పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం లేకపోవటం వెనుక రహస్యం

0
340

ప్రస్తుతం ఉన్న పూరీ ఆలయ నిర్మాణాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్‌ మొదలుపెట్టాడు. ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్‌ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ రాజు, అల్లుడి కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి తెలివిగా దారిపొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు.

Puri Jagannathan Templeరాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించనిదీ అందుకేనంటారు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.

Puri Jagannathan Templeఅంతే కాక పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.

Puri Jagannathan Temple20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాధ్ ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయంపైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజినీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం

ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు. ఏ ప్రభుత్వమూ దీనిని నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణింపబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది.

Puri Jagannathan Templeపూరీ జగన్నాధ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతి రోజూ 2000 నుంచి 20,000 వరకూ భక్తులు వస్తుంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటుచేసుకోకపోవడం మరో విశేషం. ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం.

సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరీ సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. ఇది సైన్స్ కు కూడా అంతుచిక్కని మిస్టరీ.

SHARE