శీతాకాలంలో పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోటానికి పాటించాల్సిన చిట్కాలు

0
430

చలికాలం వచ్చిందంటే చాలు అందరి దృష్టి చర్మ సమస్యలపైనే పెడతారు. ఈ సీజన్‌లో ముఖ చర్మం, చేతులకు కోల్డ్ క్రీమ్స్‌, మాయిశ్చరైజర్ రాసుకుంటూ పొడిబారే చర్మాన్ని తేమగా ఉంచుకుంటారు. కానీ పాదాల సంరక్షణను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. రోజుల తరబడి పాదాల ఆరోగ్యాన్ని విస్మరించడం వల్ల పగుళ్లు ఏర్పడి కొత్త సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ పగుళ్లలో బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి సూక్ష్మ క్రిములు చేరితే ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇది తీవ్రమైన సమస్యగా మారకముందే చికిత్స తీసుకోవాలి.

Tips to keep your feet healthy in winterశీతాకాలంలో పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని నివారణ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం. శీతాకాలంలో పొడిబారే పాదాల చర్మం పొలుసులుగా మారి అనారోగ్యాలకు కారణమవుతుంది. ఈ సమస్యకు దూరంగా ఉండటానికి పాదాలను తేమగా ఉంచుకోవాలి. కాలు మడమల్లో పగుళ్లు వస్తే, వాటిల్లోకి దుమ్ము, మట్టి చేరుతుంది. దీన్ని సరిగా పట్టించుకోకపోతే సమస్య పెద్దగా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాళ్లను శుభ్రం చేసుకున్న తరువాత ప్రతిరోజూ పాదాలకు మాయిశ్చరైజింగ్ క్రీం రాసుకోవాలి. పగుళ్లను నివారించడానికి కోకో బటర్, పెట్రోలియం జెల్లీ వంటివి బాగా పనిచేస్తాయి.

Tips to keep your feet healthy in winterప్రతిరోజూ చెప్పులు, సాక్సులు, బూట్లు ధరించడం వల్ల పాదాల చర్మంపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు దాడిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రోజులో ఒక్కసారైనా పాదాలను సబ్బుతో కడగడం వల్ల అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. సాక్స్ వేసుకోవడం వల్ల దుమ్ము, ధూళి పాదాలపై చేరదు. దీంతోపాటు సౌకర్యంగా ఉండే బూట్లనే ధరించాలి. గట్టిగా ఉండేవి, సైజుల్లో హెచ్చుతగ్గులు ఉండే బూట్ల వల్ల చర్మ వ్యాధులు రావచ్చు. వీటివల్ల పాదాలు, మడమలపై పుండ్లు పడే అవకాశం కూడా ఉంది. మడమలపై ఒత్తిడి పడకుండా ఉండే చెప్పులు, బూట్లు, హీల్స్ మాత్రమే వేసుకోవాలి.

Tips to keep your feet healthy in winterపాదాలు ఎప్పుడూ చెమటపడుతూ, తడిగా ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. దీనివల్ల దురద, మంట, చర్మం పైపొర లేచిపోవడం, బొబ్బలు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాలి వేళ్ల మధ్యలో తడి ఆరకుండా ఉంటే… బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పాదాలను కడిగిన ప్రతిసారి వేళ్ల మధ్యలో తడి లేకుండా తుడుచుకోవాలి. సాక్స్, బూట్లను ఎక్కువగా వాడేవారు కాళ్లు శుభ్రం చేసుకున్న తరువాత పాదాలను ఆరబెట్టుకోవాలి.

Tips to keep your feet healthy in winterపాదాల ఆరోగ్యానికి ముందునుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం నెలకు రెండుసార్లు పాదాలను 10- 15 నిమిషాలు గోరువెచ్చని నీటిలో ఉంచాలి. ఆ తరువాత పాదాలను బాగా రుద్ది శుభ్రం చేసుకోవాలి. అనంతరం తడి లేకుండా తుడిచి, విటమిన్‌- ఇ క్రీం రాసి మర్దన చేయాలి. దీనివల్ల పాదాల చర్మం మృదువుగా మారుతుంది. ఇన్ఫెక్షన్లు, అలర్జీలు వంటి సమస్యలు ఉంటే యాంటీ బాక్టీరియల్ క్రీం వాడాలి.

 

SHARE