మన దేశంలో హనుమంతుడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ హనుమంతుడి ఆలయాలలో ఈ ఆలయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే రాముడు స్వయంగా తన బాణంతో హనుమంతుడి శిల్ప రూపం చేసాడని స్థల పురాణం చెబుతుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? రాముడు ఏ సమయంలో శిల్ప రూపం చేసాడు? ఇక్కడి ఆలయంలో ఉన్న మరిన్ని విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో రాయచోటి- వేంపల్లి మార్గమధ్యలో కడపకు 25 కీ.మీ. దూరంలో పాపాగ్ని నది తీరాన గండికోట అనే ప్రాంతంలో గండి వీరాంజనేయ క్షేత్రం ఉంది. ఈ ఆలయంలో హనుమకు ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడు తన బాణం మొనతో హనుమ ఆకారాన్ని చెక్కటం తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది.
ఇక స్థల పురాణానికి వస్తే, శ్రీరాముడు లంకకు వెళ్లేటప్పుడు హనుమంతుడి తండ్రి అయిన వాయుదేవుడు ఈ ప్రాంతంలో తపోనిష్టుడై ఉన్నాడు. రాముడికి ఆశీస్సులు అందించిన వాయుదేవుడు, తిరుగు ప్రయాణంలో రావణుడిని సంహరించి వచ్చేటప్పుడు ఇదే మార్గంలో రావాలని కోరాడు. వాయుదేవుని కోరిక ప్రకారం సింహళ విజయ యాత్ర ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు రాముడు తన పరివారంతో సహా ఒకరోజు ఇక్కడ బస చేశాడు. వాయుదేవుడు శ్రీరాముడికి స్వాగతం ఇవ్వడం కోసం రెండు కొండలకు మధ్యలో ఒక బంగారు తోరణం నిర్మించాడు. శ్రీరాముడు అక్కడ ఒకచోట విశ్రాంతి తీసుకుంటూ ఒక శిలపై తన బాణపు ఉలితో ఆంజనేయుడి రూపాన్ని చిత్రించాడు. కాలి చిటికెన వేలిని చెక్కేలోగా రాహుకాలం రావడంతో అంతటితో వదిలేశాడట రాముడు. ఆ శిలను అక్కడినుంచి తరలిద్దామని చూడగా, వేలినుంచి రక్తం కారడంతో స్వామి వారక్కడ సజీవరూపులై ఉన్నారని తెలుసుకుని, చేసేదేమీ లేక ఆ స్థలంలోనే ఆలయాన్ని నిర్మించారట. అదే గండి వీరాంజనేయస్వామి దేవాలయం.
ఇక్కడ విశేషం ఏంటి అంటే పాపాఘ్ని నది అయితే పాపాలను నశింపజేసేది కాబట్టి ఈ నదికి పాపాఘ్ని అని పేరు వచ్చింది. కోలార్ జిల్లాలోని నందికొండే నంది పాదమని చెబుతారు. పాపాఘ్ని అంతటా పవిత్రమే అయినా ఐదు స్థలాలలో మరింత పవిత్రతను పంచుకుంది. దీని ఉత్పత్తి స్థానం నంది కొండ ఒకటి, వాయు క్షేత్రంగా గండి రెండవది. కేశవ తీర్థం మూడవది. భాస్కర క్షేత్రంగా ఉన్న వేంపల్లె నాల్గవది, పాపాఘ్ని నది పినాకిని (పెన్నా) నదిలో కలిసే చోటు ఐదవది. ఈ ఐదు స్థానాలలో పాపాఘ్ని నది మహా పవిత్రంగా పరిగణింపబడుతోంది. పాపాఘ్ని నది గండి క్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయానికి ఎదుట దక్షిణం నుండి ఉత్తర ప్రవాహం ఉండటంతో మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది.
ఈవిధంగా స్వయానా శ్రీరాముడే ఆంజనేయస్వామి శిల్పాన్ని తన బాణంతో రూపుదిద్దడంతో ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది.