పిచ్చివాడిలా చూసిన ప్రజలు ఆ స్వామీజీనే దైవంగా ఎందుకు భావించారో తెలుసా ?

0
3567

మన దేశంలో దేవుడికి ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు అనేవి ఉన్నాయి. కానీ ఇక్కడ విశేషం ఏంటి అంటే పూర్వము ఒక స్వామిని కాలక్రమేణా దైవంగా పూజించడం మొదలు పెట్టి అయన మరణాంతరం సమాధి ఉన్న ఆశ్రమమే ఒక దేవాలయంగా వెలసి విశేష ఆదరణ పొందుతుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ ఆ స్వామిని ఎందుకు దైవంగా భావిస్తారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bhagavan Venkaiah Swamy

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం, నెల్లూరుకు 7 కీ.మీ. దూరంలో, గొలగమూడి అనే గ్రామము ఉన్నది. ఈ గ్రామములో గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచిన శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం ఎంతో ప్రసిద్ధి గాంచింది. 20 వ శతాబ్ద మధ్య కాలంలో ఆధ్యాత్మిక బోధనలు చేసిన శ్రీ వెంకయ్య స్వామి ఇక్కడే మహా సమాధి అయ్యారు. ఆ తరువాత భగవాన్ వెంకయ్యస్వామిగా అయన పూజలందుకుంటున్నాడు.

Bhagavan Venkaiah Swamy

ఇక పూర్వపు విషయానికి వస్తే, నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరు అనే చిన్న గ్రామంలో సోంపల్లి పిచ్చమ్మ, పెంచలనాయుడు పుణ్యదంపతులకు స్వామివారు జన్మించారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో వెంకయ్యస్వామి చిన్నతనంలో కుటుంబపోషణకోసం కూలిపనులకు వెళ్లేవారు. దయ, కరుణలతో ఉంటూ పశుపక్ష్యాదులపట్ల ప్రేమ చూపుతుండేవారు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఒకసారి తీవ్రజ్వరం రావడంతో స్వామి సమీపంలోని అడవికి వెళ్లిపోయారు. ఎప్పుడైనా ఊళ్లోకి రావడం, మిగిలిన సమయం అడవుల్లో ఉంటుండడంతో వెంకయ్యస్వామికి మతిభ్రమించిందని భావించేవారు.

Bhagavan Venkaiah Swamy

అలా కాలక్రమంలో పెంచలకోన, తిరుపతి, శ్రీశైలం అడవుల్లో యోగసాధన చేశారు. పెంచలకోన అడవుల్లో స్వామివారికి కణ్వమహర్షి అనుగ్రహం లభించిందని. ఆ తర్వాత స్వామి ఏది చెబితే అది జరుగుతున్నట్లు ప్రచారం జరగడంతో ఆయనను భగత్‌స్వరూపంగా భక్తులు భావించారు. వివిధ ప్రాంతాల్లో జనారణ్యంలో ఉన్న సమయంలో స్వామివారి మహిమలు అందరికీ తెలిసేవి. అలా కాలక్రమేణా స్వామివారు ఎక్కడికి వెళ్లినా ధునివేసి ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేవారు. స్వామివారు యోగసాధన చేసే క్రమంలో తమిళనాడులోని కంచి, చెన్నై నగరంలోనే ఎక్కువ కాలం ఉన్నారు. తర్వాత పెనుబద్వేలు తిప్ప, కోటితీర్థం గ్రామంలో కొంతకాలం నివసించారు. ప్రశాంతంగా భగవ ధ్యానం చేసుకోవడానికి గొలగమూడి అనువుగా ఉందని భావించి గ్రామానికి వచ్చారు.

Bhagavan Venkaiah Swamy

గొలగమూడిలో స్వామివారి రాకతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ప్రజలు వ్యాధుల బారిన పడిన సందర్భాల్లో తమ బాధలు తీర్చాలని స్వామివద్దకు వచ్చేవారు. అలా వచ్చేవారికి స్వామివారే వడికిన నూలుదారాన్ని రక్షాదారంగా ఇస్తూ ఉండేవారు. అలాగే భక్తులకు అభయమిస్తూ తన వేలిముద్రలు వేసి చీటీలను అందజేసేవారు. ఇవి కాలక్రమంలో సృష్టిచీటీలుగా ప్రసిద్ధి చెందాయి. స్వామివారు పూర్తి నిరాడంబర జీవితం గడిపేవారు. చివరగా 1982 ఆగష్టు 24న యోగనిద్రకు చేరుకున్నారు.

Bhagavan Venkaiah Swamy

ప్రతి నిత్యము ఇచ్చట వేలాది మందికి ఉచిత అన్నసంతర్పణలు జరుగును. ఇంకా ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఆరాధనోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు తమిళనాడు, కర్ణాటక, తదితర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

SHARE