భారతంలో చాలా ముఖ్యమైన వ్యక్తి, జీవితాంతం ధర్మాన్ని విడువని వ్యక్తి ధర్మరాజు. కుంతి దేవి యమధర్మ రాజు వరాన్ని పొంది ధర్మరాజుని సృష్టిస్తుంది. కానీ ఈ వరం వెనుక మనకు తెలియని శాపం కూడా ఉంది.
ఒకప్పుడు ఆత్రిపుత్రుడైన దూర్వాసుడు ధర్మస్వరూపమును దర్శించాలని అనుకోని ధర్మదేవత గురించి తపముచేసాడు. అలా పదివేల యేండ్లు గడిచాయి. ధర్మదేవత ప్రత్యక్షము కాలేదు. దూర్వాసునికి కోపమువచ్చి ధర్మదేవుని శపించుటకు సిద్ధపడతాడు. అప్పుడాయన ప్రత్యక్షమై ‘‘నీవంటి కోపిష్ఠి వానికి తపస్సు ఫలించునా?’’ అనగానే దూర్వాసుడు ‘‘నీవెవ్వడ’’వని అడుగుతాడు.
ధర్ముడు ‘‘నేను ధర్మమూర్తి’’ని అని సమాధానం చెప్తాడు. దూర్వాసుడు మహాక్రోధముతో ‘‘నా కోపమును నీ వార్పగలవా? పదివేలేండ్లు గడిచిన తర్వాత ఇప్పుడు మేము కనబడితిమా? ఇన్నాళ్లు మాకు ప్రత్యక్షము కాకుండా ఏమి చేస్తున్నావు? ఇప్పుడైన నా కోపానికి బయపడి ప్రత్యక్షమైట్లు ఉన్నావు. నీవు ఇంత దుర్మదాంధుడవై బ్రాహ్మణాపచారము చేసినందు వల్ల ఒక రాజువై, ఒక చండాలుడవైపుట్టుము’’ అని శపించి వెళ్ళిపోయాడు. ఆ శాపము వలన విదురుడుగాను, పాండు కుమారులలో జ్యేష్ఠుడైన ధర్మరాజుగాను, కాటికాపరితనము చేసిన హరిశ్చంద్రుడుగాను ధర్మమూర్తి జన్మించాడు.
విదురుని గురించి భారతంలో చాల గొప్పగా వివరించారు. విదురుడు కూడా ధర్మాన్ని ఎప్పుడు విడువలేదు. ఇక సత్య హరిశ్చంద్రుడి గురించి చెప్పనవసరమే లేదు రాజ్యాన్ని, భార్య, పిల్లల్ని కోల్పోయిన చివరికి కాటికాపరి అయినా ఇచ్చిన మాట తప్పలేదు. ధర్మమూ ఏ రూపంలో ఉన్న ధర్మమే, తన స్వభావాన్ని మార్చుకోదు అని చెప్పడానికి ఈ ముగ్గురే నిదర్శనం.