Home Health పాలు ఎందుకు విరిగిపోతాయి? విరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?

పాలు ఎందుకు విరిగిపోతాయి? విరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?

0
milk
మనదేశంలో దాదాపు అన్నీ ఇళ్లలో పాలు ఉంటాయి. పాలకు సంబంధించిన పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ, లస్సీ, చీజ్, పనీర్, ఐస్ క్రీం, క్రీమ్ మొదలైన ఉత్పత్తులు ఏదో ఒక రూపంలో మనం వాడుతూనే ఉంటాము. ఒక్క మాటలో చెప్పాలంటే పాలు మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయాయి. అయితే పాలతో ఏది చేయాలన్నా ముందు పాలు ఉండాలి. ఉన్న పాలు బాగుండాలి. కానీ పాలను తెచ్చి పెట్టుకొని కాస్త ఆలస్యం చేసినా పాలు విరిగిపోతుంటాయి.
పాలను ఎక్కువ కాలం వాడాలంటే ప్రతి 4-5 గంటల వ్యవధిలో మ‌రిగించాలి లేదా ఫ్రిజ్‌లో ఉంచాలి. అధిక ఉష్ణోగ్రత లేదా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచిన పాలు త్వరగా విరిగిపోవు. లేదంటే తొందరగా విరిగిపోతుంటాయి. ఎండాకాలం అయితే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు పాలు ఎందుకు విరిగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పాలు విరిగిపోవ‌డం అనేది దాని స్వచ్ఛతకు గుర్తు.
కల్తీ పాలు ఉష్ణోగ్రతల తేడాలో త్వరగా విరిగిపోవు. పాలలో ఉండే ప్రోటీన్ యొక్క చిన్న కణాలు పాలలో స్వేచ్ఛగా తేలుతూ ఒకదానికొకటి దూరాన్ని మెయింటెయిన్ చేస్తాయి. ఈ దూరం పాలు విరిగిపోకుండా చూస్తుంది. గది ఉష్ణోగ్రతకు ఎక్కువసేపు గురికావడం వల్ల పాలలో పీహెచ్ స్థాయి తగ్గడంతో, ప్రోటీన్ కణాలు ఒకదానికొకటి దగ్గరగా రావడం ప్రారంభిస్తాయి.
పిహెచ్ స్థాయి పడిపోవడం ప్రారంభించినప్పుడు, అది ఆమ్లంగా మారడం ప్రారంభమవుతుంది. ఇటువంటి స్థితిలోనే పాలు విరిగిపోతాయి. వేసవి కాలంలో పాలు విరిగిపోయే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే వేసవిలో మనం రోజుకు 3-4 సార్లు పాలు కాచుకుంటాం. అంతే కాకుండా పాలను ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచుతాం.
ఎండాకాలం… పాలు ఒక రాత్రికే నిల్వ ఉండడం కష్టమైపోతాయి. ఒక్కోసారి ఫ్రిజ్ లో పెట్టినవి కూడా విరిగిపోతున్నాయి. ఇక ఫ్రిజ్ లేని వాళ్ల గురించి చెప్పక్కర్లేదు. అందుకే పాలు త్వరగా విరగకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. పాలు వేడిచేసేప్పుడే అందులో ఓ చిటికెడు సోడా వేయాలి. అలాగే అయితే త్వరగా పాలుగు విరగవట. విరిగిపోయేందుకు సిద్దంగా ఉన్న పాలు కూడా తాజాగా అవుతాయట.
పాలు వేడి చేసి కొన్నింటినీ వాడాక ఫ్రిజ్ లో పెట్టేస్తాం. తిరిగి వేడి చేస్తే చాలు విరిగిపోతుంటాయి. అలాంటప్పుడు నేరుగా పాల గిన్నె స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు. పెద్ద గిన్నెలో నీళ్లు పోసి అందులో పాలగిన్నె పెట్టి వేడి చేసుకోవాలి. ఎక్కవ సేపు మరిగించకుండా దించేయాలి.
అలాగే పాలు పొంగడం కూడా ఒక సమస్యే. స్టవ్ మీద పాలుపోసి మరొక పని చేయడానికి వీల్లేదు. అక్కడే నిల్చుని అవి పొంగిపోకుండా చూసుకోవాలి. అంతటి శ్రమ లేకుండా పాల గిన్నె అంచుకు కాస్త నూనె రాస్తే… పాలు పైవరకు పొంగవట. ప్రస్తుతం మార్కెట్లో సిలికాన్ తో తయారుచేసిన మూత అందుబాటులోకి వచ్చింది. దాన్ని పాల గిన్నెపై మూతగా పెట్టిన పొంగవట.
పాలు కొన్న వెంటనే కాచి పెట్టుకోవాలి. ఒక్క పొంగుతో ఆపకుండా రెండు, మూడు పొంగులు వచ్చేవరకూ కాచాలి. కాచిన పాలను వాడుకోగా మిగిలిన వాటిని చల్లారిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. కాచిన పాలను ఎండ తగిలే చోట పెట్టొద్దు. ఇలా చేస్తే వాటిలోని పోషకాలు పోతాయి. కాచిన గిన్నెలోనే పాలను ఉంచెయ్యాలి. గిన్నెలు మార్చొద్దు.
కావాల్సినన్ని పాలను వేరే గిన్నెలోకి తీసుకుని వాడుకోవాలే తప్ప పదే పదే మొత్తం పాలను వేడి చేయొద్దు. పాలను మందమైన అడుగు ఉన్న గిన్నెలో, సన్నని మంటపై వేడి చేయాలి. పాలు కాచే ముందు గిన్నెలో కాసిన్ని నీళ్లు పోసి వేడి చేసి పారబోయాలి. పాలగిన్నెను ఫ్రిజ్‌లోని అరల్లో పెట్టాలి. డోర్‌ ర్యాక్‌లో పెట్టొద్దు. మిగిలిన పాలను కొత్త పాలతో కలపొద్దు.

Exit mobile version