హిందూ పంచాంగం ప్రకారం, వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం.. ఉపవాసం ఉండటం వల్ల కచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలా మంది విశ్వాసం. హిందువుల పండుగలన్నీ చంద్రమానం లేదా సౌరమానం అనుసరించి జరుపుకునేవి అయినా, ఈ రెండింటితో సంబంధం లేకుండా చేసుకునే ఏకైక పండుగ ముక్కోటి ఏకాదశి.
దీనినే వైకుంఠ ఏకాదశి, స్వర్గపురి ఏకాదశి అంటారు. ఈ రోజున మూడుకోట్ల దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి వస్తారని ప్రతీతి. ఏకాదశి పేరు చెప్పగానే ఉపవాసం గుర్తుకొస్తుంది. పక్షంలో ఒక్క రోజైనా భగవంతునిపై మనసు లగ్నం చేయడానికి ఏర్పరిచిన నియమమే ఏకాదశి.

దీని వల్ల మనసు పరిశుద్ధం కావడం అటుంచితే, శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది శాస్త్రీయంగా రుజువైంది. ప్రతి ఏకాదశికీ ఉపవాసం కుదరకపోతే తొలి ఏకాదశి, నిర్జల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం ఆచరించిన ఫలితం దక్కుతుందని ఉవాచ.
విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి ఈ రోజున దర్శనమిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అనీ, వైకుంఠ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. అందుకే వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారం నుంచి భక్తులు విష్ణుమూర్తిని దర్శించుకుని తరిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలనుకునే భక్తులు ముందు రోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి.

ఏకాదశి రోజున తులసి తీర్థం మాత్రమే సేవించి, రాత్రి జాగరణ ఉండాలి. మర్నాడు ద్వాదశి రోజు ఉదయం ఆహారాన్ని స్వీకరించడంతో ఉపవాస దీక్షను ముగిస్తారు. ఉపవాస దీక్ష వెనుక పరమార్థం దాగి ఉంది.
ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం అని అర్థం. పొట్ట నిండుగా ఉంటే మనసులో ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఆకలితో శరీరం శుష్కించిన రోజున, మెదడు జాగరూకతతో మెలుగుతుంది.
ఆ సమయంలో భగవంతునిపై లగ్నమయ్యే మనసు గాఢమైన స్థితిని చేరుకోగలదు. అలాంటి మనసుని రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఉత్తేజిమవుతుంది. దేహాన్ని శాసించే ఆకలి, నిద్రల మీద అదుపు సాధించవాడి స్థైర్యానికి తిరుగుండదని, భగవన్నామస్మరణతో ఏకాదశినాటి రాత్రిని గడపమని సూచిస్తారు. సుదీర్ఘ సమయం ఉపవాసంతో ఉన్నప్పుడు శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించడం వల్ల జీర్ణవ్యవస్థ అస్థవ్యస్తమవుతుంది. కాబట్టి ద్వాదశి రోజున మితంగా ఆహారం తీసుకోవాలి. అంటే దశమి రోజున మొదలైన ఉపవాస వలయం ఏకాదశి చుట్టూ పరిభ్రమించి ద్వాదశి నాటికి ముగుస్తుందన్నమాట.

ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు పాలు, పండ్లు లాంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చని పెద్దలు సూచిస్తున్నారు. మురాసురుడు అనే రాక్షసుడు ఈ రోజున బియ్యంలో ఉంటాడు కాబట్టి దీనితో చేసిన పదార్థాలను భుజించకూడదనేది పండితుల మాట.
ఏకాదశి రోజు ఉపవాస నియమం వెనుక ఒక తాత్విక ఉద్దేశం కనిపిస్తుంది. అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో మనుషుల మీద చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుందని నమ్మకం. ఆ సమయంలో జీర్ణ సంబంధ వ్యాధులు, మనసులో ఆందోళనలు లాంటి సమస్యలు చోటు చేసుకుంటాయని భావిస్తారు. ఏకాదశి రోజు ఉపవాసం, జాగరణల వల్ల రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు మనసు, శరీరం సన్నద్ధంగా ఉంటాయి.
