తిరుమల తిరుపతి లో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా స్వయంభువుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. మరి ఆనంద నిలయం ఎవరు కట్టించారు? శ్రీవారితో పాటుగా గర్భగుడిలో ఉన్న ఆ నలుగురు ఎవరనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ వేంకటేశ్వరస్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి నిలచిన ప్రాంతమే గర్భాలయం. దీనినే ఆనంద నిలయం అని అంటారు. ఈ ఆనంద నిలయంపైన బంగారు గోపురం నిర్మించారు. దీనినే ఆనంద నిలయం విమానం అంటారు. అయితే భక్తుల కోర్కెలు నెరవేర్చేందుకు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే స్వయంభవుగా వెలసిన స్వామివారిని చూడగానే భక్తులకి ఆ శ్రీమహావిష్ణువుని నిజంగా చూసిన అనుభూతి కలిగి అన్ని బాధలను మర్చిపోయే ఆనందం కలుగుతుంది. అందుకే భక్తుల సంతోషానికి గుర్తుగా స్వామివారు వెలసిన ఈ ప్రాంతాన్ని ఆనంద నిలయం అని పిలుచుకుంటారు.
ఇక 12 వందల ఏళ్ళకుపైగా చరిత్ర కలిగిన ఆనంద నిలయం అణువణువు అబ్బురపరిచే నిర్మాణమే. నాటి కట్టడాల శిల్పసౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. మూడు అంతస్తులు కలిగిన ఈ కట్టడంలో ఎన్నో శిల్పాలు కొలువుదీరాయి. క్రీ.శ 839 లో పల్లవ రాజైన విజయదంతి విక్రమ వర్మ ఈ గోపురానికి పూత వేయించాడు. ఈ బంగారు పూత వేసే ప్రక్రియ దాదాపుగా 430 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. క్రీ.శ 1262లో పాండ్య రాజు సుందర పాండ్య జతవర్మ గోపురానికి బంగారు పూత వేసే కార్యక్రమాన్ని పూర్తిచేశారు.
తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. వీటినే పంచ బేరాలు అని అంటారు. భేర అంటే విగ్రహం.
ద్రువభేరం:
తిరుమలలో నిత్యం భక్తులు దర్శించుకునే మూలవిరాట్టుని ధ్రువబేరం అని అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేదని అర్ధం. ఈ మూలవిరాట్టు ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ స్వామివారి పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి ప్రతి రోజు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు రోజంతా కూడా ఆరాధనలు జరుగుతాయి.
భోగ శ్రీనివాసమూర్తి:
గర్భగుడిలో ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు.
ఉగ్ర శ్రీనివాసమూర్తి:
శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉండే ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. 11వ శతాబ్దం వరకూ కూడా శ్రీనివాసమూర్తి ఉత్సవ విగ్రహంగా ఉండేది. అయితే క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు.
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి:
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి ఉత్సవ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. . ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.
కొలువు శ్రీనివాసమూర్తి:
గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అని అంటారు.
తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్న ఆనంద నిలయం ఇప్పటికే భక్తజనంలో ఆనందాన్ని నింపుతూనే ఉంది.