పురాణాల్లో రాక్షస సంహారం కోసం దేవతలు కొన్ని అవతారాలు ఎత్తారు. అయితే మహిషుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఒక వరాన్ని పొందుతాడు. మరి మహిషుడు అనే రాక్షసుడు పొందిన వరం ఏంటి? మహిషుడిని సంహరించిన చాముండేశ్వరిదేవి ఎవరనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని మైసూరు ప్యాలెస్ కి కొంత దూరములో సముద్రమట్టానికి 3490 అడుగుల ఎత్తులో చాముండేశ్వరిదేవి ఆలయం ఉన్నది. ఈ దేవాలయం ఉన్న కొండ మీదకి ఎక్కడానికి సుమారుగా 1000 మెట్లు ఉన్నాయి. మైసూరు మహారాజులు ఈ దేవతని కులదేవతగా ఆరాధించేవారు. చాముండేశ్వరిదేవిని భక్తులు పార్వతి, శక్తి, దుర్గామాత అని అనేక రకాలుగా కొలుస్తుంటారు.
ఒక్కప్పుడు మహిషిడు అనే రాక్షసుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మ దేవుడిని మెప్పించి వరాలు పొందాడు. ఆ వరం ఏంటి అంటే అతని వంటి మీదనుండి నేలమీద పడే ఒకొక్క రక్తపు బొట్టులో నుంచి వెయ్యి మంది సైనికులు పుట్టుకువస్తారు. అయితే ఆ వరం ఉందనే గర్వముతో దేవతలను,మనుషులను బాధించడం మొదలు పెట్టాడు.
అప్పుడు దేవతలు అందరు పార్వతీదేవిని ప్రార్ధించగా ఆమె చాముండీ అవతారం ధరించి ఆమె నాలుకని భూమి అంతా ఆక్రమించుకునేటట్లు చాచి ఉంచింది. అప్పుడు మహిషుడు ఆ నాలికమీదనే నిలబడి యుద్ధం చేయవలసి రావడం,అతని ఒంటి నుండి పడే ప్రతి రక్తపు బొట్టు కూడా నేలని తాకకుండా నాలుక మీదనే పడుతుంది కావున ఆ సమయములో మహిషుడు అమ్మవారి చేతిలో సంహరించబడ్డాడు. అప్పటినుండి ఆ ఉరిని ‘మహిషపురం’ అని పిలవగా కాల క్రమేణా మైసూరుగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ అమ్మవారు దుష్టులకి భయాన్ని కలిగించే భయంకరమైన రూపంతో,భక్తులని రక్షించుటకు చల్లని తల్లిగా దర్శనమిస్తుంటారు. ఇక్కడ కొండపైకి ఎక్కే మార్గములో 16 అడుగుల ఎత్తు,25 అడుగుల పొడవుగల ఒకే రాతితో నిర్మించిన అధ్బుతమైన నంది విగ్రహం ఉన్నది.
ఈ ఆలయ గర్భ గుడిలో బంగారంతో చేయబడిన చాముండీదేవి విగ్రహం ఉన్నది. అంతేకాకుండా దేవాలయంలోని ద్వారములు వెండితో చేయబడినవి. పూర్వము ఇచ్చట నరబలులు,జంతుబలులు జరిగేవి. కానీ 18 శతాబ్దం నుండి ఆ బలులు నిషేధింపబడినవి.
ఇక్కడ దసరా ఉత్సవాలు 10 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతాయి. దసరా ఉత్సవాల తరువాత ఆశ్వియుజ పౌర్ణమినాడు జరిగే జాతర సందర్బంగా రథోత్సవం జరుగుతుంది. ఈ కారక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
ఇంతటి గణ చరిత్ర ఉంది కనుకే భక్తులు ఎక్కువగా ఇక్కడికి తరలివచ్చి చాముండేశ్వరీదేవిని దర్శనం చేసుకుంటారు.