శివుడు ఒకరోజు కైలాసం నుండి విప్రవేషంలో రాముని వద్దకు వెళ్తాడు. రాముడు అతనిని చూసి.. ‘‘నీ పేరు, నువ్వు నివసించేది ఎక్కడ అని అడగగా.. శివుడు రాముడితో.. ‘‘నా పేరు శంభుడు. నా నివాసం కైలాసం’’ అని అంటాడు. దాంతో రాముడు విప్రవేషంలో వున్న అతనిని శంకరుడే అని గ్రహించి.. ‘‘విభూతి మహిమ గురించి వివరించండి’’ అని అడుగుతాడు.
దాంతో శివుడు.. ‘‘రామా! భస్మ మహత్యం గురించి చెప్పడానికి బ్రహ్మదులకు కూడా శక్యం కాదు. బట్ట మీద చారలను అగ్ని కాల్చినట్లు.. మన నుదుట బ్రహ్మ రాసిన రాతలను కూడా తుడిచివేసే శక్తి ఆ భస్మంకు వుంది. విభూతిని మూడు రేకులుగా పెట్టుకుంటే.. త్రిమూర్తులను మన దేహం మీద ధరించినట్లే అవుతుంది.
ముఖం మీద భస్మాన్ని ధరిస్తే నోటిద్వారా చేసిన పాపాలు, చేతులపై ధరిస్తే చేతిద్వారా చేసిన పాపాలు, హృదయంపై ధరిస్తే దురాలోచనలు, నాభిస్థానంలో ధరిస్తే వ్యభిచార దోషాలు, ప్రక్కలలో ధరించట వల్ల పరస్త్రీ స్పర్శదోషాలు పోగొట్టుకుపోతాయి. మనం చేసే సర్వపాపాలను బెదిరించి, పోగొడుతుంది కాబట్టి దీనికి భస్మం అనే పేరు కలిగింది.
భస్మం మీద పడుకొన్న, తిన్నా, శరీరానికి పూసుకున్నా పాపాలన్ని భస్మం అయిపోతాయి. ఆయుష్షు కూడా పెరుగుతుంది. గర్భిణీస్త్రీలు సుఖంగా ప్రవసం పొందగలుగుతారు. భూతపిశాచాలను పారదోలుతుంది. సర్ప, తేలు విషాలను కూడా ఇది సంహరిస్తుంది. అంత మహిమ ఉంది కాబట్టే నా భక్తులు ఎల్లవేళలా ధరిస్తారు అని చెబుతాడు.