Home Health డెల్టా ప్లస్ వేరియంట్ గురించి మీకు తెలియని విషయాలు

డెల్టా ప్లస్ వేరియంట్ గురించి మీకు తెలియని విషయాలు

0

కరోనా రెండో వేవ్‌ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. భారీ స్థాయిలో కేసులకు కారణమైన కరోనా డెల్టా వేరియంట్‌ నియంత్రణలోకి వస్తోంది. కానీ ఇంతలోనే డెల్టా వేరియంట్‌ మ్యుటేషన్‌ చెంది.. కొత్తగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌గా మారిందని పరిశోధకులు ఇటీవల ప్రకటించారు. ఈ వేరియంట్‌ కారణంగా మూడో వేవ్‌ రావొచ్చన్న అంచనాలతో మరోసారి ఆందోళన మొదలైంది.

డెల్టా ప్లస్ వేరియంట్దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వేగంగా కరోనా వ్యాప్తి చెందడానికి కారణమైన బి.1.617.2 వేరియంట్ నుంచి మరో కొత్త వేరియంట్ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పుట్టుకొచ్చింది. మొదటి వేవ్‌ చివరిలో ఏర్పడిన కరోనా వేరియంట్లు మ్యుటేట్‌ అయి ఈ ఏడాది జనవరిలో డెల్టా వేరియంట్‌గా రూపాంతరం చెందాయి. ఇది రెండో వేవ్‌కు కారణమైంది.

ఇప్పుడా డెల్టా రకం మరింతగా మ్యుటేషన్‌ చెంది ‘డెల్టా ప్లస్‌ (ఏవై 1)’గా మారింది. ఇప్పటికే అమెరికా, యూరప్‌ దేశాల్లో దీనితో కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలోనూ దీంతో మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్‌ నిబంధనలను పాటించకుంటే మరో నెల రోజుల్లోనే మూడో వేవ్‌ మొదలవుతుందని, డెల్టా ప్లస్‌ విజృంభించే చాన్సుందని మహారాష్ట్ర సర్కారు ఇటీవలే హెచ్చరించింది. ఇప్పటికే దేశాన్ని గడగడలాడించిన డెల్టా నుంచి రూపాంతరం చెందిన డెల్టా ప్లస్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.

కరోనావైరస్ డెల్టా వేరియంట్‌ను ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పటివరకు మూడు రకాలుగా రూపాంతరం చెందింది. బి 1 వేరియంట్తో పోలిస్తే ఈ వేరియంట్‌లో 12 మ్యూటేషన్లు ఉన్నాయని వైరాలజిస్టులు అంటున్నారు. స్పైక్ ప్రోటీన్‌లో K417N మ్యుటేషన్‌ పొందడం ద్వారా, దీన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. వాటిలో ఒకటి డెల్టా వేరియంట్. WHO రిపోర్ట్ ప్రకారం, డెల్టా వేరియంట్ ఇప్పటివరకు కనీసం 74 దేశాలలో బయటపడింది. మరొక వేరియంట్ డెల్టా ప్లస్.

ఈ డెల్టా ప్లస్ కేసులు జూన్ 7 నాటికి కెనడా, జర్మనీ, రష్యా, నేపాల్, స్విట్జర్లాండ్, ఇండియా, పోలాండ్, పోర్చుగల్, జపాన్, అమెరికా దేశాల్లో కనిపించాయి. భారత్తో సహా అనేక దేశాల్లో ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపింది. తద్వారా లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక, బ్రిటన్‌లో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో కేవలం డెల్టా వేరియంట్ వల్లే 90 శాతం నమోదయ్యాయి. దేశంలో కరోనా రెండో వేవ్‌ ఉధృతికి కారణమైన డెల్టా వేరియెంట్‌పై ఇప్పటికే మన దగ్గరున్న వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని వివిధ పరిశోధనలు తేల్చాయి. అందువల్ల ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ అనేది కీలకంగా మారింది. వీలైనంత త్వరగా అవకాశమున్న మేర రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేసుకోవాలి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి.

డెల్టా ప్లస్ వేరియంట్ తీవ్రమైనా సరే దాన్ని అరికట్టడంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్ కూడా డెల్టా ప్లస్ వేరియంట్పై బాగా పనిచేస్తుందని ఆ సంస్థ పేర్కొంది. అయితే కొత్త వేరియంట్ల నుంచి కాపాడుకోవడానికి దేశంలోని కనీసం 80 శాతం ప్రజలకు టీకా వేయాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

ప్రజలు కూడా మూడో వేవ్‌ రాదనే అజాగ్రత్త వదిలేసి, డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ పట్ల మరింత జాగరూకతతో వ్యవహరించాలి. డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా వ్యాప్తి చెందుతుందనే ఒకటి రెండు నెలల్లో స్పష్టత వస్తుంది. అయితే ఈ కొత్త వేరియంట్ గురించి ఆందోళన అక్కర్లేదని తెలుస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి అధిక హాని లేదని సమాచారం. ఈ వేరియంట్ బారిన పడినవారిలో త్వరగా యాంటీబాడీలు రూపొంది కరోనా నుంచి బయటపడుతున్నారు.

 

Exit mobile version