This Guy’s Write Up About Wandering In Hyd Streets At Night Is Relatable To Every Hyderabadi

Written By: Swaroop Thotada

వీకెండ్స్ లో రాత్రి పూట హైదరాబాద్ రోడ్ల మీద తిరగడం మాకు మంచి సరదా. సాయంత్రం బయలుదేరి అర్ధరాత్రి వరకూ టీ కి తప్ప దేనికీ ఆగకుండా తిరగేవాళ్ళం. అదీ ట్రిపుల్ రైడింగ్ లో. రూమ్ లో ఉంటే లోపల ఉన్నట్టు. ఎక్కడికెళ్లినా అది ఇంకో లోపలే. ప్రపంచంలో అందరూ సోదిగాళ్లే. కాబట్టి ఎవర్ని కలిసినా వాళ్ళతో ఇరుక్కుపోయినట్టే. దీనికి పరిష్కారమే ఇలా తిరగడం. ఎరుపు, నీలం, పచ్చ, పసుపు రంగుల్లో ధగ ధగా వెలిగిపోయే విద్యుద్దీపాల వెలుగు ఆ దుమ్ముకొట్టుకుపోయిన రోడ్డు మీద, మనుషుల చెమట శరీరాల మీద అతకలేక వెనక్కి పడి చెదిరిపోతుంటే ఆ వెలుగు ముక్కలన్నిటి మధ్యలోంచి దూసుకుపోవాలి. అప్పుడే హడావుడి అంతా ఒంటికి అంటించుకోవడం సాధ్యం. లేదంటే అందరిలా ఏదో ఒక మూల ఉన్నట్టే. వేగంగా అలా ట్రాఫిక్ లోంచి పోతుంటే విశ్వం తయారైన గుజ్జు అంతా ముఖానికి, ఒంటికి అంటుకుని, తక్కువ సమయంలో ఎక్కువ దూరం పోతే ఒకేసారి అన్నీ చోట్లా ఉన్నట్టు కలిగే భ్రమని పెద్దగా పరీక్షించకుండా ఆస్వాదిస్తూ అలా సాగిపోయేవాళ్ళం. రోడ్డు మీద జనాల రూపాలు అస్తవ్యస్తంగా మా కళ్ళలో పడుతుంటే వాటిని సవరించుకునే, సర్దుకునే తీరిక లేక ఒక్కొక్కరి నుంచి ఒక్కో ముక్కనీ తొక్కనీ పెరుక్కుని అక్కడే గాల్లోకి చల్లేసి వెళ్ళిపోతాం. మబ్బుల్లో విమానం నడిపే పైలట్ మాకంటే ఎక్కువ దూరం ఎక్కువ వేగంగా పోతాడు కానీ అతనికి ఇలా ప్రపంచం అంటుకోదు. Then what’s the point? బంజారా హిల్స్ రోడ్డులో పోతే ఏదో పబ్ నుంచి ఏదో సంగీతం వినబడుతుంది. తలుపులు మూసుకున్న ఎవరికీ మా ఉత్సవంలో చోటు లేదు కాబట్టి ఆ రోడ్డు బయటే ఎప్పటికీ ఆ ప్రపంచానికి దూరంగా తిరిగే సామాన్యుల్ని కలుపుకుని వదిలేసి వెళ్ళిపోతాం.

అలా సిటీ దాటి పోతే ఇక లారీల మోత, హైవే దుమ్ము, రాత్రి చలి కలిసి అదో విచిత్రమైన ambience. దూరంగా సిటీలో వెలిగే నియాన్ దీపాలు “నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్లి రండి” అన్నట్టు చేతులూపుతాయి. కబుర్లు చిక్కబడతాయి. పర్సనల్ పెంట ఏం ఉండదు. Thoreau తత్త్వం నుండి Scorsese సినిమాల వరకూ అన్నీ టచ్ చేస్తాం. బండి శబ్దం, రాత్రి స్తబ్దత పలకరించుకుంటాయి. అందరూ పెట్టే పరుగులు ఆగిపోయి సమయం ఒళ్ళు విరుచుకునే పూట కూడా హైదరాబాద్ లో హడావుడి నడుస్తూనే ఉంటుంది. హైవే ల మీదకి పోతే మాత్రం పక్కనుంచే రయ్యిమంటూ పోయే కార్లు, లారీలు తప్ప జనసంచారం ఉండదు. మా బండి వేగం కూడా పెరుగుతుంది. ఎక్కడో ఒక చర్చి లైట్లు వెలుగుతుంటాయి. ఏదో Restaurant బయట జనం. అక్కడి కప్పుల కంచాల శబ్దం అక్కడినుంచే మౌనంగా చెయ్యూపుతుంది. రయ్యిమని అలా పోతే బ్రిడ్జి కింద నుండి పోయే రైలు తలుపుల్లోంచి వచ్చే వెలుగు ఆ పట్టాల పక్కన తుప్పల మీద పడుతుంది. అప్పటి వరకూ చీకటిలో కలిసిపోయిన మురిక్కాలవ ఒక్కసారి మెరుస్తుంది. రైలు పోతుంది. ఒక్కో చోట ఒక్కో వాసన. చెత్త రోడ్లు కూడా ఏం సిగ్గు పడవు. ఎవరి uniquness వారు ప్రదర్శిస్తున్నట్టే ఈ రోడ్లు కూడా వాటి వాటి వాసనలు ప్రకటిస్తుంటాయి. ఎక్కడా ఆగకుండా అలా ఒక రౌండ్ వేసేవాళ్ళకి judgements ఇచ్చే పనేముంది? మేం పట్టించుకోమ్. ఎవరు ఎలా అయినా ఏడవండి. మీ ఇష్టం.

ఇలా నగరమంతా తిరుగుతూ ప్రపంచాన్ని అంటించుకోవడంలో అన్నిటికంటే కీలక ఘట్టం చివరిదే. అదే ఇంటికొచ్చి వదిలించుకోవడం. ఎక్కడివక్కడే వదిలేయడం చేతనైతేనే ఈ ప్రయాణం చేయగలం. దారి మధ్యలో చాలా చోట్లు ఆగమంటాయి. ఆగితే ఆగిపోతాం. సమయం క్షణాలుగా తనని తాను తెంచుకుని నగరమంతా పరుచుకుంటుంది. వాటిని ఏరుకోవడం ఎంత ఆనందమో మళ్లీ అక్కడే చల్లేసి చిన్న పిల్లల్లా చప్పట్లు కొట్టి రావడం అంత పెద్దరికం. మేము రూమ్ కి వచ్చి తలుపులేసుకున్నాక కూడా సిటీ వెలుగుతూనే ఉంటుంది, ఆ వెలుగు అక్కడి వస్తువుల్ని గుద్దుకుని ముక్కలై పడుతుంటుంది. అవి అప్పుడు అక్కడ తిరిగేవాళ్లు ఏరుకుంటారు, దాచుకుంటారు, గుచ్చుకుంటారు. మేమిక నిద్రపోతాం.

PS: Lockdown తర్వాత ఇన్నాళ్లకు హైదరాబాద్ లో నిన్న నైట్ టైం రైడ్ కి వెళ్ళాక ఆ flashback గుర్తొచ్చింది. నిన్నటి రాత్రి హైదరాబాద్ లో ఈ హడావుడి లేకపోవడమే నచ్చింది కూడా.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR