పరమశివుడు యొక్క 5 పుణ్యక్షేత్రాలను పంచారామాలు అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించే సమయంలో తారకాసురుని నోట్లో ఉన్న శివలింగం ముక్కలై 5 ప్రదేశాల్లో పడింది వాటినే పంచారామాలు అని పిలుస్తున్నారని పురాణం. అందులో ఒకటిగా చెప్పే ఈ ఆలయంలో పౌర్ణమి, అమావాస్య రోజుల్లో శివలింగ దర్శనం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. మరి ఈ శివలింగాన్ని ఎవరు ప్రతిష్టించారు. ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం కి కొంత దూరంలో గౌతమి నది తీరాన గునిపూడి అనే గ్రామములో శ్రీ సోమేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం పంచారామాలలో ఒకటిగా భక్తులచే పూజలందు కొనుచున్నది. ఇక్కడి శివలింగం చంద్రునిచే ప్రతిష్టించబడినందున దీన్ని సోమేశ్వర లింగం అని కూడా అంటారు. తూర్పు చాళుక్యులలో మొదటి వాడైనా చాళుక్యభీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతుంది.
ఈ ఆలయంలోని శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించడం వలన ఈ శివలింగం పైన పదహారు కళలు కనిపించును అని చెబుతారు. ఈ ఆలయంలో శ్వేతవర్ణంలో ఉండే ఈ శివలింగం క్రమ క్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమవర్ణముకు మారిపోతుంది. మళ్ళి తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాతదంగా శ్వేతవర్ణంలోకి కనిపిస్తుంది. ఇలా ఇక్కడి శివలింగం రంగులు మారుతుంది కనుక పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఈ ఆలయంలోని శివలింగ దర్శనం ఒక అద్భుతం అని చెబుతారు.
ఈ ఆలయ పురాణానికి వస్తే, ఒకసారి దేవతలు ఈ ఆలయ క్రిందిభాగాన్ని నిర్మించి తెల్లవారు కాకముందే అక్కడ శివుడిని ప్రతిష్టించి వెళ్లిపోగా, ఇలా శివుడిని ఒక్కడినే ప్రతిష్టించి అమ్మవారిని ప్రతిష్టించకపోవడంతో శివుడికి ఆగ్రహం వచ్చినది అంటా, అప్పుడు దేవతలు మళ్ళీ ఒక రాత్రి సమయంలో వచ్చి ఆలయంలో మరొక అంతస్థుని నిర్మించి అందులో అన్నపూర్ణాదేవిని ప్రతిష్టించి శివుడిని శాంతిపజేశారని స్థల పురాణం.
ఇక్కడి ఆలయం ముందు ఒక కోనేరు ఉంది. ఈ కోనేరు గట్టున రాతిస్థంభం పైన ఒక నందీశ్వరుని విగ్రహం ఉన్నది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే ఆలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్థులో ఉంటె అదే గర్భాలయ పై బాగాన రెండవ అంతస్థులో అన్నపూర్ణాదేవి ఉంటుంది.
ఈ ఆలయంలో ఐదు నందులు ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని ఐదు నందుల ఆలయం అని కూడా అంటారు. ఈ శివలింగం ను ప్రార్ధించిన వారికీ సర్వ వ్యాధులు తొలుగునని, పంచ మహాపాతకములు హరించునని భక్తుల నమ్మకం. ఇక్కడి ఆలయంలో అర్చనలు, ప్రత్యేక పూజలే కాకా దసరా ఉత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, మహా శివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు మహా వైభవముగా జరుగును. ఈవిధంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ శివలింగాన్ని పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు.