వినాయకుడు వెలసిన ఆలయాలలో ఇది చాలా ప్రసిద్ధ దేవాలయం అని చెప్పవచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లో స్వయంభువుగా వెలసిన విఘ్నేశ్వర స్వామివార్ల విగ్రహాలు గల దేవాలయాలు రెండేనని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా కేంద్రం నుండి 30 కి.మీ. దూరంలో చోడవరం అనే గ్రామం కలదు. ఈ గ్రామంలోనే స్వయంభువు సర్వసిద్ది వినాయకుడి ఆలయం ఉంది. అయితే చిత్తూరు జిల్లాలోని కాణిపాకం తరువాత అంతటి పేరున్న సర్వసిద్ది వినాయకుడు ఈ చోడవరంలో స్వయంభువుగా వెలిసాడు. వినాయకుడు స్వయంభువుగా వెలసిన ఆలయాలు ఈ రెండేనని చెబుతారు.
ఇక్కడి స్వయంభువు వినాయకుని విగ్రహానికి 15 వ శతాబ్దంలో మత్స్య వంశరాజులు ప్రతిష్ట చేసినట్లు స్థల పురాణం ప్రకారం తెలియుచున్నది. అయితే ఇక్కడి విగ్నేశ్వరుడిని స్థానిక శివాలయంలో ప్రతిష్టించాలని పూర్వికులు తలచి అందుకోసం త్రవ్వకాలు జరిపించగా వినాయకుని తొండం చివరి భాగం కనిపించలేదు. అలా తొండం చివరి భాగం వెతుక్కొంటూ తవ్వగా ప్రస్తుతం ఆలయం ఎదురుగా ఉన్న పాత చెరువులో కనిపించింది. తొండం కనిపించిన భాగాన్ని ఏనుగుబోదె అని పిలుస్తారు.వినాయకుని తొండం చివర ఇంకా భూమిలోనే నిక్షిప్తమై ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ స్వయంభు వినాయకుడిని దర్శించుకుంటే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ వినాయకుడిని సర్వసిద్ది వినాయకుడంటారు. ఇలా వినాయకుడు స్వయంభువుగా వెలసిన ఈ ఆలయంలో నిత్యధూప, దీప నైవేద్యాలతో విరాజిల్లుతుంది. ఇక్కడ గణపతి నవరాత్రులు గొప్పగా నిర్వహిస్తారు.