ఉత్తరహిమాలయాల్లో ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో గౌరీకుండ్ ఒకటిగా వెలుగొందుచున్నది. మరి హిమాలయాల్లో వెలసిన గౌరీ దేవి మందిరం ఎక్కడ ఉంది? ఈ క్షేత్రంలో ఉన్న వీశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర హిమాలయాల్లోని కేదారనాథ్, బదరీనాథ్ యాత్ర మార్గంలో గుప్తకాశీ, త్రియుగ నారాయణ్ ల సమీపంలో గౌరీకుండ్ అనే ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఉన్నది. హిమగిరి ప్రాంతమున కేదారనాథ్ కు సింహద్వారముగా గౌరీకుండ్ ప్రసిద్ధి. అంతేకాకుండా ఇది ఉష్ణ గుండాలకు చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఎత్తైన హిమాలయ పర్వతశ్రేణి సానువుల్లో మందాకిని నది తీరంలో ఉన్న ఈ గౌరీకుండ్ లోనే గౌరీదేవి మందిరం ఉంది. ఒక చిన్న ప్రహారిగోడ లోపల సుమారు 20 అడుగుల చదరంగా ఉన్న ప్రాంగణంలో ఈ గౌరీదేవి ఆలయం ఉన్నది. ద్వారం లోపల ఏకంగా చిన్న గర్భగుడిలో వెనుక గోడవారగా సుమారు మూడు అడుగుల ఎత్తు ఉన్న గౌరీదేవి అమ్మవారి విగ్రహామూర్తి భక్తులకు దర్శనమిస్తుంది.అయితే ఈ ఆలయంలో అమ్మవారికి అలంకరించిన చీరను, చుట్టూ గోడవారగా పైకి ఎత్తి, విసనకర్రలాగ అలంకరించబడి ఉండటంతో ఒక విధమైన వింత ఆకర్షణ కనిపిస్తుంది. ఇలా వెలసిన ఈ అమ్మవారిని భక్తులు ఎంతో భక్తితో దర్శిస్తారు. ఇక్కడ వేడినీటి బుగ్గ బావుల్లోని నీటిని కాలువల్లోకి మళ్లించి, రాతితో కట్టిన చిన్న చెరువులోకి పంపడం జరుగుతుంది. ఈ చెరువునే గౌరీకుండ్ అని పిలుస్తారు. అయితే గౌరీకుండ్ లోని వేడినీరు కాస్త చల్లని మందాకిని నది నీటిలో కలుస్తూ ఉంటుంది. ఈ గౌరికుండ్ లో పార్వతి పరమేశ్వరులు కొంతకాలం నివసించారని స్థానికులు చెప్తారు. ఉత్తరాఖండ్ లో మహాగొప్ప శివక్షేత్రంగా ఈ స్థలం చాలా ప్రశస్తిని గాంచింది. పూర్వం పరమేశ్వరుడు కూడా ఇక్కడే తపస్సు చేసినట్లు చెబుతారు. ఇంకా తన తపోభంగానికి కారకుడైన మన్మథుని శివుడు తన మూడో కన్ను తెరిచి భస్మం చేశాడట. పరమశివుని మాత్రమే వివాహం చేసుకోవాలనే దీక్షపూని, గౌరీదేవి ఈ స్థలంలో కఠోరమైన తపస్సు చేసిందని, అప్పుడు శివుడు గౌరీ దేవి తపస్సుకు మెచ్చి ప్రత్యేక్షమై ఆమెను తన దానిగా చేసుకున్నాడని స్థల పురాణం ద్వారా తెలియుచున్నది. పార్వతి పరమేశ్వరుల కళ్యాణం ఇక్కడి నుండి సుమారు 10 కి.మీ. దూరంలో ఉన్న త్రియుగ నారాయణ్ అనే చోట ఉన్న ఆలయంలో జరిగినట్లుగా చెబుతారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నందుకే ఈ చోటుని రెండవ కైలాసంగా పిలుస్తారు.