చాముండి ఉగ్ర రూప ధారిణి అయినా శక్తి స్వరూపము.. అమ్మవారి సప్త మాతృకలలో ఒకరు.. దుర్గాదేవి సైన్యమైన 81 మంది తాంత్రిక దేవతలలో ముఖ్యమైన యోగిని చాముండి… సప్త మాతృకలలో మిగిలిన వారిని వారివారి భర్తల శక్తి స్వరూపాలుగా కొలుస్తారు.. కానీ ఒక్క చాముండిని మాత్రం ప్రత్యేకంగా కొలుస్తారు. మరి ఈ చాముండి దేవి అవతార విశేషాలేంటో మనం ఇపుడు తెల్సుకుందాం..
భారతదేశం లోని వివిధ ప్రాంతాలలో చాముండేశ్వరి ఆలయాలు రెండు ఆలయాలు ప్రత్యేకం.. వాటిలో మొదటిది మధ్యప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా లో పాలంపూర్దగ్గరలోలో ఉన్నది. ఇక్కడ దేవిని రుద్ర చాముండగా కొలుస్టారు.. ఇక రెండవది కర్ణాటక రాష్ట్రం మైసూరులోని చాముండేశ్వరి దేవాలయం.. ఇక్కడ అమ్మవారు మైసూర్ రాజ వంశీకుల కులదేవతగా పూజలందుకున్నది..
పూర్వం మహిషాసురుడు అనే మహాబలవంతుడైన రాక్షసుడు మరణంలేని వరాన్ని కోరుతూ ఘోరతపస్సు చేస్తాడు.. అయితే అది అసాధ్యమని బ్రహ్మ తెలుపగా స్త్రీ తప్ప ఇతరుల చేతిలో మరణంలేని వరం పొందుతాడు మహిషాసురుడు… బ్రహ్మ యిచ్చిన వర ప్రభావంతో ముల్లోకాలను జయించి దేవతలను, ఋషులను బాధించుచుండెను… దుష్ట చర్యలతో ప్రజాకంటకుడుగా మారిన మహిషాసురుడు సంహరించుటకు ఆ జగన్మాతే చాముండేశ్వరిగా అవతారము దాల్చి, రాక్షస సంహారము చేసెను. రాక్షస సంహారానంతరం చాముండేశ్వరి మాత మహిషాసురమర్ధినిగా ఖ్యాతి పొందినది. ఈ మహిషాసురుడు పాలించిన ప్రాంతాన్ని మహిషాసురపురముగా పిలువగా కాలక్రమేణా అదే మైసూరుగా మారిందని ప్రతీతి.
మహిషాసుర మారదని అయినా చాముండేశ్వరీ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగవది. మైసూర్ పట్టణమునకు సుమారు 13 కి.మీ. దూరమున ఉన్న చాముండీ పర్వతం పైన ఈ అమ్మవారు కొలువై ఉన్నారు.. ఈ పర్వతం సతీదేవి దివ్యాభరణాలు పడిన ప్రదేశముగా కూడా పురాణ ప్రసిద్ధి. మార్కండేయ పురాణంలో చాముండి దేవి అవతరోత్పత్తి గురించి ప్రస్తావించబడింది. మాత మూడవ అవతారంలో మహామాయ, మహాసరస్వతీ రూపిణిగా శుంభ, నిశుంభలనే రాక్షసులను వధించింది. ఆమె దేహం నుంచి వెలువడిన కాళికాదేవి చండ, ముండలను సంహరించి ”చాముండి”గా ప్రసిద్ధి పొందినది అని పురాణ కథనం.. అందుకె ఈమెను కాళికాదేవి కి దగ్గరగా పోలుస్తారు.. కొన్నిచోట్ల పార్వతి దేవిగా కూడా కొలుస్తారు. చాముండి అమ్మవారు త్రిశూలం, ఖడ్గ ధారిణియై ఉంటుంది.. అమ్మవారి వాహనం గుడ్లగూబగా చెప్తారు.. కొన్నిసార్లు శవ వాహనదారిగా వర్ణిస్తారు.. ఈమె స్మశాన నివాసి.. అందుకేనేమో ఈ అమ్మవారికి జంతుబలిని ఇచ్చి, మద్యంతో నైవేద్యాన్ని నివేదిస్తారు.. తాంత్రిక విద్యలు సిద్దించేందుకు కూడా ఈ అమ్మవారిని ఆరాధిస్తారు..