తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణన సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. తులసిని బృందా అని కూడా అంటారు. విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగల్లో తులసి ప్రస్థానం ఉంటుంది. తులసి తీర్థం అన్నమాట తరచు వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది.
తులసి – స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు మన సనాతన ధర్మంలో. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు.
గోకులాష్టమి దినాన తులసీ పూజ చేయడం శ్రేష్ఠం. శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణునికి ఇష్టమైన తులసిని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. శ్రీకృష్ణునికి ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే! కృష్ణాష్టకమ్, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ, పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి. కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే.
ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళనే కృష్ణపూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి…. దాని మీద ఒక కుండని పెడతారు.
ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి, పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి, కృష్ణునికి అర్ఘ్యమిస్తారు. మరునాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు. అలాగే ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.
శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. అలాగే శ్రీకృష్ణాష్టమి రోజున దీపారాధనకు ఆవునేతిని హారతి కోసం సిద్ధం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కున తిరిగి, “ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించబడింది.