ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించినవారికి తిరుమల తిరుపతి లోని స్వామిని దర్శించిన అనుభూతిని పొందుతారు. అందుకే ఈ ఆలయం చిట్టి తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయంలోని మరిన్ని విశేషాలు ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణజిల్లా విజయవాడ నగరంలో శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. అయితే ఒకప్పుడు ఈ ఆలయం బెజవాడ పొలిమేరలో ఉండేదని చెబుతారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గర్భాలయంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇరువైపులా గంగానమ్మ, ముత్యాలమ్మలు కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ శ్రావణ శుక్రవారం, మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ అమ్మవారి ఆలయంలో 11 ప్రదిక్షణలు చేసి కోరిన కోరికలు నెరవేరుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక ఈ ఆలయానికి దక్షిణ భాగంలో శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఎత్తైన ధ్వజస్తంబం ఉంది. ఆలయ దక్షిణ ఆగ్నేయంలో 18 అడుగుల దశావతార మూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకి దర్శనం ఇస్తున్నారు. ఈ ఆలయ ధజస్తంబం చుట్టూ అష్టదికాపలాకులను ప్రతిష్టించారు. చిట్టి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశకి ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. ఇంకా ప్రతి నెల శ్రవణ నక్షత్రంలో పంచామృత అభిషేకాలు, శృంగార హారతులు, సంధ్య వేళలో నక్షత్ర హారతులు, మధ్యాహ్న హారతులు సమర్పించబడుతున్నాయి. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ మహిమ గల ఆలయంలో శరన్నవరాత్రులకు గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఇంకా కార్తీకమాసంలో లక్షదీపారాధనతో పాటు, శని త్రయోదశి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.