హిజ్రాలు ఆడామగా కాని మూడోవర్గం వాళ్లయినా వాళ్లను పంచముల్లా చూస్తారు చాలామంది. అంతేకాదు, వాళ్లను ఎవ్వరూ చేరదీయరు. ఏడాది పొడవునా ఎన్నో అవమానాలు భరించే హిజ్రాలు ఒక ఉత్సవంలో ఆనందోత్సాహాలతో గడుపుతారు. చెప్పాలంటే ఆ ఉత్సవం కోసమే ఏడాదంతా ఎదురుచూస్తుంటారు. అదే హిజ్రాల పండుగ. ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్లి ముఖ్యమైన వేడుక. కానీ, హిజ్రాలకు ఆ అదృష్టం ఉండదు. కానీ, ఆ ఉత్సవాల్లో వాళ్లు పెళ్లికూతుళ్లవుతారు. అది ఆ పండుగ వాళ్లకిచ్చిన బహుమతి.
ఏడాదంతా బాధలను దిగమింగుకు బతికినవాళ్లకు ఆ మూడురోజులూ సంతోషం అంబరాన్నంటుతుంది. అది ఆ పండుగ తెచ్చిన సంబరం. అదే కూతాండవర్ ఆలయ ఉత్సవం. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని ఉలుందూరుపేటై తాలూకాలోని ‘కూవగం’ గ్రామంలో ‘కూతాండవర్’ హిజ్రాలకు ఆరాధ్య దైవం. ఏప్రిల్, మే మాసంలో వచ్చే చిత్రైలో ఇక్కడ వేడుకలు జరుపుతారు. వారు ఆ దైవాన్ని పెళ్లి చేసుకుంటారు. ఇలావారు పెళ్లిచేసుకుంటే కూతాండవర్ మరణిస్తాడు. మరురోజు స్త్రీ వేషంలోని వారు రోదిస్తూ గాజులు పగలగొట్టుకొని, కొలనులో స్నానాలు ఆచరిస్తారు.
ఇలా చేయడం వెనుక ఓ పురాణ గాథ వుంది. ఓసారి హిజ్రా కృష్ణుడిని, తాను పొందుకావాలని వరం కోరుకుంటాడు. అలా చేస్తే, ఆ పురుషుడు మరురోజే మరణిస్తాడంటాడు. అయినా ఫరవాలేదంటుంది. దీనికి ప్రతిఫలంగా కురుక్షేత్ర సంగ్రామంతో పాండవుల తరఫున యుద్ధం చేస్తానంటాడు. కృష్ణుడు మోహినీ అవతారం దాల్చుతాడు. మోహినీ బాహువులలో బంధించబడతాడు. యుద్ధంలో 18 రోజులు యితోధికంగా సాయపడి విజయం చేకూర్చి మరణిస్తాడు.
ఇప్పటికీ కూవగంలో 18 రోజులు ఉత్సవాలు చేస్తారు. వారు శ్రీకృష్ణుని అవతారంగా భావించి కూతాండవర్‌ను ఆరాధిస్తారు. 17 వ రోజున మంగళసూత్రధారణ చేస్తారు. 18వ రోజు మంగలసూత్రాన్ని, గాజులను, పువ్వులను తీసివేసి రోదిస్తారు.
ఇరావంతుడితో పెళ్లి! కూవాగం లో మామూలు రోజుల్లో పెద్ద హడావుడి కనిపించని ఈ ఊళ్ళో తమిళ చైత్రమాస పౌర్ణమి వచ్చిందంటే వూరంతా జనసంద్రమైపోతుంది. కొన్ని వేలమంది హిజ్రాలు వస్తారు. ఇక్కడే ఉంది కూతాండవర్ ఆలయం. ఈ కూతాండవర్ మరెవరో కాదు అర్జునుడి కొడుకైన ఇరావంతుడు.
హిజ్రాల కథనం ప్రకారం…
కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప వీరుడి బలిదానం జరగాలట. అలాంటి వీరుడు అర్జునుడే అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ, అర్జునుణ్ణి బలివ్వడం ఇష్టంలేక ప్రత్యామ్నాయంకోసం ఆలోచిస్తాడు. అప్పుడు అర్జునుడికీ, నాగకన్య ఉలూపికీ జన్మించిన ఇరావంతుడు గుర్తుకొస్తాడు. అసలు విషయాన్ని ఇరావంతుడికి చెప్పి బలిదానానికి ఒప్పిస్తాడు. అయితే, యుద్ధంలో బలయ్యే ముందురోజు తనకు వివాహం చేయాలని షరతు పెడతాడు ఇరావంతుడు. అప్పుడు గత్యంతరంలేక కృష్ణుడే మోహినీ రూపంలో అతణ్ణి పెళ్లిచేసుకున్నాడట. శ్రీకృష్ణుడి మోహినీ అంశతోనే తాము జన్మించామనీ, మోహినికి భర్త అయిన ఇరావంతుడే తమ దైవమనీ చెబుతారు హిజ్రాలు.
ఆనాడు ఇరావంతుడు, మోహినిల పరిణయానికి సూచికగా ఏటా హిజ్రాలు తమ ఇష్టదైవాన్ని పెళ్లిచేసుకుంటారు. ఆ సందర్భంగా జరిగే జాతరే కూతాండవర్ ఆలయ ఉత్సవం. ఇది ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు హిజ్రాలు. ఇందుకోసం రెండునెలల ముందుగానే షాపింగ్ మొదలుపెడతారు. ఈ ఉత్సవాలకు హాజరవ్వాలనుకునే హిజ్రాలు జిల్లా కేంద్రమైన విల్లుపురానికి వారంరోజులముందే చేరుకుంటారు. ఈ ఉత్సవాల్లో హిజ్రాలు అందం, అలంకరణల ప్రదర్శనకే అధిక ప్రాధాన్యమిస్తారు. పూటకో విధంగా అలంకరించుకుని విల్లుపురం వీధుల్లో తిరుగుతారు. ఈ వేడుకలో హిజ్రాలే కాదు వింత ఆసక్తికొద్దీ ఆడవేషం ధరించాలనుకునే మగాళ్లూ భారీగా పాల్గొంటారు. ఉత్సవంలో భాగంగా విల్లుపురంలో హిజ్రాలకు నృత్యాలూ అందాల పోటీలూ జరుగుతాయి.