మనిషి బ్రతకాలి అంటే ఆక్సిజన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. శరీరంలో అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే ఆక్సిజన్ ఉండాలి. లేనట్లయితే శరీరంలోని కణాలు అదుపుతప్పి నాశనమవుతాయి. అదే జరిగితే అవయవాలు పనిచేయడం ఆగిపోయి మరణానికి దారితీస్తుంది. మనం పీల్చే గాలి ఊపిరితీత్తుల్లోకి ఫిల్టర్ అవుతుంది. ఆ తర్వాత ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ప్రోటీన్స్ ద్వారా శరీరమంతటికి ఆక్సిజన్ సరఫరా అవుతుంది. మన శరీరంలోని ఆక్సిజన్ కొరతను ‘పల్స్ ఆక్సీమీటర్’ సహాయం తో తెలుసుకోవచ్చు. ఆరోగ్యవంతుల్లో ఆక్సిజన్ శాతం 95 నుంచి 99 శాతం ఉంటుంది.
కరోనా రెండో దశలో పల్స్ ఆక్సీమీటర్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రపంచ దేశాలు సైతం పల్స్ ఆక్సీమీటర్‌ను వినియోగించి ప్రమాదాన్ని ముందే పసిగడుతున్నారు. ఇంట్లో జ్వరాన్ని పరీక్షించుకోడానికి థర్మామీటర్ ఎంత ముఖ్యమో.. వైరస్ వంటి మహమ్మారి వల్ల శరీరంలో కలిగే అంతుచిక్కని మార్పులను కనుగొనేందుకు ఈ పల్స్ ఆక్సీమీటర్ కూడా ముఖ్యమేనని అంటున్నారు. దీని ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించి అప్రమత్తంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు. గతంలో కేవలం ఆసుపత్రులలో వైద్యులు ఉపయోగించే పల్స్ ఆక్సీమీటర్ వినియోగం నేడు పెరిగింది.
కరోనా కేసులు పెరగడంతో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ లాంటివి ఈ పరికరాన్ని వాడేలా చేస్తున్నాయి. కోవిడ్19 బారిన పడిన వారు శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడాన్ని తొలి రోజుల్లోనే గుర్తించకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా సోకిన తొలి రోజుల్లో హైపోఆక్సిమీయా సమస్య తలెత్తుతుంది. అంటే రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం అని అర్థం. ఆరోగ్యంగా ఉన్నవారిలో 94శాతం కన్నా అధికంగా ఉంటుంది. అయితే రక్తంలో ఆక్సిజన్ స్థాయి 92శాతం కన్నా తక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఇది కేవలం వైరస్‌కు మాత్రమే కాదు.. మరెన్నో అనారోగ్య సమస్యలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.
ఆక్సీమీటర్ మన చేతి వేలికి పెట్టుకుంటే చాలు అది మన శరీరంలో ఆక్సిజన్ ఎంత శాతం ఉందో తెలియచేస్తుంది. సమయానికి మీరు ఆక్సిజన్ అందుకో గలిగితే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉండటం, ఛాతి నొప్పి, తలనొప్పి,గందరగోళం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలను బట్టి శరీరంలో ఆక్సిజన్ తగ్గుతుందని గమనించాలి. శరీరంలో 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్ళిపోవాలి. ముఖ్యంగా కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారు మాత్రం రోజులో 3 నుంచి 4 సార్లు ఆక్సిమీటర్ ద్వారా చెక్ చేసుకుంటూ ఉండాలి .
ఇది వేలిలోని రక్తకేశ నాళికల్లోకి ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను పంపుతుంది. అందులో ప్రతిబింబించే కాంతి ద్వారా ఆక్సిజన్ శాతాన్ని కొలుస్తుంది. ఇది SpO2 అనే సంతృప్త రక్తం శాతాన్ని చూపిస్తుంది. ఆక్సిమీటర్ హృదయ స్పందన రేటును కూడా చూపిస్తుంది. ఆక్సీమీటర్‌ను ఎక్కువగా చూపుడు వేలుకు పెట్టుకుంటారు. మధ్య వేలుకు సైతం పెట్టుకుని రీడింగ్ తీసుకోవచ్చు. పల్స్ ఆక్సీమీటర్ 98 శాతం ఖచ్చితమైన రీడింగ్ ఇస్తుందని, లోపం కేవలం 2 శాతమేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. అది చూపించే రీడింగ్‌లో రెండు శాతం ఎక్కువ లేదా తక్కువగా భావించాలి.
మరి ఈ పల్స్ ఆక్సీమీటర్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చేతివేలి గోళ్లకు ఏదైనా నెయిల్ పాలిష్ ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా తొలగించాలి. చేతులు చల్లగా ఉంటే వెచ్చదనం కోసం రెండు చేతులను రుద్దాలి. కనీసం 5 నిమిషాల పాటు ఏ ఆలోచన లేకుండా విశ్రాంతి తీసుకోవాలి. ఆ తరువాత చేతిని ఛాతిమీద గుండెకు దగ్గర్లో ఉంచాలి. పల్స్ ఆక్సీమీటర్ స్విచ్ ఆన్ చేసి చేతి మధ్యవేలు లేదా చూపుడు వేలుకు ఉంచాలి. ఆక్సీమీటర్ రీడింగ్ కొద్దిసేపు మారుతుంది. ఒక్కసారి రీడింగ్ స్థిరంగా చూపించే వరకు ఎదురుచూడాలి. కనీసం ఒక నిమిషం పాటు ఆక్సీమీటర్‌ను చేతి వేలికి అలాగే ఉంచాలి.
రక్తంలో ఆక్సిజన్ స్థాయిలో కనీసం 5 సెకన్ల పాటు రీడింగ్‌లో మార్పు లేకపోతే దాన్ని అత్యధిక స్థాయి సంఖ్యగా నమోదు చేసుకోవాలి. పల్స్ ఆక్సీమీటర్‌లో ఆక్సిజన్ స్థాయిలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మొదటి రోజు ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించి రీడింగ్ నమోదు చేసుకోవాలి, ఒకే సమయంలో మూడు సార్లు ఆక్సిజన్ శాతం రీడింగ్ ఎంత ఉందో రికార్డు చేయాలి. ప్రతి 6 గంటలకు ఆక్సిజన్ లెవెల్స్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తొలి దశలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకునేందుకు ఉదర భాగంపై పడుకుని గట్టిగా శ్వాస తీసుకోవాలి. ప్రోన్ పోసిషన్ లో పడుకుని శ్వాస తీసుకోవడం ద్వారా రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని, కొన్ని రకాల శ్వాసకోశ సమస్యలకు ఈ టెక్నిక్ ఉపయోగిస్తారు.