శస్త్రచికిత్సా విధానాన్ని బోధించిన ఆదివైద్య గురువు ధన్వంతరి గురించి తెలుసా ?

0
250

ఆయుర్వేద వైద్యులకు తొలిదైవం ధన్వంతరి. ధన్వంతరి పుట్టుక గురించి పురాణాల్లో ఓ కథ ఉంది. భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.

Dhanvantariఅప్పుడు సాగరగర్భం నుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి “ధన్వంతరి” అని పేరు పెట్టారు.

1 Rahasyavaani 510క్షీరసాగర మధనంలో ఒకచేతిలో అమృతభాండం, మరో చేతిలో మూలికలతో ఉద్భవించిన ఆదివైద్యుడు ధన్వంతరి. ధన్వంతరి ఆరోగ్యానికి అధిపతి. పరిపూర్ణ ఆయువు కోసం ఘనంగా ధన్వంతరీ వ్రతం చేయడం భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయం. ఏటా కార్తీకమాసంలో ధన్వంతరీ జయంతిని జరుపుకుంటారు. ధన్వంతరీ సూర్యనారాయుణుని ప్రియశిష్యుడు. సూర్యుని వద్దనే ఆయుర్వేదం నేర్చుకున్నాడు. శస్త్రచికిత్సా విధానాన్ని శుశ్రుతనకు బోధించిన ఆదివైద్య గురువు ధన్వంతరి అని అంటారు.

ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా (ఆష్టాంగాలుగా) విభజించాడట. అవి

1.కాయ చికిత్స

2.కౌమారభృత్య లేదా బాలచికిత్స

3.భూతవైద్యం లేదా గ్రహచికిత్స

4.శలాక్యతంత్ర

5.శల్యతంత్ర

6.విషతంత్ర

7.రసాయన తంత్ర

8.వశీకరణ తంత్ర

ఇప్పటికీ ఆయుర్వేదంలో ఈ పద్ధతులు అనుసరిస్తున్నారు.

Dhanvantariకేరళలో సిద్ధ, ఆయుర్వేద వైద్య విధానంలో “అష్టవైద్యం” అనే ఒక విధానం ప్రసిద్ధి చెందింది. ఇది శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా, పెద్దగా మార్పులు లేకుండా సాగుతున్నది. ఇలాంటి వైద్యం చేసే కుటుంబాలు ధన్వంతరిని పూజిస్తుంటారు. తమ ఆశ్రమాలలో ధన్వంతరి ఆలయాలను, విగ్రహాలను ప్రతిష్ఠించారు. అంతేకాదు పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను “ధన్వంతరి” అనే బిరుదుతో సత్కరించేవారు.

 

SHARE