అక్షరాభ్యాసం చేయించేటప్పుడు పాటించాల్సిన నియమాలు

పిల్లల మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం. పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని అక్షరాభ్యాసం అంటారు. ఈ సంస్కారాన్నే అక్షరారంభమనీ, అక్షరలేఖనమనీ, విద్యారంభమనీ కూడా అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు. ఆ వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని, మనస్సులో నిలుపుకొనే శక్తి విద్యార్థికి లభిస్తుంది. విశ్వామిత్రుడు దీన్ని ఏడొ ఏటివరకు పొడిగించాడు. అయితే ఈ కాలంలో పరిస్థితులను బట్టి మూడవయేటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు.

Aksharaabhyaasamవిద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మనవాళ్లు రూపొందించారు. అందుకే వసంత పంచమి సందర్భంగా పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ. ఉదయం వేళ ఇంట్లోగానీ, దేవాలయంలోగానీ, పాఠశాలలోగానీ, పెద్దలు, గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు. ముఖ్యంగా విజయదశమీ, శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం.

Aksharaabhyaasamహిందూ సంప్రదాయం ప్రకారం పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవిగా చెబుతారు. అలాగే మన పురాణాల ప్రకారం విద్యాధిదేవతలు కొందరున్నారు. అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థిచేత అక్షరాలు దిద్దించటం సంప్రదాయం. సకల విఘ్నాలనూ తొలగించే వినాయకుణ్ణి, విద్యల దేవత అయిన సరస్వతీ దేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విష్వక్సేనుడు మొదలైనవారిని విద్యాదేవతలుగా పూజిస్తారు.

Aksharaabhyaasamఆ తరువాత ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అనే అక్షరాలను విద్యార్థిచేత దిద్దిస్తారు. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ‘నమశ్శివాయ’ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది. విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం. అయితే కొంతమంది అక్షరాభ్యాసం మూడు, అయిదు సంవత్సరాలలో మాత్రమే చేయాలి అనే చెబుతుంటారు. నాల్గవ సంవత్సరం చేయరాదు అంటారు.

Aksharaabhyaasamకానీ నాల్గవ సంవత్సరం అక్షరాభ్యాసం చేయకూడదని మన శాస్త్రంలో ఎక్కడా లేదు. అయితే అనధ్యయనములు అనబడే పాడ్యమి, అష్టమి, చతుర్దశీ, పౌర్ణిమ, అమావాస్య రోజులలో మాత్రం అక్షరాభ్యాసం చేయరాదు. అలాగే అమ్మవారికి పవిత్రమైనదని మూల నక్షత్రం రోజు కూడా అక్షరాభ్యాసం చేస్తుంటారు. కానీ మూలానక్షత్రం రోజు పుస్తక రూపంలో సరస్వతీ ఆవాహన చేసి నాటి నుండి విజయదశమి రోజు వరకు వ్రాయుట, చదువుట, పాఠం చెప్పుట నిషేధం అని శాస్త్రం.

Aksharaabhyaasam మళ్ళీ విజయ దశమినాడు అక్షరాభ్యాసం అనువైన రోజు. మూఢమి అనధ్యయనం, ఆషాఢం, భాద్రపదం, పుష్య మాసములలోఅక్షరాభ్యాసం చేయించకూడదు. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిధులు విశేషం. మంగళవారం నిషేధం.

Aksharaabhyaasamఇక కొంతమంది అక్షరాభ్యాసం ‘బాసరలో చేసినా’ ‘శ్రీపంచమి రోజు చేసినా’ ముహూర్తంతో అవసరం లేదు అని నమ్ముతారు. అలా అని శాస్త్రంలో ఎక్కడా లేదు. అక్షరాబ్యాసం ఎక్కడ చేసినా తారాబలం, గ్రహబలం లేని రోజులలో ముహూర్తం చూడకుండా చేయవద్దు. చంద్రుడు, గురువు మనసు విద్యలకు కారకులు కావున వారు బలంగా వున్న ముహూర్తం విశేషంగా చూడాలి. హస్త, పునర్వసు, స్వాతీ, అనూరాధ, ఆర్ద్ర, రేవతీ, అశ్వినీ, చిత్త, శ్రవణ నక్షత్రాలు కూడా అక్షరాభ్యాసానికి అనువైనవిగా శాస్త్రం చెబుతోంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR