చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. చెమట కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు మరియు ముఖంలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రదేశాలలో చెమట పడుతుంది.స్నానం చేసిన కొద్ది సేపటికే చెమటపడుతుంది. ఎండాకాలం వస్తుందంటే ప్రతి ఒక్కరికి చెమట పోస్తుంది. కొంతమందికి మరింత ఎక్కువగా పోస్తుంది. మరికొంత మందికి చాలా తక్కువగా చెమట పడుతుంది. శారీరక శ్రమ చేసేవారికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ చెమటతోపాటు అనాయాసంగా అమోనియా, ప్రొటీన్లు, కొవ్వు, ఆమ్ల లవణాలుకూడా శరీరంలోంచి బయటకు వచ్చేస్తాయి. చెమటతో చర్మం తేమగా వుంటుంది.
వేడి వాతావరణం తీసుకునే ఆహారం తదితర కారణాల వల్ల చెమట అధికంగా పడుతుంది. కిడ్నీ వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కాలేయ వ్యాధలు, శరీరంలోకి తీసుకునే పలు రకాల మందులు శరీరం నుంచి దుర్వాసనకు వెలువడడానికి కారణమవుతాయి.
శరీరంలో జరిగే పలు రకాల మార్పులు, రసాయనిక ప్రక్రియల కారణంగా దేహం నుంచి చెడు వాసన చెమట రూపంలో వెలువడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నలుగురిలోకి వెళ్లాలంటే నామోషిగా ఫీలవుతుంటారు. ఎదుటివారి ముందు చిన్న చూపుకూ లోనవుతాం. సంబంధాలు కూడా దెబ్బతింటాయి. కనుక దేహం నుంచి దుర్వాసన వెలువడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది..
కొంతమందికి శరీరంలోని కొన్నిప్రదేశాల్లోనే ఎక్కువగా చెమట పడుతుంటుంది. అందులోముఖ్యంగా బాహుమూలాలు(అండర్ ఆమ్స్)లో ఎప్పుడూ చెమట ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రదేశంలో టీట్రీ ఆయిల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే నేచురల్ యాంటీ సెప్టిక్స్ ఉపయోగించడం వల్ల శరీరంలో ఉన్నబ్యాక్టీరియాలు తొలగిపోతాయి.
టాల్కమ్ పౌడర్ ను ఉపయోగించడం, నిమ్మతొక్కతో స్నానం చేయడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రెష్ గా మార్చడమే కాకుండా చెమట దుర్వాసనను నివారిస్తాయి. వీటన్నిటితో పాటు ఎక్కువగా మంచినీళ్లు తాగటం, ఎక్కువగా పండ్లను తింటూ, చిరుతిండ్లు, వేపుళ్లు తినడం మానేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ప్రతీ మనిషి శరీరంలో సుమారు రెండు నుంచి నాలుగు మిలియన్ల స్వేద గ్రంథులు ఉంటాయి .ఇవి చర్మం కింద ఉండే డెర్మిస్ పొరలో ఉంటాయి. ఆ గ్రంథుల నుంచే చెమట వస్తుంది.అయితే ఎండాకాలంలో గాలిలో ఉండే ఎక్కువ వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత ఉండాల్సిన దాని కంటే పెరిగిపోతుంది. దాన్ని చల్లబరిచేందుకు చెమట ఎక్కువగా ఏర్పడుతుంది.
నిజానికి చెమట రావడం వల్ల నష్టమేమీలేదు. ఇది శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. ఎండకు, ఎక్కువ వేడికి చర్మం ఎండిపోకుండా ఉండేందుకే చెమట వస్తుంది.
కానీ చెమటతో పాటు వచ్చే దుర్వాసనే కాస్త ఇబ్బంది పెట్టే విషయం. సాధారణంగా చెమటలో నీరు, అమోనియా, ఆమ్ల లవణాలు, క్లోరైడ్స్ లాంటివి ఉంటాయి. వీటికి ఎటువంటి దుర్వాసన ఉండదు. కానీ చెమట ఎండిపోయిన తర్వాత శరీరంపై ఉన్నబ్యాక్టీరియాతో ఈ ఆమ్లాలు చేరడం వల్ల చెమట దుర్వాసన వస్తుంది.
సాధారణంగా వచ్చే చెమటతోపాటు మనం తీసుకునే ఆహారం వల్ల కూడా చెమట ఇంకా పెరుగుతుంది. మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో పాటు వెల్లుల్లి , నాన్ వెజ్ తినడం వల్ల చెమటలో దుర్వాసన పెరుగుతుంది. అందుకే ఎండాకాలంలో వేడిని పెంచే పదార్థాలు, మాంసాహారం తగ్గిస్తే మంచిది.
వేసవిలో చెమట నుంచి, దుర్వాసన నుంచి బయటపడాలంటే ముందుగా వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే రోజుకి రెండు మూడు సార్లు స్నానం చేయాలి. అలాగే స్నానం చేసేటప్పుడు స్క్రబర్ ను ఉపయోగించి శరీరాన్ని బాగారుద్ది స్నానం చేయడం వల్ల చర్మరంద్రాలు తెరచుకొని శుభ్రపడతాయి. ఇలా వారానికి కనీసం రెండు సార్లయినా చేయాలి.
అలాగే కొన్ని పుదీనా ఆకులను నీటిలో కలిపి స్నానం చేస్తే ఆ రోజంతా చర్మం తాజాగా ఉంటుంది. దాంతో చెమట పట్టినా దుర్వాసన రాదు.
స్నానం చేసిన తర్వాత శరీరానికి ఆస్ట్రింజెంట్ ను రాయాలి. ఆస్ట్రింజెంట్ ను అప్లై చేయడం వల్ల చర్మం మీద ఉన్న అతి సూక్ష్మమైన బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే ఆస్ట్రింజెంట్ చర్మంలోకి త్వరగా ఇంకి పోయి చెమట రాకుండా కాపాడుతుంది.
నేచురల్ ఫైబర్‌తో తయారు చేసిన దుస్తులనుగానీ, కాటన్ దుస్తులను గానీ వేసుకోవాలి. అప్పుడు శరీరం నుంచి వెలువడే చెమట దుర్వాసన సాధ్యమైనంత వరకు తొలగిపోతుంది. చెమటను ఎప్పటికప్పుడు పీల్చేసి చల్లబరిచే గుణాలు ఈ దుస్తులకు ఎక్కువగా ఉంటాయి.
వేసవిలో చెమటను తగ్గించాలంటే కొన్నిఆహారాలకు దూరంగా ఉండాలి. అందులో ముఖ్యమైనవి మసాలాలు. ఎందుకంటే మసాలా ఆహారం శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమటను బయటకు రప్పించడానికి కారణమవుతుంది.
కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో అధికంగా టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అయ్యి. చెమటకు, దుర్వాసనకు కారణం అవుతుంది. కాబట్టి కాఫీ, టీ, కోక్ వంటి వాటిని మితంగా తీసుకో వడం మంచిది. వీటితో పాటు వెల్లుల్లి , ఉల్లిపాయలు వంటి వాటికి పూర్తిగా దూరంగాఉండటమే మంచిది. సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి.