Recalling The Greatest Movies Of K Viswanath Garu Which Are Actually A Gift To Us

Recalling The Greatest Movies Of K Viswanath Garu Which Are Actually A Gift To Us

ఒక సినిమా తీయడమనేది అంత ఈజీగా అయ్యే పని కాదు. దాని వెనక ఎంతో మంది కృషి ఉంటుంది.. రాత్రీపగలు కష్టపడితే తప్ప అనుకున్నది అనుకున్నట్లు పూర్తి అవ్వదు. అదే ఒక కళాఖండం తీయాలంటే.. ఇంకెంత తపన కావాలి.. ఎన్ని కలలు కనాలి.. ప్రాణం పెట్టాలి.. చూపించే ప్రతి ఫ్రేమ్ లో కళాత్మకత ఉట్టిపడాలి. ఏ సినిమానీ.. కళాఖండం అవ్వాలని తీయరు. బయటికి వచ్చాక అది ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదిస్తే తప్ప అది అంతటి పేరు తెచ్చుకోదు.. అప్పుడే ఒక మంచి సినిమా అవుతుంది.. ఇంకా బాగుంటే.. ఒక గొప్ప సినిమా అవుతుంది.. చరిత్ర సృష్టించిందంటే.. కళాఖండం అవుతుంది. అలాంటి కళాఖండాలు ఒకటి.. రెండు కాదు.. జీవితాంతం గుర్తుంచుకునేలా ఎన్నో సినిమాలు.. అది కూడా ఒక్క డైరెక్టరే తీస్తే.. ఆయన్నే కళాతపస్వి అంటారు. సినిమా ప్రపంచానికి ఒక్కరే కళాతపస్వి.. ఆయనే పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్ గారు.

Vishwanathఆయన తీసిన ప్రతి సినిమా మన చుట్టూ ఉన్న సమాజాన్నే అద్దంలో చూపించినట్లు ఉంటుంది. సమాజంలో జరుగుతున్న.. మనం గుడ్డిగా ఫాలో అవుతున్న మూఢ నమ్మకాలను ఆయన సినిమాల్లో ఇది తప్పు అని మనకు గుర్తు చేస్తారు. సంస్కృతి, సంప్రదాయాలు ఎంత గొప్పవైనా.. అవి మనుషుల్ని వేరు చేసేవి కావని పాఠాలు నేర్పిస్తారు. ఒక మనిషి ఎలా బతకాలో.. తోటి వాళ్ళతో ఎలా ఉండాలో.. ఎలా ప్రేమ చూపించాలో సినిమాల ద్వారా మనకు అర్థమయ్యేలా చెబుతారు. మన చుట్టూ బతుకుతున్న మనలాంటి సాధారణ మనుషులే ఆ సినిమాల్లో కనిపిస్తారు. వయసు పైబడిన ముసలాయన.. మతిస్థిమితం సరిగా లేని ఓ సాధారణ వ్యక్తి.. సక్సెస్ అంటే ఏంటో తెలియని ఓ కళాకారుడు.. కళ్ళు కనిపించని ఓ గుడ్డివాడు.. చెప్పులు కుట్టుకునే పేదవాడు.. చేపలు పట్టుకునేవాడు.. వీళ్ళే విశ్వనాథ్ గారి హీరోలు. వాళ్ళ జీవితాలే మనం ఆరాధించే గొప్ప కళాఖండాలు..

ఆయన కమర్షియల్ సినిమాలు కూడా తీశారు. కానీ విశ్వనాథ్ గారి ప్రతిభ ప్రపంచానికి తెలిసింది.. ఎక్కువ పేరు తెచ్చిపెట్టినవి మాత్రం ఖచ్చితంగా కళాత్మక సినిమాలే. ఆ సినిమాలే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాని నిలబెట్టాయి. తెలుగు సినిమా సత్తా ఇదిరా… అని అందరికీ తెలిసేలా చేశాయి. విశ్వనాథ్ గారి గొప్పతనం, ఆయన దర్శకత్వ ప్రతిభ గురించి ఇప్పటి జనరేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే మనలాంటి సామాన్యులు అంత ఈజీగా అర్థం చేసుకోలేని సబ్జెక్టులు ఆయన టచ్ చేశారు. ఆయన ఒక్కో సినిమా గురించి మాట్లాడాలి అంటే.. ఒక్కో రోజు పడుతుంది. అందుకే.. మనకు తెలిసినంతలో కట్టే.. కొట్టే.. తెచ్చే.. లాగా కొన్నిసినిమాల గురించి సింపుల్ గా మాట్లాడుకుందాం.

1. శంకరాభరణం

Sankarabaranamసంగీత విద్వాంసుడు శంకరశాస్త్రి.. ఆయన్ని దైవంలా భావించే తులసి.. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్యే అసలు సినిమా అంతా. కానీ ఎక్కడా సినిమాలో ఈ ఇద్దరి మధ్య మాటలు ఉండవు. శాస్త్రీయ సంగీతమే తన ప్రాణంగా శంకరశాస్త్రి పాత్రని అద్భుతంగా చూపించారు. అసలు ఈ సినిమాకి ఈ పేరు పెట్టడంలోనే చాలా అర్థం ఉంది. ఆ శంకరునికి ఆభరణం పాము. తులసి తన కడుపులో పెరుగుతున్న కొడుకు(విషం=పాము)ని శంకరశాస్త్రి(దేవుడు) పాదాల చెంతకు చేర్చాలి అనుకోవడమే ఈ సినిమా కాన్సెప్ట్. ”ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప.. కులం అనే పేరుతో మనుషుల్ని విడదీయడానికి కాదు” అని ఆ రోజుల్లోనే గొప్ప మెసేజ్ ఇచ్చారు..

2. శుభలేఖ

Subhalekhaమెగాస్టార్ చిరంజీవితో విశ్వనాథ్ గారు చేసిన ఫస్ట్ మూవీ ఇది. ఇందులో మన చిరూని ఓ స్టార్ హోటల్లో వెయిటర్ గా చూపించారు. వరకట్నం అనే కాన్సెప్ట్ వల్ల పెళ్లి చేయడానికి ఒక అమ్మాయి కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఈ సినిమాలో అర్థమయ్యేలా చెప్పారు. కట్నానికి ఆశపడిన మనిషి ఎంతలా దిగజారుతాడో సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు.

3. సాగర సంగమం

Sagara Sangamamఈ కథతో ఎవరూ సినిమా తీయాలని అనుకోరేమో.. ఒక ఫెయిల్యూర్ స్టోరీ చెప్పడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది చెప్పండి. నాట్యం అంటే పడి చచ్చిపోయే బాలు అనే కళాకారుడి ఫెయిల్యూర్ కథ ఇది. గొప్ప డాన్సర్ అయిపోవాలని కలలు కనే బాలు.. తన జీవితంలో అనుకున్నది సాధించలేక పోతాడు. కథ అంతా డాన్స్ చుట్టూనే ఉంటుంది.. కానీ ఒక్కసారి కూడా స్టేజీపై డాన్స్ చేయాలనే తన కోరిక తీరదు. ‘నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్’ అనే గొప్ప మెసేజ్ తో ఈ సినిమాని ఎండ్ చేస్తారు.

4. స్వాతిముత్యం

Swati Muthyam 1కమల్ హాసన్ గారి అద్భుతమైన నటనని మనకు పరిచయం చేసిన సినిమా ఇది. మనిషి ఎదిగినా.. మానసికంగా ఎదగని శివయ్య అనే క్యారెక్టర్, ఓ విడోకి తాళి కట్టి జీవితం ఇవ్వడమే ఈ సినిమా. నేటి సమాజంలో కుళ్ళు, కుతంత్రాల మధ్య బతుకుతున్న మనుషుల కన్నా.. కల్లాకపటం తెలియని శివయ్య లాంటివాళ్ళు నిజంగా ”స్వాతిముత్యం” అని చూపించారు. ఆస్కార్ నామినేషన్ కి వెళ్లిన ఒకే ఒక తెలుగు సినిమా ఇది కావడం మనకు గర్వకారణం.

5. సిరివెన్నెల

Sirivennela
ఒక చూపు లేని వాడికి.. ఒక మాటలు రాని అమ్మాయి తోడైతే ఎలా ఉంటుంది.. అదే సిరివెన్నెల సినిమా. అసలు ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్ చాలా కష్టం. అలాంటిది సినిమా మొత్తం నడిపించారు విశ్వనాథ్ గారు. కళ్ళతో చూడలేకపోయినా స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో మనకు వివరించారు. ఈ సినిమాతోనే మనకు పాటల రచయిత సీతారామశాస్త్రి గారు పరిచయం అయ్యి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు..

6. స్వయంకృషి

Swayamkrushi
మెగాస్టార్ చిరంజీవిని చెప్పులు కుట్టే పాత్రలో చూపించి సాహసం చేశారు విశ్వనాథ్ గారు. చేసే పనే దైవంగా.. స్వయంకృషితో ఎదిగిన సాంబయ్య క్యారెక్టర్ లో అద్భుతంగా జీవించారు చిరంజీవి గారు.. జీవించేలా చేశారు విశ్వనాథ్ గారు. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే మాటకి సరైన అర్థం ఈ సినిమా.

7. స్వర్ణ కమలం

Swarna Kamalam
ఈ సినిమా భానుప్రియ గారి యాక్టింగ్ కోసమైనా తప్పక చూడాలి. నాట్యం, శాస్త్రీయ సంగీతం పాతకాలం పద్ధతులు అని.. కడుపు నింపవని అనుకునే మీనాక్షి.. ఆ అమ్మాయిలో ఉన్న టాలెంట్ ఏంటో ప్రపంచానికి చూపిద్దామనుకునే అబ్బాయి చంద్రశేఖరం. ఈ రెండు క్యారెక్టర్స్ లో వెంకటేశ్, భానుప్రియ జీవించారు. ప్రపంచం ఒక వైపు పరుగులు పెడుతున్నా.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోకూడదు అని చెప్పిన కథ ఇది.

8. ఆపద్భాంధవుడు

Aapadbandavudu
మరోసారి తన స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి పశువుల కాపరి మాధవుడిగా చిరంజీవి చేసిన సినిమా ఇది. రోజురోజుకీ మనం మరిచిపోతున్న సాహిత్యం, దాని విలువ గురించి ఇందులో చూపించారు. హీరోయిన్ తండ్రి తాను రాసిన కవితలను హీరోకి అంకితం చేసి చనిపోయే సీన్.. ఈ సినిమాలో ఓ బెస్ట్ సీన్ గా చెప్పొచ్చు. ఇందులో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ మన హాస్యబ్రహ్మ ‘జంధ్యాల’ గారు చేశారు.

9. సప్తపది

Saptapadiరెండు మనసులు కలవడానికి కులం, మతం అడ్డు కావని 1981లోనే కళాతపస్వి చెప్పే ప్రయత్నం చేశారు ఈ సినిమాతో. ”పెళ్లి అనేది ఇద్దరు మనుషుల్ని కలపడానికి కాదు.. రెండు మనసులు కలవడానికి అని”.. ”పెళ్లంటే శోభనం ముందు జరిగే తంతు కాదు.. అది పురుషుడు, స్త్రీ మధ్య స్నేహం” అని ఆ రోజుల్లోనే చెప్పి సమాజాన్ని నిలదీశారు విశ్వనాథ్ గారు. సమాజంలోని దురాచారాలపై విశ్వనాథ్ గారు చేసిన నిశ్శబ్ద విప్లవం ఈ సినిమా.

10. స్వాతికిరణం

Swathi Kiranam
ఒకరు తన కన్నా ఎక్కువ ఎదుగుతుంటే.. పక్కన ఇంకో మనిషికి ఈర్ష్య, అసూయ కలగడం అనేది చాలా కామన్. ఎంత పండితుడు అయినా.. జ్ఞాని అయినా.. ఈర్ష్య, అసూయలు పెంచుకుంటే ఎలా పతనం అవుతాడో చూపించారు ఇందులో. ఈ సినిమా చివరిలో తన తప్పు తెలుసుకున్న సంగీత విద్వాంసుడి పాత్ర.. సంగీత పాఠాలు మొదటి నుండి నేర్చుకోవాలని చిన్నపిల్లల మధ్య కూర్చునే ఒక్క సీన్.. విశ్వనాథ్ గారి కళాత్మక దృష్టి ఏంటో తెలియజేస్తుంది.

ఇలా.. ఎన్నో.. మరెన్నో తెలుగు జాతి గర్వించే సినిమాలు మనకు అందించి… సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన విశ్వనాథ్ గారు మన తెలుగువాడు అయినందుకు మనం ఎంతో గర్వపడాలి. ఏడ్చేవాడు కాదు.. తన నటనతో ఏడిపించేవాడు కళాకారుడు.. ఆ కళాకారుడిని తీర్చిదిద్దిన మన విశ్వనాథుడికి తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ రుణపడి ఉంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR