మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం సేవిస్తాము. అలాంటిది గుడిలో ఉండే దేవుడు మన కళ్ళ ముందే మనం పట్టించే పానకం తాగితే ఆ అనుభూతి మరియు ఆశ్చర్యాన్ని మాటల్లో చెప్పలేము. అయితే శ్రీ పానకాల నరసింహస్వామి ఆలయములో ఇలాంటి అనుభూతే ప్రతి భక్తుడి పొందుతున్నాడు. మరి ఆ పానకం తాగటం వెనుక గల కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలో మంగళగిరి లో శ్రీ పానకాల నరసింహస్వామి ఆలయం ఉన్నది. ఈ గుడిలోని నారాయణునకు పానకం అంటే చాలా ప్రీతి. సరాసరి తన నోటిలో పానకం లో సగం పాలు ఈ స్వామి ప్రసాద చిహ్నంగా భక్తులకి అనుగ్రహిస్తుంటారు. అంతేకాకుండా స్వామి వారు తాగుతున్నప్పుడు “గుట గుట” శబ్దం కూడా వినిపిస్తుంది. ఈ శబ్దం అనేది ఆగితే పానకం వెలికి చిమ్ముతుంది. ఇది ఏదో ఎప్పుడో ఒకసారి జరగటం కాదు ఇక్కడకి వచ్చి పానకం సమర్పించిన ప్రతి భక్తుడికి జరుగుతూనే ఉంటుంది.ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే ఇక్కడ బిందెల కొలది పానకం స్వామికి సమర్పించిన అక్కడ దరి దాపులో కూడా ఒక్క చీమ అనేది ఉండదు. అందుకే ఇక్కడి స్వామి వారు “పానకాల స్వామి”గా ప్రసిద్ధుడయ్యాడు.మంగళగిరి అంటే శుభప్రదమైన కొండ అని అర్ధం. దూరం నుండి చూస్తే ఈ కొండ పడుకొని ఉన్న ఏనుగు ఆకారంలో కనబడుతుంది. అయితే ఈ స్వామి ఈ కొండలో అవతరించాడు ఒక కథగా చెప్పుకుంటారు.పూర్వము సముచియనే రాక్షసుడుండేవాడట. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి ఎన్నో వరములు పొందాడట. ఆ వరాలతో అతడు భక్తులని,ఋషులను పీడించుచుండగా ఇంద్రుడు కోపించి తన చక్రముని ప్రయోగించగా ఆ రాక్షసుడు ఈ మంగళ గిరి గుహలో దాచుకొని చక్రం నుండి తప్పించుకున్నాడు. అప్పుడు అందరు శ్రీ మహావిష్ణవుని ప్రార్ధించగా వారి ప్రార్థనలు విని ఉగ్రరూపుడై చక్రం ధరించి గుహలో దాగి ఉన్న సముచిని సంహరించాడట. అప్పుడు ఆ ఉగ్రరూపంతోనే విష్ణువు ఆ గుహయందు అర్చారూపం ధరించి ఉండగా, దేవతలు ఆయనకి అమృతం ఇచ్చి శాంతిపజేయగా అందులో కొంత మిగిలిన అమృతాన్ని బ్రహ్మాది దేవతలకి ఇచ్చాడని చెప్పుతారు. ఈ విధముగా కృతయుగంలో అమృతం తాగిన విష్ణువు త్రేతాయుగంలో ఆవునేతిని,ద్వాపరయుగంలో ఆవు పాలనా తాగి సంతోషించి, ఇప్పుడు కలియుగం నందు భక్తులు సమర్పించే బెల్లం పానకమును తాగుతూ సంతృప్తి చెందుతున్నాడు. ఇలా శ్రీ మహావిష్ణువు శ్రీ పానకాల నరసింహస్వామిగా మంగళగిరిలో వెలిసాడు.