నేను చూసివచ్చిన సముద్రం ఊసేమని చెప్పనూ
నా టెలివిజన్ కన్నుల్లో విను
నా మనసుమీద చెవిపెట్టి చూడు
నేనే క్యాసెట్‌నై రికార్డ్ చేసుకొని వచ్చిన
సముద్రం సంభాషణను విను
ఎన్ని యుగాలనుంచి ఎన్ని తరాలనుంచి
ఎన్ని దశలు ఎన్ని అవస్థలు, ఎన్ని వ్యవస్థలు
పడిలేస్తూ నడకలు, పరుగులుగా
సముద్రం నన్ను చూడాలని
సీమాంతాల నుంచో
చీకటి చెల్లిన చోటునుంచో
సముద్రం మొదలైన చోటునుంచో
నడచి వచ్చిందో
అలలు అలలుగా
తెరలు తెరలుగా
తరగలు తరగలుగా
ఎగసిపడి కెరటమై వచ్చిందో
చీకటి సముద్రం, నల్లటి సముద్రం
నీలం సముద్రం, ఆకుపచ్చని సముద్రం
మెత్తని తెల్లని
నురుగులాంటి చిరునవ్వుతో నన్ను తాకింది
అన్ని సముద్రాలలో తానై
తనలో అన్ని సముద్రాలై
నా కాలివేళ్లలో మునివేళ్లు పోనిచ్చి పిలిచింది,
వేళ్ల సందులలో నీళ్లు నింపుతూ సముద్రం
విభజింపబడ్డ భూభాగాన్ని
కలుపుతూ సముద్రం
నిలచిన గులకరాళ్లను అరగదీస్తూ
నా నిలచిన పాదాల కింద
నీళ్ల చక్రాలు తిప్పుతూ
సముద్రం రైలు,
సముద్రం బయలు, సముద్రం మొయిలు
సముద్రం జీవితం స్టయిలు
బతుకుపోరును
సముద్రం హోరులో విన్నాను
బతుకు లోతును
సముద్ర కెరటంలో
బతుకురీతిని
పరచుకున్న సముద్ర వైవిధ్యంలో
చదువుకున్నాను.
ఏమున్నది సముద్రం
నీళ్లూ, ఉప్పూ
ఉప్పెనా తప్ప
ఏమున్నది జీవితం
చీమూ నెత్తురూ
పోరాటం తప్ప
ఒక్క క్షణం నిలవనీని నిరంతర ఘోష
ఒక్క క్షణం ఆగని నిరంతర చలనం
సముద్రం తప్ప సముద్రాన్ని
ఏ కవిత్వం కళ్లకు కట్టగలదు
పోరాటం తప్ప జీవితాన్ని
ఏ చీకటి వెలుగులు వివరించగలవు
తనను చూడమని చెప్పింది సముద్రం
జీవించి పోరమని చెప్పింది సముద్రం
హోరుమని చెప్పింది సముద్రం
సముద్రం వైరుధ్యాల పుట్ట
సముద్రం వైరుధ్యాల పరిష్కారం
సముద్రం వైవిధ్యాల గుట్టు
సరిహద్దుల్ని చెరిపేసే పరసీమ సముద్రం
గదిలో కూర్చొని సముద్రాన్ని రాయబోతే
కాళ్ల కింద నీళ్లు
సముద్రపు మంటలాగా
కళ్లల్లో నీళ్లు
ప్రజా సముద్రపు బాధలాగా
గుండెలో సముద్ర ధ్వని
శ్రీకాకుళాన్ని నెమరేసే కరీంనగర్ లాగా
ఇవాళ సముద్రం
సామ్రాజ్యవాది మరణశయ్యలాగున్నది
ఇవాళ సముద్రం
కల్లోల నక్సల్బరీలాగున్నది
సముద్రానికి స్వేచ్చ లేదు
నాకూ స్వేచ్చ లేదు
సముద్రం మహా సంక్షోభం లేదు
ఆ సంక్షోభంలో నేనున్నాను
సముద్రం ఆటుపోటుల్లోని
అలను నేను కలను నేను కలతను నేను
గొప్ప శాంతి కోసం మహా సంక్షోభంలో
స్వేచ్చను కోల్పోయిన సముద్రాన్ని నేను
స్వేచ్చను వెతుక్కుంటున్న నీటి చుక్కను నేను
~ వరవరరావు