పరశురాముడు నాగరాజు కోసం తపస్సు చేసిన ప్రాంతంగా దీనిని చెబుతారు. మన్నరశాల అనగా అగ్నికి ఆహుతై చల్లారిన నేల అని అర్ధం. మరి ఈ ఆలయ స్థలపురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళరాష్ట్రంలోని కుమార కోమ్ రిసార్ట్ నుండి 30 కి.మీ. దూరంలో మన్నరశాల అనే క్షేత్రం ఉంది. ఇది అలప్పి పట్టణానికి దగ్గరలో ఉంది. మన్నరసాలలో నాగరాజ స్వామి దేవాలయం కలదు. ఐదుపడగల నాగరాజు ముఖ్యదేవతగా ఇచట పూజలందుకొంటున్నాడు.
ఇక ఆలయ పురాణానికి వస్తే, భూమండలం పై ఉన్న రాజుల నరమేధంతో విసిగిపోయిన పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరివేసినప్పుడు సముద్రుడు గొడ్డలిపడిన మేరకు వెనుకకు మరలిపోయినప్పుడు ఏర్పడిన ఇసుక నేలయే కేరళ రాష్ట్రము అని అంటారు. ఆ ఇసుక నేలను సస్యశ్యామలం చేయడానికి పరశురాముడు నాగరాజును గూర్చి తపస్సు చేసాడని, పరశురాముని తపస్సుకు ప్రత్యేక్షమై నాగరాజు అతని కోరిక మేరకు ఇచటనే ఉండిపోయినట్లు, పరశురాముడు నాగరాజుకు ఆలయం కట్టించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.
మరొక కథనం ప్రకారం, పరశురాముని తరువాతి కాలంలో ఆ గుడి నిర్వహణ ఒక బ్రాహ్మణా దంపతులు చేశారన్నారు. దావాగ్నికి ఆహుతైన అనేక నాగులకు బ్రాహ్మణా దంపతులు సవర్యలు చేసి, కాపాడినందున వారిని కరుణించి స్వయంగా నాగరాజే ఐదుతలల సర్పంగా పుత్రుడిగా జన్మించినట్లు, తరువాత మానవరూపంలో రెండవ కుమారుడు జన్మించినట్లు చెబుతారు. ఆ ఆలయంలో సమాధిలోకి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్న నాగరాజు కోరిక మేరకు అతని తమ్మునిగా జన్మించిన వాని వంశానికి చెందిన స్త్రీలే ఇప్పటికి ఈ ఆలయంలోని నాగరాజుకు పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ ఆలయానికి, సంతానాన్ని పొందడానికి, నాగదోషం నివారించుకోవడానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో పిల్లలకు నామకరణ, అన్నప్రాసన, విద్యారంభంతో పాటు, వివాహాలు కూడా జరుగుతాయి. మహాశివరాత్రి మరుసటి రోజు నాగరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ పిల్లలు కావలసినవారు ఉర్లి అని పిలిచే కంచుపాత్రను నాగరాజుస్వామికి కానుకగా సమర్పిస్తారు.
ప్రతి సంవత్సరం నవంబర్ లో జరిగే నాగరాజు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ గొప్పగా చేస్తారు.