Contributed By Raj Madiraju
మొన్న యమగోల చూశాక ఎన్‌టీవోడి ఫిలిం ఫెస్టివల్ ఏస్కున్నాను బింజివాచింగు పథకంలో.. అందులో భాగంగా ఎన్‌టీయార్ ఫిల్మోగ్రఫీ చూస్తోంటే ఒక సంవత్సరం దగ్గర నా కళ్లు ఆగిపోయాయి.. వొళ్లు గగుర్పొడిచింది..
1977..
బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన, అద్భుతమైన సంవత్సరం.. అంతకుముందు, ఆ తరవాత ఇంత ఘనమైన సంవత్సరం నా రీసర్చిలో కనబడలేదు..
దాదాపు ఏడేళ్లపాటు అంటే 1970 నుంచీ చూస్తే..
1971 లో మోసగాళ్లకు మోసగాడు, ప్రేం నగర్, దసరా బుల్లోడు వొచ్చాయి.. అన్నీ సూపర్ హిట్లే.. కానీ చరిత్ర తిరగరాసే సినిమాలు కాదు..
ఎంటర్ 1977..
సంక్రాంతికి ఎన్‌టీయార్ ‘దానవీరశూరకర్ణ’ రిలీజైంది.. అదే రోజు రిలీజైన కోటిరూపాయల భారీ చిత్రం ‘కురుక్షేత్రం’ సినిమాని మట్టి కరిపించింది..
చాలా యేళ్లనుంచీ ఎన్‌టీయారుని నిరాశపరుస్తూ వొచ్చిన బ్లాక్ బస్టర్ హిట్.. నిద్రలేచిన సింహం ఓ స్టేట్‌మెంట్ ఇవ్వడానికి చేసిన గర్జింపులా..
పరిశ్రమకు ఒకవైపు కురుక్షేత్రం ఫెయిల్యూరిచ్చిన నిరాశకన్నా ఎన్‌టీవోడు ఫాంలోకొచ్చాడన్న ఆనందం బహుశా ఎక్కువగా వేసి ఉండుంటుంది..
ఆ సినిమా డైలాగు క్యాసెట్లు ఎన్ని లక్షలు అమ్ముడుపోయాయో ఎన్ని కోట్లమంది నా తరం పిల్లలు ఆ డైలాగులను బట్టీకొట్టి స్కూళ్లలో ఏకపాత్రాభినయాలు వేశారో లెక్కలేదు..
ఇహ డీవీయెస్కే వందరోజులు పూర్తవుతూండగానే ఏప్రిల్ లో రిలీజైంది ‘అడవిరాముడు’..
ఈ సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన మరో కానుక డైరెక్టర్ రాఘవేంద్రరావు.. ఆయన్ని కలిసినప్పుడు ‘అడవిరాముడు సినిమా ఆఫర్ నాకొచ్చినప్పుడు నేనెంత భయపడ్డానో.. ఎలా ప్రెజెంట్ చేయాలి.. కొత్తగా చెప్పడానికి ఏముంది ఈయన్ని..’ అని చెప్పారాయన..
నిజమే.. తెరమీద దైవత్వాన్ని సంతకంగా గీసిపారేసిన నటుణ్ణి.. ఆరుకోట్లమంది ఆంధ్రుల మనసుల్లో చేతి కదలిక, చెప్పబోయే మాట.. నవ్వు, రూపురేఖలన్నీ స్పష్టంగా ముద్రించుకుని ఉన్న అభిమాన కథానాయకుడిని ఎలా పరిచయం చేయాలి..
చేశాడు రాఘవేంద్రరావు.. ఒక కొత్త కమర్షియల్ ఫార్ములా..
కమ్యూనిజంలో ఉన్న కమర్షియాలిటీని మొదటగా పట్టుకుంది రాఘవేంద్రరావే అనడంలో ఏ సందేహమూ లేదు.. (మనుషులంతా ఒక్కటేలో మా గురువుగారు చేసినా గొప్ప సక్సెస్ కాలేదు..)
రిటైరయిపోతాడా ఎన్‌టీయారు అని భయపడుతున్నవాళ్లందరికీ అడవిరాముడు ఒక గొప్ప ఊరట అనుకుంటా.. దానికన్నా ముఖ్యంగా రాముడు అనే తోకను తగిలించుకుని ఇంకో పన్నెండు సినిమాలొచ్చాయంటే అర్ధం చేసుకోవచ్చు అసలెంత గొప్ప ఫార్ములా తయారుచేసి వొదిలాడో పరిశ్రమ మీదికి..
ఇహ అదే సంవత్సరం అక్టోబరులో ‘యమగోల’..
బ్లాక్‌బస్టర్ డైలాగులు, బ్లాక్‌బస్టర్ పాటలు, బ్లాక్‌బస్టర్ స్టెప్పులు.. అసలు ఎన్‌టీయార్ కాస్ట్యూములు ఈ సినిమాలో అదో రకం..
ఇహ ఎన్‌టీయారు జయప్రదను ఎంతగా వాయిస్తాడో జయప్రద కూదా అంతగానూ ఆడుకుంటుంది అతనితో..
కథను ఒంటిచేత్తో నడిపిస్తూ రంగురంగుల డ్రస్సులేసుకుంటూ హీరోయిన్లతో డ్యూయెట్లు పాడుతూ హీరోయిజాని తగ్గకుండా ఫైట్లు చేస్తూ ఉంటే ఇహ దానికన్నా బ్లాక్‌బస్టర్ మెటీరియల్ ఏముంటుంది..
Can you believe it.. దానవీరశూరకర్ణ, అడవిరాముడు, యమగోల.. All three in one year..
1981 లో ప్రేమాభిషేకం, కొండవీటి సింహం వొచ్చాయి.. చిరంజీవి చెయ్యి పైకెత్తి ‘హలో నేనొస్తున్నాను..’ అన్నాడు.. చట్టానికి కళ్లులేవు, న్యాయం కావాలి చిత్రాలతో..
చివరిగా బాహుబలి..
చరిత్రలో దేనికి దానికి స్పెషల్ పేజీలే కానీ 1977 లో ఒకే యేడాది ఇలాంటి మూడు హిట్స్ వొచ్చింది కానీ, అదీ ఒక్క మనిషి ఇచ్చింది కానీ అస్సల్లేవు.. చిరంజీవి ప్రభంజనం ఉన్న ఎనభై తొంభైలలో కూడా ఇది రిపీటవలేదు.. ఇప్పుడైతే అసలొక హీరో యేడాదికి మూడు సినిమాలు చేస్తోందే లేదు..
పీయస్: పరిశ్రమలో ఎప్పటికప్పుడు ఒక సూపర్ స్టార్, ఆణ్ణి తయారుచేయగలిగే దమ్మున్న రాఘవేంద్రరావులాంటి డైరెక్టరు ఉండడమనేది ఎంత ముఖ్యమో కదా అనిపిస్తుంది ఇలాంటివి విశ్లేషిస్తున్నప్పుడు..
ఎన్‌టీయార్ ఎగ్జిట్, చిరంజీవి ఎంట్రీ కూడా యేడాది రెండేళ్ల ఓవర్‌లాపులో జరగడం గొప్ప యాదృఛ్ఛికం.. అవసరమైన యాదృఛ్ఛికం..