శివుడు రాక్షసులతో ఫోరాడి, మూడు పురములను భస్మం చేసినపుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటినుంచి నుంచి పుట్టినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్ధము. తంత్ర శాస్త్ర ప్రకారం రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవి.
ఉసిరి కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా పేర్కొనబడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణమును కూడా గమనించాల్సివుంటుంది. రుద్రాక్షలు రకరకాల పరిమాణాల్లో ఉన్నట్లే రకరకలైన రంగుల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా తెలుపు, తేనె, నలుపు రంగులతోపాటు మిశ్రమ రంగుల్లో ఇవి లభ్యమవుతాయి. సాధారణంగా తేనె రంగులోని రుద్రాక్షలు ఎక్కువగా లభిస్తాయి.
రుద్రాక్షలను ఎల్లప్పుడూ పరిశుభ్రాంగా ఉంచాలి . సరైన రూపంలో లేని రుద్రాక్షలను, ముల్లులేని రుద్రాక్షలను, పురుగులు తిన్న, పాడైపోయిన రుద్రాక్షలను ధరించరాదు. వీటిని అన్ని జాతుల, కులాలవారు ధరించవచ్చు. వీటిని బంగారం, వెండి, రాగి తీగెలతోగానీ, సిల్కు దారముతోగూర్చిగానీ ధరించాలి.
సంభోగ సమయంలో వీటిని ధరించకూడదు. ఒకవేళ ఆ సమయంలో పొరపాటున ధరించిన యెడల తరువాత వాటిని ఆవు పాలతో శుద్ధి చేయాలి. రుద్రాక్షను ధరించేముందు “ఓం నమశ్శివాయ” శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
సంవత్సరానికి ఒక్కసారైనా మాలకు ‘మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం’ చేయడం మంచిది. వీలైనంత వరకు శివరాత్రి రోజు చేయడం మంచిది. రుద్రాక్షలు ధరించిన వారు ధూమపానం, మద్యపానం చేయరాదు. వెల్లుల్లి, మాంసాహారమును మానివేయడం మంచిది.
భారతీయ ఆధ్యాత్మిక సంపదలో భాగమైన రుద్రాక్షలు ధరిస్తే పునర్జన్మ ఉండదని భారతీయులు విశ్వసిస్తారు. ఆత్మ నిగ్రహానికీ, ఆత్మ సౌందర్యానికీ, మానసిక ప్రశాంతతకూ శక్తి వాహకాలైన వీటి ధారణ యోగ శక్తి పెంపొందించుకునేందుకూ, నిర్మలమైన, నిశ్చలమైన జీవితాన్ని సాగించేందుకూ తోడ్పడుతాయి.
వివిధ రకాలైన సమస్యలతో బాధపడేవారు, వివిధ నక్షత్రాలు, రాసులవారు పండితుల సలహా మేరకు ఆయా ముఖాల రుద్రాక్షలను ధరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఇవి వివిధ వ్యాధులను నయం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ప్రధానంగా రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, మూర్చ, జలుబు, గొంతు వాపు అజీర్ణం, శ్వాసకోశ వ్యాధులు మొదలైన వ్యాధులకు రుద్రాక్ష ఉపయోగపడుతుంది.