ప్రతి పూజలో ముందుగా వినాయకుడిని పూజిస్తారు ఎందుకంటే అయన సకల దేవతాగణములకు అధిపతి. అయితే వినాయకుడిని మనం గణపతి, విఘ్నేశ్వరుడు, గణేశుడు, గణనాయకుడు ఇలా అనేక రకాల పేర్లతో పిలుచుకుంటాము. అలా మనం పిలుచుకునే పేర్లలో చింతామణి అనే పేరు కూడా ఒకటి. మరి వినాయకుడికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ పేరు పెట్టడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ విషయానికి వస్తే, అభిజిత్ అనే రాజు ఉండేవాడు. అతనికి ఘనుడు అనే అతి దుష్టుడైన రాకుమారుడు ఉండేవాడు. ఆ రాకుమారుడు నిస్సహాయులుగా ఉన్న జనులను, మునులను ఎన్నో బాధలుపెట్టేవాడు. ఒకసారి వేటకోసం వనానికి వెళ్లిన ఘనుడు ఆ వనంలో ఉన్న కపిలముని ఆశ్రమానికి వెళ్లాడు. కపిలముని అతన్ని భోజనానికి ఆహ్వానించాడు. ఆ ముని కుటీరంలో మాకు ఎటువంటి భోజనం లభిస్తుంది అని ఘనుడు ఆలోచించ సాగాడు. అయితే కందమూలాలు, ఆకులు అలములు పెడతాడా! అని మనసులో అనుకున్నాడు.
కాసేపయ్యాక చూస్తే కుటీరం సమీపంలోనే ఒక మండపం కనిపించింది. వెళ్లి చూస్తే అందులో ఆసనాలు, వెండి పాత్రలు, రకరకాల ఆహారపదార్థాలు సిద్ధం చేసి ఉన్నాయి. కపిలముని ఎంతో ప్రేమగా ఘనుడికి, అతని సైన్యానికి భోజనం పెట్టాడు. ఆ వైభవం చూసి ఘనుడు ఆశ్చర్యపోయాడు. ఇంత తక్కువ సమయంలో అంత ఘనంగా ఏర్పాట్లు ఎలా చేశాడు అని ఆలోచించసాగాడు. ఆ విషయమే కపిలమునిని అడిగాడు. అప్పుడు కపిలముని నేను ఒకసారి ఇంద్రునికి సాయం చేశాను. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై నాకు చింతామణిని ప్రసాదించాడు అని చెప్పాడు. ఆ మణిని చూసిన ఘనుడు నాకు ఇవ్వమని అడిగాడు. అందుకు కపిలముని అంగీకరించలేదు.
దాంతో ఘనుడు బలవంతంగా లాక్కున్నాడు. జరిగిన దానికి కపిలముని చాలా బాధపడ్డాడు. సహాయం కోరుతూ విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై గణేషున్ని ప్రార్థించమని చెప్పాడు. అప్పుడు కపిలముని ఘోర తపస్సు చేసి గణనాథుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. జరిగినదంతా చెబితే ఘునుడి దగ్గరి నుంచి మణిని తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాడు.
అప్పుడు గణేషుడు తన సైన్యంతో వెళతాడు. అప్పుడు ఘనుడు తండ్రి మాట వినకుండా గణేషునితో యుద్ధానికి దిగుతాడు. చివరకు గణేషుడు పరసుతో ఘనుడి శిరస్సు చేధిస్తాడు. తరువాత ఘనుడి తండ్రి దగ్గర నుంచి చింతామణి తీసుకుని వచ్చి కపిలమునికి ఇస్తాడు. అప్పుడు కపిలముని ఆ చింతామణిని గణనాథుని మెడకు అలంకరించి ఈ చింతామణి మీదగ్గరే ఉండనివ్వండి. ఈనాటి నుంచి మిమ్మల్ని చింతామణి అని కూడా పిలుస్తారు అని చెప్పి నమస్కరించాడు.
ఈవిధంగా వినాయకుడికి చింతామణి అనే పేరు వచ్చిందని ఒక పురాణ కథ చెబుతుంది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.