మూడు రోజుల సంక్రాంతి పండుగలో చివరిరోజు కనుమ. ఈరోజంతా తినడం, తాగడం, విందులు, వినోదాల ప్రత్యేకం కాబట్టి చాలామందికి ఈ రోజంటే ఇష్టం. వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ.
ముఖ్యంగా మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజయిన మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు.
కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసాహారులు కాని వారు, మినుములతో చేసిన గారెలతో సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం.