250 సంవత్సరాల చరిత్ర గల రాజాపేట కోట విశిష్టతలు!

0
315

తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి – భువనగిరి జిల్లా, రాజాపేట గ్రామంలో ఉంది చారిత్రాత్మక రాజాపేట కోట. యాదగిరిగుట్టకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి 250 సంవత్సరాల చరిత్ర ఉంది. తెలంగాణలో అత్యధిక ఆదాయం వచ్చే సంస్థానాల్లో ఒకటిగా పేరు పొందిన ఈ కోటను 1775లో రాజరాయన్న అనే రాజు నిర్మించాడు. అక్కడ రాజాపేట గ్రామాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ కాలంలో ఈ ప్రాంతం నుండి సుమారు 50వేల నుండి ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చేదట. అలనాటి మహోన్నత వైభవానికి, గత కాలపు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది రాజాపేట కోట.

Rajapetనిజాం రాచరిక పాలనలో గొప్ప చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన ‘రాజాపేట కోట’ నేటికీ వేలాది పర్యాటకులను ఆకర్షిస్తోంది. కోటలోని అద్భుత శిల్పకళ సందర్శకులను అబ్బురపరుస్తోంది. ఈ కోట చుట్టూ 18 అడుగుల ఎత్తుతో శత్రు దుర్భేద్యమైన రాతి గోడను కట్టించారు. శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి కోట లోపలి నుంచి రహస్య సొరంగ మార్గాలు తవ్వించారు. కోట లోపల అతి సుందర రాజ భవనాలు, రాణుల అంతఃపురాలు, మంత్రులు, సేనాపతుల ఆవాసాలతో పాటు, స్నానవాటికలు నిర్మించారు. శత్రుసైన్యం లోపలికి ప్రవేశించకుండా కోట గోడల ముందు 20 అడుగుల లోతైన పెద్ద కందకం తవ్వించి అందులో ఎల్లప్పుడూ నీరు ఉండటానికి వీలుగా ఎగువన పడమటి వైపు గోపాలచెర్వు నుంచి కందకంలోకి నీరు నిరంతరం పారించారు. అందులో మొసళ్ళను పెంచేవారు. విష సర్పాలను వదిలేవారు. కోట ముఖ ద్వారానికి 32 అడుగుల ఎత్తయిన ధృడమైన ద్వారాలను అమర్చారు. మొదటి ముఖ ద్వారం నుంచి మూడో ముఖ ద్వారం వరకు విశాలమైన సుదీర్ఘమైన రాచమార్గం ఉంది.

Rajapetరెండున్నర శతాబ్ధాల క్రితం నిర్మించిన రాజు నివాసం, అంతఃపురం, అద్దాల మేడ, అతిథి గృహాలు, స్నానవాటికలు, గిరిగిరిమాల్‌, ఎత్తైన బురుజులు, కారాగారం, మంచినీటి కొలను, నాటి సైనికుల శిక్షణ స్థలం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రధాన ద్వారం దాటిన తర్వాత మహా రాజ నివాసమయిన రెండవ కోట కనిపిస్తుంది. దానిక్కూడా ఎత్తయిన ప్రధాన ద్వారం ఉంది. అడుగడుగునా సైనికుల పహారా నిరంతరం కొనసాగడానికి వీలుగా నిర్మించిన కట్టడాలు మనల్ని అబ్బురపరుస్తాయి. కోటలోని శిల్పకళ పాలకుల కళాతృష్ణను తెలియజేస్తుంది. దర్వాజలు, బాల్కానీలు, బురుజులను అందంగా నిర్మించడంతోపాటూ అద్దాల మేడపైకి చేరుకునేందుకు చార్మినార్ లాగా మెట్లు కూడా ఏర్పాటుచేశారు. భవనంలోని గదుల్లో చెక్కిన శిల్పాలు, సింహాసనాలను పోలిన కుర్చీలు ఇప్పటికీ కనిపిస్తాయి. ప్రస్తుతం ఇవన్నీ జీర్ణావస్థలో ఉన్నాయి. ఈ కోటలో ఒక దేవాలయంతో పాటు లోతైన పెద్దభావి ఉంది. ఎందరో రాజుల దండయాత్రలను, రణతంత్రాలను, గెలుపోటములను తనలో దాచుకున్న రాజాపేట కోట నిజాం నవాబుల కాలంలో మరింత ప్రత్యేకంగా నిలిచింది. రాజకీయ శక్తుల సమీకరణలో రాజ్యస్థాపనలో ముఖ్యపాత్ర వహించింది.

Rajapetస్థలపురాణం ప్రకారం… పూర్వం రాజాపేట గ్రామ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేది. రాజా రాయన్న కోట నిర్మాణానికి తగిన ప్రదేశాన్ని వెదుకుతూ ఆలేరు ప్రాంతాన ఉన్న గుండ్లగూడెం దగ్గర కొంత భాగంలో కోట నిర్మాణం చేశాడు. అనంతరం ఆ గ్రామం గురించి తెలుసుకొని కోట నిర్మాణానికి అది అనువైన ప్రాంతం కాదని భావించి కోట కట్టడం ఆపించేసాడు.మరో ప్రాంతంలో తనపేరుతోనే కోట నిర్మాణం జరగాలని నిర్ణయించుకొని రాజాపేట ప్రాంతానికి వచ్చాడు. ఒక చోట అతనికి అమ్మవారి దేవాలయం కన్పించింది. ఆ దేవాలయ సమీపంలోని కొండల్లో కొందరు మునులు తపస్సు చేస్తూ కనిపించారు. ఆ మునులకు రాయన్న భక్తి ప్రపత్తులతో నమస్కరించి తన మనసులోని కోరికను వెల్లడించాడు. అందుకు ఆ మునులు సంతోషించి రాయన్నకు కోట నిర్మాణానికి అనువైన స్థలాన్ని చూపించారు. వారు చూపించిన స్థలంలో ఆయన కోట మరియు నగరాన్ని నిర్మించి రాయన్నపేటగా నామకరణం చేశాడు. రాయన్నపేటే క్రమంగా రాజాపేటగా మారింది.

Rajapetనాటి నిజాం నవాబుల పాలనలో మొత్తం 14 సంస్థానాలు ఉండేవి. అందులో సంస్థాన్‌ నారాయణపురం, సంస్థాన్‌ రాజాపేటలను ప్రధాన పాలనా కేంద్రాలుగా చేసుకొని వారు పాలనా కార్యకలాపాలు జరిపేవారు. ‘రాజరాయన్న’ తరువాత రాజా వెంకటనారాయణరావు బహదూర్‌ కొంతకాలం రాజ్యాధికారం చేసాడు. ఈయన రాజాపేట గ్రామంలోని వేంకటేశ్వరస్వామి (మఠం) దేవాలయానికి క్రీ.శ. 1782లో షాకరుదాసు బైరాగికి కొంతభూమిని దానం చేశాడు. రాజా వెదిరె వెంకటనారాయణరావు తన పేరుతో నారాయణపురం సంస్థానాన్ని స్థాపించాడు.

ఆయన అనంతరం భార్య జానకమ్మ సంస్థాన పాలన కొనసాగించింది. ఆ కాలంలో దేవాలయాలు, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం సంస్థానంలో అనేకంగా చేపట్టారు. కొంత భూమిని పేదలకు దానం చేశారు. వీరి కాలంలో పాలన అత్యంత వైభవంగా జరిగిందని పెద్దలు చెబుతుంటారు. అనంతరం రాజా వెదిరి వెంకటనారాయణరావు కుమారుడు రాజా జశ్వంత్‌రావు ఈ ప్రాంతాన్ని చాలాకాలం పాటు పరిపాలించారు. వీరి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడింది. అక్కడి నుంచే సంస్థానానికి సంబంధించిన ఆస్తులని, కోటని స్థానికుల సహాయంతో కాపాడుకుంటున్నారు. రాజాపేట సంస్థానాధీశులు మహా శివభక్తులు. ప్రతిదినం శివపూజ లేనిదే వారు భోజనాలు చేసేవారుకారు. రాజాపేట నుండి నారాయణపురానికి వెళ్ళే దారిలోని వలిగొండ గ్రామాన శివాలయం నిర్మించి, దేవుని పేర భూదానాలు చేశారు. నారాయణపురానికి వెళ్ళే సందర్భంలో వలిగొండలో వారు తప్పకుండా మజిలీ చేసేవారు.

SHARE