శివుడు లింగరూపంలో, శేషశయనుడైన శ్రీ మహావిష్ణువు, విష్ణువు నాభి కమలము నుండి ఉత్భవించిన బ్రహ్మదేవుడు ఇలా త్రిమూర్తులు దర్శనమిచ్చే అధ్బుత ఆలయం ఇదేనని చెప్పవచ్చును. మరి త్రిమూర్తులు దర్శనం ఇచ్చే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలో నిలకంట్ అనే ప్రదేశంలో శ్రీ నీలకంటేశ్వరాలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. ఈ ఆలయానికి దాదాపుగా 1400 సంవత్సరాల చరిత్ర కలదు. ఈ ఆలయాన్ని జైన, ఆర్య, శిల్పకారుల కళానైపుణ్య సమ్మేళనంతో నిర్మించినట్లు చెబుతారు. ఇది మొదటగా జైన ఆలయమని తెలియుచున్నది. శాలివాహన రాజు అయినా రెండవ పులకేశి జైనమతాన్ని ఆచరించి ఈ ఆలయాన్ని కట్టించాడని చరిత్ర.
ఇక ఆ తరువాత ఈ ఆలయం కాకతీయుల వశమైనది. వారు శైవ సంప్రదాయానికి చెందినవారు కావడం వలన ఈ ఆలయాన్ని శివాలయంగా మార్చారు. ఇక్కడ శివుడు నీలకంటేశ్వరస్వామిగా పూజలందుకొనుచున్నాడు. అందుకే ఈ గ్రామానికి నీలకంటేశ్వరం అనే పేరు వచ్చినది.
ఈ ఆలయంలో సృష్టి, స్థితి, లయ కర్తల స్వయంభు ఆలయముగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ స్వయంభువు నీలకంటేశ్వరలింగం, శేషశయనుడైన శ్రీ మహావిష్ణువు, విష్ణువు నాభి కమలము నుండి ఉత్భవించిన బ్రహ్మదేవుడు కూడా మనకి దర్శనం ఇచ్చును. అందుకే ఇది త్రిమూర్తుల క్షేత్రంగా విరాజిల్లుతుంది.
శివ, వైష్ణవ సంప్రదాయాలతో మేళవించిన ఈ ఆలయం తూర్పుముఖంగా, గర్భాలయం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలుగా ఉన్నది. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో ఇతర దేవత మూర్తులు కూడా భక్తులకి దర్శనం ఇస్తుంటారు.
త్రిమూర్తులు కొలువై ఉన్న ఈ ఆలయంలో నిత్యపూలతో పాటు కార్తీకమాసంలో ప్రత్యేక పూజలు, రథసప్తమి, సంక్రాంతి, మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు మహావైభవముగా జరుగుతాయి.