కొన్ని సినిమాల్లో యముని పక్కన ఒక పుస్తకం పట్టుకొని లెక్కలు వేసుకుంటూ చిత్రగుప్తుడు ఉంటాడు. అయితే అయన మనలోనే అంతర్భాగం అయి ఉంటాడని ఎంత మందికి తెలుసు? అవును ఉదయం నిద్రలేచినప్పడినుండి పడుకునే వరకు మనం చేసే ప్రతి పాపం, పుణ్యం అన్ని లెక్కేస్తుంటాడు. అటువంటి చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడ దేవాలయాలు ఉన్నాయి. కానీ వాటిని వేళ్ల మీద మాత్రమే లెక్కించొచ్చు.
ముఖ్యంగా ఆసియా ఖండంలో చిత్రగుప్తుడికి భక్తులు ఎక్కువగా ఉన్నారు. భరతుడు పాలించిన భారత దేశంలో వీటిని నిర్మించారు. రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది. స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి. దీన్ని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
మధ్యప్రదశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. జబల్ పూర్ లోని ఫూటాతాల్, షిప్రా నదీ తీరంలోని రామ్‌ఘాట్‌లో , ఉజ్జయినిలో రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దాదాపు రెండు శతాబ్దాల క్రితంవి అయి ఉంటాయి. మధ్య ప్రదేశ్‌లో నాలుగు చిత్ర గుప్త దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్ అల్వార్‌లో మూడు శతాబ్దాల చిత్రగుప్త దేవాలయం ఉంది. అదే రాష్ట్రం ఉదయపూర్‌లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది.
ఉత్తర భారత దేశంలో అరుదుగా ఉన్న చిత్రగుప్త దేవాలయాలు దక్షిణాదిన తమిళనాడులోని కాంచిపురంలో ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైద్రాబాద్ పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది. అయినా స్థానికులు చాలా మందికి ఇక్కడ చిత్రగుప్త దేవాలయం ఉందన్న విషయం తెలియదు. చిత్రగుప్తుడి గుడి గంట మోగే శబ్దం వినిపించడం కన్నా వారికి చావు డప్పు, బంధువుల శోకాలు వినిపిస్తుంటాయి. దేవాలయం ముందు నుంచి తరచుగా పీనుగులను మోసుకెళ్లే పాడెలు కనిపిస్తుంటాయి.
ఎందుకంటే దేవాలయానికి కూత వేటు దూరంలోనే నల్లవాగు స్మశాన వాటిక ఉండటంతో ఈ మార్గం గుండానే అనేక శవయాత్రలు చేయాల్సి ఉంటుంది. దేవాలయ పరిసరాల్లో సాంబ్రాణి పొగ వాసనకు బదులుగా శవం కాలుతున్న వాసనలే విపరీతం.
పాతబస్తీలో ఇదే అతిపెద్ద స్మశానవాటిక అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు కందికల్ గేట్ రైల్వే ట్రాక్ మీద ప్రమాదాలు జరిగి మృత్యువాత పడే జీవులెందరో.బహుశా ఆ భయంతోనే ఇక్కడ రాత్రిపూట పెద్దగా జనసంచారం ఉండదు. దీపావళి రెండో రోజు మాత్రమే ఘనంగా జరిగే ఉత్సవం తప్పించి మామూలు రోజుల్లో కూడా పెద్దగా పూజలు జరగవు. దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుందని ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది.