పెద్ద వాళ్ళు ఏం చేసిన దానికి వెనుక అర్ధం, పరమార్ధం అనేది ఉంటుంది. ఇప్పటి జనరేషన్ వారికీ అవి పెద్దగా తెలియనప్పటికీ తెలుసుకోవాల్సిన భాద్యత ఎంతైనా ఉంది. సనాతన భారతీయ సంస్కృతి, సాంప్రదాయంలో అనుసరించిన కొన్ని పద్దతులు ఆచారంగా మారిపోయాయి.
కానీ ఈ ఆచారాల వెనుక శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రాచీనకాలంలో హిందువులు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ముందుగా దైవాన్ని ఆరాధించి ప్రారంభించేవారు. దీంతో చేపట్టిన పనులు నిర్వఘ్నంగా సాగుతాయని, ఇతర దుష్పరిణామాలు ప్రభావం ఉండదని నమ్మకం. ప్రస్తుతం కూడా వాటిని అనుసరించడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని కొన్ని పరిశోధనలు, అధ్యయనాల ద్వారా తేలింది.
ఇక మన హిందూ సాంప్రదాయ వ్యవస్థలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. పెళ్లిలో భాగంగా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా హిందూ వివాహ పద్దతిలో వధూవరులకు నుదుట బాసికం కడతారు. దీని వెనుక ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగానూ లాభాలు ఉన్నాయి.
మానవ శరీరంలో మొత్తం 72 వేల నాడులు ఉంటాయి.. అందులో 14 నాడులు ఎంతో ముఖ్యమైనవి. వీటి వల్ల మానవ శరీరం ఎల్లప్పుడూ ఉత్తేజంగా ఉంటుంది. ఈ 14 నాడుల్లో ఇడ, పింగళ, సుషుమ్మ అనేవి అతి ముఖ్యమైనవి. సుషుమ్న నాడికి కుడి పక్కన సూర్యనాడి, ఎడమ పక్కన చంద్రనాడి ఉంటాయి. ఈ రెండూ నుదుట భాగంలో కలుసుకుంటాయి. ఈ నాడుల కలయిక అర్థచంద్రాకారంలో ఉంటుంది.
వేదకాలంలో ఈ భాగాన్ని రుషులు దివ్యచక్షువు అని పిలిచేవారు. వివాహసమయంలో దీనిపై ఇతరుల దృష్టి సోకకుండా బాసికాన్ని కడతారు. అంతేకాదు ఎలాంటి ప్రమాదాలు, కష్టాలు రావని నమ్ముతారు. బాసికం అర్ధచంద్రాకారం, త్రిభుజాకారం, చతురస్త్రాకారంలో ఉంటుంది. నుదుట భాగాన బ్రహ్మ కొలువుంటాని హిందువులు ప్రగాఢ నమ్మకం.
అలాంటి భ్రూమధ్య స్థానంలో కొలువున్న బ్రహ్మ, మానవుడి భవిష్యత్తుకు సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడే పొందుపరుస్తాడు. నెత్తిన చేతులు వేసుకోవడం అరిష్టమని, తరచూ నుదుట భాగాన్ని చేతితో రుద్దకూడదని పెద్దలు అంటారు.
ఏంతో పవిత్రమైన ఈ ప్రదేశంపై ఇతరుల దృష్టి సోకడం కూడా మంచిది కాదు. అందుకే పూర్వకాలం నుంచి బాసికం ధరించడం ఆచారంగా వస్తోంది. సాధారణంగా వివాహ సమయంలో వధూవరులను అందంగా అలంకరిస్తారు. వారి అలంకరణను చూసి అతిథులు, బంధువులు ముగ్దులవుతారు.
అలా అందరూ చూసేటప్పుడు వారిపై కనుదృష్టి పడుతుంది. ఇటువంటి వాటి నుంచి రక్షణ పొందడానికే బ్రహ్మ కొలువున్న ఈ స్థానంలో బాసికాన్ని కడతారు. దీని వల్ల భార్యభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది కూడా.