మన దేశంలో హనుమంతుడికి అనేక ఆలయాలు ఉన్నాయి. అయితే తిరుమలలోని జాబాలి తీర్థంలో హనుమంతుడు స్వయంభుగా వెలిశాడని ప్రతీతి. మరి ఆ రామబంటు ఇక్కడ స్వయంభూగా ఎందుకు వెలిసాడు? అయన కొలువై ఉన్న ఈ ప్రాంతానికి జాబాలి తీర్థం అని పేరు ఎందుకు వచ్చింది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిత్తూరు జిల్లాలోని తిరుమల కొండపైన వెలసిన శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పాపనాశానానికి వెళ్లే దారిలో ఈ జాబాలి తీర్థం ఉంది. అయితే పురాణానికి వస్తే, ముప్ఫై కోట్ల మంది దేవతల కోరిక మేరకు శ్రీ మహా విష్ణువు శ్రీ రాముని అవతారంలో అవతరించడానికి నిర్ణయం జరుగుతుంది. అప్పుడు జాబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రదేశాల్లో జపం చేస్తూ ఇప్పుడు ఉన్న కొండ మీద జపం చేయనారంభిస్తారు. అప్పుడు రుద్రుడు ఆయన తపస్సుకు ప్రసన్నుడై ఆయన ముందు ప్రత్యక్షమై జాబాలి మహర్షికి తన రాబోవు అవతారాన్ని ముందుగానే చూపిస్తారు. అదే హనుమంతుని అవతారం. దేవతలందరితో కలిసి వానరాగ్రగణ్యుడిగా అవతరిస్తానని వివరిస్తాడు.
అయితే జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాబాలి అంటారు. అన్ని తీర్థ రాజాలు వచ్చి చేరతయి కనుక జాబాలి తీర్థంగా పేరొందింది. అయోధ్య కాండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాక్ దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు. ఆ వాక్ దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి.
హనుమంతుడు వానరావతార భక్తాగ్రగణ్యుడు. వానరాలకు చెట్లు చేమలు అంటే ప్రీతి. అటువంటి హనుమంతుడు దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన చెట్ల మధ్య ఉన్నాడు. చుట్టూ జలపాతాలతో పవనస్తుడైన ఆంజనేయుడు ఈ సుందర దివ్య ధామంలో కొలువై ఉన్నాడు. రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ సదా కొలువై ఉంటానని హనుమంతుడు వివరించాడు. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా రామ భక్తుడిగా రామదాసునుదాసునిగా ఆంజనేయుడు గర్భాలయంలో తేజరిల్లుతుంటాడు. తోరణ గతుడై సింధూరంతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు.
స్వామి వారి శిరస్సు పై భాగాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటాయి. అభయం, ఆనందం కలబోసిన స్వరూపం ఆంజనేయుడు. అటువంటి దివ్య మూర్తిత్వంతో ఇక్కడ స్వామి కొలువై ఉన్నాడు. ఆలయం వెలుపల ఉన్న వృక్షరాజం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సత్వరం కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఇంకా రావి చెట్టు మొదలులో ఉన్న వృక్ష మూల గణపతిని దర్శించుకుని తమ కోరికలను కోరుకుంటారు భక్తులు. అయితే ఎందరో మహాత్ములు,సాధువులు, యోగులు, మునులు సిద్ధిపొందిన పరమ పవిత్ర ప్రదేశం ఇది. ఇక్కడ ఉన్న తీర్థరాజంలో పంచ మహాపాతకాలు, భూతపిశాచ బాధలు ఉన్నవారు స్నానమాచరిస్తే అన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఈ పవిత్ర స్థలంలో సీతాకుండ్, రామకుండ్ తీర్థాలు ఉన్నాయి. దానికి కూడా ఒక పురాణ కథ ఉంది, అయితే శ్రీ రామచంద్రుడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వెళ్తూ సీతాసమేతంగా ఇక్కడి తీర్థంలో స్నానమాచరించాడని అందుకే రాముడు స్నానమాచరించిన తీర్థాన్ని రామకుండ్‌గా, సీతాదేవి స్నానమాచరించిన తీర్థాన్ని సీతాకుండ్‌గా పేర్కొంటారు. కొండలపై నుంచి వచ్చి ఈ తీర్థాలలో నీరు చేరుతూంటుంది. కాబట్టి ఈ నీటిలో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని, అంతేకాకుండా ఏడు మంగళవారాల పాటు ఇక్కడి రామకుండ్ తీర్థంలో స్నానమాచరించి తడి దుస్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం.
ఈవిధంగా హనుమంతుడు స్వయంభుగా జాబాలి తీర్థం నందు వెలిసి పూజలందుకొంటున్నాడు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.