Home Unknown facts జీవకోటి ఆకలి తీర్చిన శాకాంబరీ దేవి గురించి తెలిస్తే పూజించకుండా ఉండలేరు..!

జీవకోటి ఆకలి తీర్చిన శాకాంబరీ దేవి గురించి తెలిస్తే పూజించకుండా ఉండలేరు..!

0

నవరాత్రులలో ఒక రోజు అమ్మవారిని అనేక రకాల కాయగూరలతో, ఫలాలతో, శాస్త్ర ప్రకారం అలంకరించి శాకాంబరీ అవతారం గా కొలిచి దేవాలయాల్లో అర్చనలు జరుపుతుంటారు. అయితే శాకాంబరీ దేవిని ఆషాఢంలోను పూజిస్తారు. ఏరువాక పూర్ణిమ అంటే భూమిని దున్నటం ప్రారంభించేరోజు. పూర్వం ఈరోజును పండగలా చేసుకునేవారు. ఇప్పటికి కొన్ని గ్రామాలలో ఈ పండగను జరుపుకుంటూనే ఉన్నారు. ఈ పండుగ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష పూర్ణిమనాడు వస్తుంది. ఈ సమయానికి ఋతుపవనాలు ప్రవేశించి తొలకరిజల్లులు కురుస్తాయి. దీనితో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. జ్యేష్ఠ మాసం తరువాత వచ్చే ఆషాఢ మాసంలో జగన్మాతను శాకంబరీదేవిగా పూజించడం ఆచారం.

Shakambari Deviమనందరికీ తెలిసిన ప్రకారం శాకాహారం అంటే కూరగాయలు. వివిధ కూరగాయలతో అలంకరించి పూజిస్తాము కనుక ఈ తల్లిని శాకంబరీ దేవి అంటాము. ఈ విధంగా పంట తొలిదశలో వున్న సమయంలో అమ్మవారిని పూజించడం వలన పంటలు సమృధ్దిగా పండుతాయనీ, పాడిపంటలకు లోటు ఉండదనీ విశ్వాసం. ఆహారాన్ని లోటు లేకుండా ప్రసాదించే చల్లని తల్లి ఈ శాకంబరీదేవి.

మార్కడేయ పురాణంలోని చండీసప్తశతితో పాటు దేవీ భాగవతంలో శాకాంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది. ‘నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు… అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు… వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను.. నా శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను.. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షీదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టించి, మళ్లీ వర్షాలు పడేంత వరకు ప్రజల ఆకలి తీర్చి, ప్రాణాలను రక్షిస్తాను. అందువల్లనే నేను శాకాంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతానని’ అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది.

పురాణాల్లో చెప్పిన విధంగా పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు తపస్సు ద్వారా బ్రహ్మ ని మెప్పించి, వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానివలన, లోకంలో అందరు, వేదమంత్రములు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపొయారు.పూజలు, యజ్ఞాలు మొదలైనవి లేక పోవటంతో, దేవతలకు హవిస్సులు అందక, కోపించారు అందువల్ల , లోకంలో వర్షాలు లేక భూమి ఎండిపోయి బీటలు వారింది. పంటపొలాలు కూడా బీడు వారి భయంకరమైన కరువు కాటకాలు రావటంతో ప్రజలు చాల బాధలు పడుతూ అన్న పానీయాలు లేక మాడిపోసాగారు.

అపుడు ఋషులంతా హిమాలయాల మీధికి వెళ్లి అమ్మవారిని దీనంగా ప్రార్ధించారు. వారి వేదన తీర్చటానికి అమ్మ వారు అమితమైన కరుణతో “శతాక్షి” గా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకం లో వున్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచం వ్యవధి పడుతుంది కాబట్టి, మరి ప్రజల ఆకలి వెంటనే తీర్చాలి కాబట్టి, అమ్మవారు అమితమైన దయతో శాకంబరి రూపు దాల్చి వివిధమైన కాయగూరలు పళ్ళతో సహా ఒక పెద్ద చెట్టు లాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో ఇచ్చింది అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకంబరి అవతారం.

ఈ సమయంలోనే దుర్గముడనే రాక్షసుని సంహారించిన జగన్మాత దుర్గాదేవిగా కీర్తిపొందింది. శాకాంబరీ దేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న దేవి కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది.

ఈ శాకాల సముదాయం అంతులేని కోర్కెలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి. జీవులకు కలిగే ఆకలి దప్పి, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయి. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించే పరమేశ్వరిని శాకాంబరీ, శతాక్షి, దుర్గ అనే పేర్లతో కీర్తింపబడుతుంది. ఈ దేవి శోకాలను దూరం చేసి, దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేయడమే కాదు పాపాలను పోగొడుతుంది. ఉమాగౌరీ సతీ చండీ కాళికా పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది. ఈ శాకాంబరీ దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు. నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు.

 

Exit mobile version