శివుడు వినాయకుడి తల నరికినపుడు పార్వతి దేవి ఎంతో దుఃఖంలో ఆగ్రహంతో ఉంది. తల తీసేసింది తన పుత్రుడిదే అని తెలిసాక శివుడు చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తూంటే, పార్వతి బాలుడి కళేబరం మీద పడి ఏడుస్తూంటే, ఆకాశం నుండి, ‘‘ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తున్న జీవి తలను తెచ్చి నాకు పెట్టండి నేను లేస్తాను!” అన్న పుత్ర గణపతి వాక్కులు వినిపించాయి.
వెంటనే దేవతలు, ప్రమథులు చుట్టు పక్కల అంతా గాలిస్తూ ఎంత వెతికినా ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తున్నవాళ్ళెవ్వరూ కనిపించలేదు. ఇంకా వెతుకుతూ పోగాపోగా సహ్యాద్రి పర్వతం మీద బిల్వవనంలో ఒక తెల్లని ఏనుగు గున్న మాత్రం ఉత్తర దిక్కుకు తెలపెట్టి నిద్రిస్తూనే, నిరంతరాయంగా శివస్మరణ చేస్తూ కనిపించింది.
ఆ ఏనుగుగున్న దేవలోకంలో దేవతా గజమైన ఐరావతం కుమారుడైన గజేంద్రుడు. ఐరావతం ఇంద్రుడి వాహనం. ఒక సారి ఇంద్రుడు ఐరావతం ఎక్కి ఉల్లాసంగా అలా వస్తూంటే గజేంద్రుడు అతణ్ణి లెక్క చేయకుండా తన ధ్యాసలో తానుండటం చూసి ఇంద్రుడు కళ్ళెరజ్రేసి, ‘‘నా వాహనం కొడుక్కు ఇంత పొగరా!”అని దుర్భాషలాడాడు. అప్పుడు గజేంద్రం ఎంతో శాంతంగా, ‘‘నా తండ్రి తన విధిని తాను చేస్తున్నాడు. అంత మాత్రం చేత నీవు మమ్మల్ని తక్కువచేసి మాట్లాడవలసిన పనిలేదు. అంతకన్నా నేను నీకు భయపడాల్సిందేమీలేదు,” అన్నాడు. ‘‘నేను దేవేంద్రుణ్ణిరా, ఏనుగా!” అన్నాడు ఇంద్రుడు గర్వంగా.
‘‘ఔను, నేను ఏనుగును, గజేంద్రుణ్ణి! మరొకరు నాగేంద్రుడైతే, ఇంకొకరు పక్షిఇంద్రుడు . ఇలా ఎంతమంది ఇంద్రుళ్ళున్నా ఉండవచ్చు. నూరుయజ్ఞాలు చేస్తే చాలు, ఇంద్రపదవి పొందవచ్చు, తపస్సుతో సాధించ వచ్చు. అందుకే ఎవరెక్కడ ఏది చేస్తున్నారని తెలిసినా నీకు తగని భయం! అయినా ఇంద్రత్వం ఏమంత గొప్పదని నీవు జ్ఞానంతో చెప్పుకుంటున్నావు?” అన్నాడు గజేంద్రుడు.
ఇంద్రుడు రెచ్చిపోయి శపించుతున్నట్లుగా, ‘‘నీ తల తెగా!” అని తిట్టాడు. గజేంద్రం నవ్వుతూ, ‘‘శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదుగదా, మునుముందు ఆ తల ముందే నీ తల వంచవలసివస్తుందేమో ఎవరికెరుక!”అన్నాడు. గజేంద్రం గొప్ప జ్ఞాని అని గుర్తించలేని గర్వాంధుడైన ఇంద్రుడు, ‘‘ఆ శివుణ్ణే నమ్ముకో, భూమ్మీద పడు!” అని గజేంద్రాన్ని స్వర్గం నుంచి కిందకు తోసేశాడు. గజేంద్రం సహ్యపర్వతం మీద పడి, ఎల్లప్పుడూ శివ సంస్మరణం చేసుకుంటూ, శివుడి నివాసమైన కైలాసం ఉండే ఉత్తర దిక్కుకే తలపెట్టుకొని నిద్రిస్తూండేది.
దేవతలు గజేంద్రం తలను నరికి తీసుకెళ్ళారు. ఆ తలను శివుడు బాలుడి కళేబరానికి అతికించిన మరుక్షణమే పుత్రగణపతి ఏనుగు ముఖంతో కళకళలాడుతూ లేచి నించున్నాడు.