నీటిమీద తేలుతూ దర్శనం ఇచ్చే విష్ణుమూర్తి ఆలయం ఎక్కడ ఉంది ?

విష్ణు మూర్తిని తలచినంతనే శేషతల్పం మీద శయనించిన అనంత పద్మనాభుడి సమ్మోహన రూపం మన కనులముందు సాక్షాత్కరిస్తుంది. కానీ, స్వామి యోగనిద్ర భంగిమలో, నింగి వైపు చూస్తున్నట్లుగా విగ్రహం ఉండే క్షేత్రం నేపాల్‌లోని ఖాట్మండు లోయలోని బుద్ధ నీలకంఠ ఆలయం. అయిదు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం నీటిమీద తేలుతూ ఉండటం ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత.

Vishnu Temple Kathmanduబుద్ధ నీలకంఠ ఆలయం.. ఈ పేరు వినగానే ఇదేదో బుద్ధిడి ఆలయం అనుకోకండి. ఇది ముమ్మాటికీ ఆ నారాయణమూర్తి క్షేత్రమే. బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలి రంగు విగ్రహం అని అర్థం. స్వామి పేరుమీదుగానే బుద్ధనీలకంఠ అనే ఊరి పేరు కూడా స్థిరపడి పోయింది. ఈ ఆలయాన్ని నారాయణంతన్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత ఏమిటంటే, సుమారు అయిదు అడుగుల పొడవున్న ఈ భారీ రాతి విగ్రహం నీటి మీద తేలుతూ ఉండటమే. ఈ కారణంగానే భక్తులనే కాకుండా పర్యటకులనూ ఎక్కువగా ఆకర్షిస్తోంది బుద్ధనీలకంఠ క్షేత్రం.

Vishnu Temple Kathmanduఈ భారీ రాతి విగ్రహం వందల సంవత్సరాల నుంచీ నీటిలో తేలుతూ ఉందని ఈ ఆలయం మీద జరిగిన అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిదాని ప్రకారం… ఒక రైతు తన భార్యతో కలిసి పొలం దున్నుతుండగా, ఒక చోటుకు రాగానే నాగలి ఆగిపోయింది. అక్కడ భూమిలో నాగలి దిగిన ప్రదేశం నుంచి రక్తం బయటకు రావడం కనిపించింది. రక్తం వస్తున్న ప్రాంతంలో భూమిని తవ్వగా, భారీ విగ్రహం బయట పడింది. ఆ తర్వాత గ్రామస్థుల సహాయంతో ఈ విగ్రహాన్ని ఇప్పుడున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. మరో కథనం ప్రకారం… ఏడో శతాబ్దంలో నేపాల్‌ ప్రాంతాన్ని గుప్త రాజు విష్ణుగుప్తుడు పాలించేవాడు. ఇతడికి సామంత రాజూ, ఖాట్మండు లోయను పాలిస్తున్న లిచ్చవి వంశీయుడైన భీమార్జున దేవుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి, ఇక్కడ ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతారు. ఇక్కడ యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఒక్కసారిగా చూస్తే పరమ శివుడి ఆకృతిలో కనిపిస్తుందట.

Vishnu Temple Kathmanduవిష్ణుమూర్తి ఆలయాల్లో లేదా వైష్ణవ సంప్రదాయంలో ఏకాదశి రోజును పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తిక మాసాన్ని చెబుతారు పండితులు. ఈ రెండింటినీ కలగలుపుతూ బుద్ధనీలకంఠ ఆలయంలో కార్తిక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే శివుడు హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నప్పుడు ఆ వేడి తాళలేక ఈ ప్రాంతానికి వచ్చాడనీ ఇక్కడి కొలనులో నీళ్లు సేవించగానే మంట తగ్గి, కొంతసేపు సేదతీరాడనీ భక్తుల విశ్వాసం. దానికి గుర్తుగానే ఈ ఆలయంలో కార్తిక మాసం మొత్తం ఉత్సవాలు నిర్వహిస్తారు.

Vishnu Temple Kathmanduఆ నెలరోజులూ ఈ ప్రాంతం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. కార్తిక శుద్ధ ఏకాదశి రోజున హరిబోధిని మేళాను నిర్వహిస్తారు. ఈ పండగ ముఖ్య ఉద్దేశం నిద్రపోతున్న మహావిష్ణువును మేల్కొల్పడం. ఈ మేళాలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. మేళతాళాలతో భజనలతో ఆ రోజు ఈ ప్రాంతమంతా విష్ణునామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR