస్వయంవర సమయంలో వచ్చి తన ఆరాధ్యదైవమైన శివుడి చాపాన్ని విరిచిన రాముడి మీద ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. తానూ శ్రీరాముడూ వేరుకాదని గ్రహించాక, అహాన్ని త్యజించి అడవిబాట పట్టాడు.

parasuramuduమహాభారతంలో పరశురాముడు ముగ్గురు విరులైన భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుల వారికీ గురువు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధీంచాడు. తరువాత అంబికను వివాహంచేసుకొనమని చెప్పగా ఆ జన్మ బ్రహ్మచర్యవ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది.  ఇక కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు. ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడని పురాణం. తన ఆధ్యాత్మిక యాత్రలో దేశంలోని అనేక ప్రాంతాల్లో శివలింగాల్ని ప్రతిష్ఠిస్తూ, త్రిలింగదేశంగా పేరొందిన ఆంధ్ర రాజ్యంలో కూడా అనేక శివలింగాలు ప్రతిష్టించాడని పురాణాలూ చెబుతున్నాయి.

SHARE