చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. హిందువుల పండుగలలో ఈ దీపావళి పండగ ప్రత్యేకమైంది.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.
రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. కారణం ఏదైనా జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి.
కొన్ని ప్రాంతాల్లో దీపావళిని అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’తో ముగుస్తాయి. మొదటి రోజు ధన్వంతరి జయంతి లేదా ధన త్రయోదశి, రెండవరోజు చతుర్దశి- నరక చతుర్దశి, మూడవరోజు దీపావళి, నాల్గవ రోజు బలి పాడ్యమి, ఐదవ రోజు యమద్వితీయ లేదా భగిని హస్త భోజనం.
అందులో ముఖ్యమైనది దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం. ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. రాత్రివేళలో ఈ పండగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, రకరకాల పిండి వంటలు తయారుచేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి, గుమ్మాల్లో నేల మీద కొడుతూ… ‘దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ’ అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోటవేసి, వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి సూచికగా మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం.
తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. దీనికి మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ఈ రోజు ధనలక్ష్మి పూజ చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు.