Home Health పసుపు పుచ్చకాయలు ఒకసారి రుచి చూస్తే అసలు వదలరు!

పసుపు పుచ్చకాయలు ఒకసారి రుచి చూస్తే అసలు వదలరు!

0
yellow watermelon

వేసవిలో జనాలను ఎక్కువగా ఆకర్షించేవి ఒకటి మామిడిపండు మరొకటి పుచ్చకాయ. మామిడి పండు అంటే పండ్లలోనే రారాజు రుచిలో కూడా మామిడిపండుకు సాటిలేదు అది అందరికీ తెలిసిన విషయమే. కానీ పుచ్చకాయ క్రేజ్ పుచ్చకాయదే. వేసవి తాపాన్ని తీర్చే పుచ్చకాయ రుచి పరంగానే కాదు ఆకుపచ్చ చారలుండే తొక్క, లోపల ఎరుపు/గులాబీ రంగు గుజ్జు, అందులో నల్లటి విత్తనాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

అయితే ఇప్పుడు చెప్పబోయే పుచ్చకాయ మాత్రం గుజ్జు పసుపు పచ్చ రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. ఈ పుచ్చకాయలు చూస్తే రంగేసారేమో అనిపిస్తుంది కానీ అది నూటికి నూరుపాళ్లు సహజసిద్ధంగా వచ్చిన రంగే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విత్తన తయారీ సంస్థలు. అంతేకాదు.. ఆకుపచ్చ తొక్క, ఎరుపు, గులాబీ, పసుపు రంగు కండతో విత్తనాలు లేని (సీడ్‌ లెస్‌) పుచ్చకాయలు కూడా త్వరలో మార్కెట్‌కు రానున్నాయని వివరిస్తున్నారు.

పుచ్చకాయ అంటే మనకి ఎరుపు రంగు గుర్తుకు వస్తుంది. ఆ కలర్ మాత్రం తగ్గినా తినబుద్ధి కాదు. కానీ ఇప్పుడు పసుపు పుచ్చకాయలు బెంగళూరులో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రజలు ఇవే కావాలని అడిగి మరీ కొనుక్కుని తినటానికి మక్కువ చూపుతున్నారు. ఈ పుచ్చకాయ పైకి చూడటానికి పచ్చగానే ఉంటుంది…. కోసినప్పుడు ఎరుపు రంగు కాకుండా, పసుపు రంగులో ఉంటుంది.

పసుపు పుచ్చకాయల్లో లైకోపీన్‌ అనే పదార్థం ఉండదు కనుక అవి ఎప్పుడూ ఎర్రటి రంగును తీసుకోవని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. చిత్రమేమిటంటే పసుపు పుచ్చకాయల సాగు ఎరుపు/గులాబీ పుచ్చ కంటే ముందు నుంచే ఉంది. ఇదో సంకర విత్తనం. ఆఫ్రికా నుంచి వచ్చింది. సంప్రదాయ పుచ్చకాయలకు ఇదో ప్రత్యామ్నాయం. పర్పుల్‌ కాలే, ఆరెంజ్‌ కాలీఫ్లవర్, బ్లూ బంగాళాదుంపలు మాదిరే ఇది కూడా.

ఎరుపు కాయలతో పోల్చి చూస్తే. పసుపు కాయల్లో గింజలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ కారణం తో కొనుక్కునే వారు ఇవే కావాలని కొంటున్నారుపసుపు రంగువి కావడంతో, పంట వస్తుందో రాదో, పుచ్చకాయలు కాస్తాయో లేదో అని సందేహ పడ్డారు రైతులు. అయితే ఈ పంట బాగా పండింది.కొన్ని రోజుల కిందట ఈ పుచ్చకాయల్ని మొదటిసారి చూసిన కొనుగోలు దారులు పసుపు కాయలని వద్దొద్దు ,అంటూ రెడ్ కలర్‌వే కొనుక్కున్నారు. ఆ తర్వాత అసలు ఎలా ఉంటాయో చూద్దామని ఒక్కొక్కరుగా వీటిని కొనడం మొదలు పెట్టారు. అంతే ఇక ఇప్పుడు వీటికి డిమాండ్ బాగా పెరిగింది.

ఎరుపు రంగు పుచ్చకాయ కంటే,పసుపు రంగు వి కాస్త ఎక్కువ తియ్యగా ఉంటున్నాయి. సలాడ్, జ్యూస్ చేయడానికి ఇవి బాగున్నాయి అని అంటున్నారు. ఈ పుచ్చకాయ ధర కూడా తక్కువే. కేజీ రూ.20 చొప్పున అమ్ముతున్నారు. సిట్రల్లస్ లానాటస్ అని శాస్త్రీయంగా పిలుచుకునే ఈ రంగు పుచ్చకాయలు మొదట ఆఫ్రికాలో పెంచారు. ప్రస్తుతం ఈ పండు ప్రపంచవ్యాప్తంగా 1,000 రకాలకు పైగా పండిస్తున్నారు.

పసుపు పుచ్చకాయలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చడానికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎరుపు పుచ్చకాయ కంటే ఎక్కువగా పసుపు పుచ్చకాయలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ గా పనిచేసి క్యాన్సర్లు రాకుండా, కంటి వ్యాధుల నుంచి రక్షణ కలిగించేలా సహాయపడుతుంది.

Exit mobile version