దగ్గుకు, ఆయాసానికి గాడిద పాలను తాగిస్తారనేది మనకు తెలిసిన విషయమే. కానీ మనదేశంలో ఆవు పాలకి, గేదె పాలకి ఉన్న ప్రాచుర్యం గాడిద పాలకు లేదు. ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అని వేమన ఒక పద్యంలో చెప్పాడు. అంటే ఆవు పాలు గరిటెడు అయినా సరిపోతాయి.. కానీ గాడిద పాలు బిందె నిండా ఉన్నా వాటితో ఉపయోగం లేదు అన్నది దాని అర్థం. కానీ గాడిద పాలతో ఉన్న ఉపయోగాలు తెలిస్తే ఈ పద్యాన్ని తిరగరాస్తారేమో. గతంలో ఎలాగైతే ఆవు పాలను అమృతంగా చెప్పుకునేవాళ్లో.. ఇప్పుడు అంతకు మించి గాడిద పాలను సూపర్ గుడ్ ఫుడ్‌గా చెబుతున్నారు. గరిటెడు అయినా గాడిద పాలు తాగాల్సిందే అంటున్నారు పరిశోధకులు. ఇప్పుడు గాడిద పాలకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి.
గాడిద పాలలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయట. ఇటీవలి కాలంలో ఢిల్లీకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ గాడిద పాలతో సబ్బులను తయారు చేసి విక్రయిస్తూ అతి తక్కువ కాలంలో మంచి పేరుగడించింది. పైగా, ఈ సబ్బుల వాడితే మరింత యవ్వనంగా మారుతారంటూ ప్రచారం చేస్తోంది. ఎప్పుడో క్రీస్తు పూర్వం ఈజిప్టును పాలించిన రాణి క్లియో పాత్ర తన బ్యూటీని కాపాడుకోవడానికి గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇప్పటికీ అందానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆమెనే చెబుతారు. ఇలా గాడిద పాలను స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని, చర్మ సంరక్షణ కలుగుతుందని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకున్న ఆర్గానికో కంపెనీ సబ్బులను తయారు చేసింది.
అయితే ఇప్పుడు వీటి గిరాకీ ఒక్క బ్యూటీ ప్రొడక్టులకే పరిమితం కాలేదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. గాడిద పాలు లో– ఫ్యాట్ ఫుడ్ అని అంటున్నారు. మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ దీని సొంతమని ఐక్య రాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆరనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించింది. రోగ నిరోధక శక్తిని పెంచే మెడిసినల్ వ్యాల్యూస్ కూడా గాడిద పాలలో ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియ్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆవు, గేదె పాలు తాగితే పడని పసి పిల్లలకు ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్.
గాడిద పాలను గుర్తించడంలో మనమే కొంత వెనుకబడ్డాం . అమెరికాతో పాటు కొన్ని ఇతర దేశాల్లో ఇప్పటికే గాడిద పాలను రోజువారీగా తాగుతున్నారు. ఇంకా మన దగ్గర వాటిని తాగడానికి పనికొచ్చే పాలలా చూడట్లేదు.
మనదేశంలో అతికొద్ది మంది రైతులు మాత్రమే గాడిద డెయిరీ ఫామ్స్ మొదలుపెట్టి తమ సొంత బ్రాండ్స్‌తో సేల్స్ చేస్తున్నారు. ఒక్క లీటరు రూ.3 వేల నుంచి 7 వేల వరకు అమ్ముతున్నారు. లీటరుకు 7000 అంటే దానికి ఉన్న డిమాండ్ అర్థమవుతుంది.