శివ సహస్రనామాలు ఉద్భవించడానికి గల కారణం ఏంటి ?

0
220

విష్ణు సహస్ర నామాలను గురించి, వాటి విశేషాలను గురించి మహాభారత కథ వివరిస్తుంది. అయితే మళ్ళీ అంతటి శక్తి కలిగిన శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయి?

సర్వ ఆపదల నుండి ముక్తిని పొందటం కోసం శివ రూప ధ్యానం, శివ సహస్రనామ పఠనం ఉపకరిస్తాయని శ్రీ మహావిష్ణువుకు సాక్షాత్తు శివుడే చెప్పాడు. నిత్యం శివ సహస్ర నామాలను పఠించినా, పఠింపచేసినా దుఃఖమనేది ఉండదు. ఆపదను పొందిన వారు శివ సహస్రనామాలను యధావిధిగా వందసార్లు పఠిస్తే శుభం కలుగుతుంది. ఈ స్తోత్రం రోగాలను నాశనం చేసి విద్యను, ధనాన్ని, సర్వ కామనలను నిత్య శివభక్తిని ఇస్తుంది. ఇలాంటి ఉత్తమ ఫలితాలు ఎన్నెన్నో శివ సహస్రనామ పఠితకు దక్కుతాయని శివ సహస్రనామ పఠన ఫలంలో శివుడు చెప్పాడు.

Shiva Sahasranamaపూర్వం ఓసారి దేవతలకు, రాక్షసులకు భీకర యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో దేవతలు ఎన్నో రకాలుగా బాధలను పొందుతూ ఉండేవారు. చివరకు వారంతా కలిసి శ్రీ మహా విష్ణువు దగ్గరకు వెళ్ళి తమ కష్టాలను తీర్చమని వేడుకొన్నారు. విష్ణువు వారందరికీ ధైర్యం చెప్పి క్షణకాలం పాటు మనస్సులో శివుడిని ధ్యానించాడు. ఆ తర్వాత తాను కైలాసపతిని ఆరాధించి దేవతలకు శత్రువుల బాధలు లేకుండా చేస్తానని విష్ణువు చెప్పి అందరినీ వారి వారి నెలవులకు పంపాడు. ఆ తర్వాత శ్రీమహా విష్ణువు దేవతల జయం కోసం కైలాసానికి వెళ్ళి అక్కడ కుండాన్ని స్థాపించి దానిలో అగ్నిని ప్రతిష్ఠించి, ఆ పక్కన ఓ పార్థివ లింగాన్ని కూడా ప్రతిష్టించి తపస్సుకు ఉపక్రమించాడు. ఎంతకాలానికీ శివుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో తన తపస్సును, శివారాధనను మరింత వృద్ధి చేశాడు.

Shiva Sahasranamaహిమాలయాల చెంతనే ఉన్న మానస సరోవరంలో లభించే అరుదైన వెయ్యి కమలాలను తెచ్చి ప్రతి రోజూ భక్తితో పూజ చేస్తూ ఉండేవాడు. దీక్షతో విష్ణువు చేస్తున్న ఆ పూజను పరీక్షించాలనుకొన్నాడు శివుడు. ఓ రోజున విష్ణువు మానస సరోవరం నుండి వెయ్యి పూవులను తెచ్చి ప్రతిరోజూ తాను శివ సహస్ర నామాలతో పూజ చేస్తున్నట్టుగానే ఆ రోజు కూడా పూజకు ఉపక్రమించాడు.

Shiva Sahasranamaశివ సహస్ర నామాలలోని తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలను పఠిస్తూ అన్ని పూవులతోనూ పూజ చేశాడు. చిట్టచివరి నామం పఠిస్తూ పువ్వు కోసం చూసిన విష్ణువుకు అది కనిపించలేదు. ఎలాగైనా సహస్ర నామాలను పువ్వులతో కలిపి పూజ చేయాల్సిందేనని దీక్ష పట్టిన విష్ణువు కమలాన్ని పోలిన తన కన్నునే శివుడికి అర్పించి పూజ చేయాలని నిర్ణయించుకొన్నాడు.

Shiva Sahasranamaదేవతల కోసం అంతటి త్యాగానికి సిద్ధపడిన విష్ణువును చూసి శివుడు ఎంతో ఆనందించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. లోకకల్యాణం కోసం గొప్ప త్యాగానికి సిద్ధపడిన విష్ణువుకు ఏ వరమిచ్చినా తక్కువేనని శివుడు అన్నాడు. అప్పటికి రాక్షస సంహారం కోసం తేజో రాశిలాంటి సుదర్శన చక్రాన్ని విష్ణువుకిచ్చి దాంతో దేవతలకు శత్రుపీడను తొలగించమని విష్ణువుకు చెప్పాడు శివుడు. అంతేకాక దీక్షతో శ్రీ మహావిష్ణువు పఠించిన శివ సహస్ర నామాలను ఎవరు పఠించినా వారికి సకల శుభాలు, విజయాలు చేకూరుతాయని పలికి అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత విష్ణువు నిరంతరం సుదర్శన చక్రాన్ని ధరిస్తూ దేవతల శత్రువులను సంహరిస్తూ వారికి శాంతిని కలిగించసాగాడు.

 

SHARE