భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను అర్పించారు. ఆ స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకడు భగత్ సింగ్. ధైర్యానికి, సాహసానికి నిలువెత్తు రూపం భగత్ సింగ్. తనకి ఉన్న దేశభక్తిని చూసి బ్రిటిష్ వాడు కూడా సెల్యూట్ చేసాడు. బాల్యం నుండే ఆయనకి ఉన్న దేశభక్తి గురించి తెలిస్తే ప్రతి భారతీయ పౌరుడి రోమాలు నిక్కబొడుస్తాయి. మరి దేశం గర్వించదగ్గ ఈ యువ కెరటం బాల్యం నుండి అయన చివరి క్షణం వరకు జీవితం ఎలా సాగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.భగత్ సింగ్ స్వస్థలం లయాల్పూర్ జిల్లాలోని ఖాత్కర్ కళన్ గ్రామం. ఆయన తల్లిదండ్రులు విద్యావతి, సర్దార్ కిషన్ సింగ్. అయితే భగత్ సింగ్ పుట్టిన సమయంలో, కిషన్ సింగ్ సోదరులందరూ, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం వలన, వాళ్ళందరిని జైల్లో పేట్టారు. ఐతే పిల్లాడు పుట్టీ పుట్టగానే, వాళ్ళందరినీ జైలు నుండి విడుదల చేస్తున్నారనే వార్త తెలిసింది. తమ కుటుంబానికి అదృష్టం వచ్చింది అని భావించి ఆ పిల్లాడికి భగత్ సింగ్ అని పేరు పెట్టారు.ఇక ఆయనకి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది. ఆ సంఘటన ఆయనను తీవ్రంగా కలచి వేసింది. 12 ఏళ్ళ వయసులోనే జలియన్ వాలాబాగ్ ప్రాంతానికి వెళ్లి అక్కడ రక్తం తో తడిసి ముద్దైన మట్టిని ముద్దాడి తన పిడికిలిలో ఆ రక్తపు మట్టిని ఇంటికి తీసుకొనివచ్చాడు. ఆ వయసులోనే యూరోప్ లో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి ఎక్కువగా చదివేవారు. అందుకే ఆయన కమ్యూనిజం వైపు బాగా ఆకర్షితుడైయ్యాడు.భగత్ సింగ్ లాహోరు లోని డి.ఎ.వి. కళాశాలలో చదువుతున్నప్పుడు, అప్పట్లో స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వాళ్ళు పరిచయమయ్యారు. వాళ్ళలో ముఖ్యులు, లాలాలజపతి రాయి, రాజ్ బిహారి బోస్. ఇక మహాత్మా గాంధీ గారు 1921లో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు ఇచ్చారు. దానికి ప్రతిగా, భగత్ సింగ్ అప్పటివరకు తను చదువుతున్న పాఠశాల మానేసి, లాహోరు లోని, నేషనల్ కాలేజీ లో చేరారు. భగత్ సింగ్ కి గాంధీ అంటే చాలా అభిమానం ఉండేది. అయితే గాంధీ అకస్మాత్తుగా సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్‌సింగ్‌కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు. 1926లో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించాడు. ఇక ఆ సమయంలోనే వీరందరిని కూడా తీవ్రవాదులుగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది.ఆ తరువాత 1929 వ సంవత్సరంలో సైమన్ కమీషన్ భారతదేశంలో అడుగుపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలోని రాజకీయల పరిస్థితుల మీద నివేదిక ఇవ్వడం. ఇందులో ఒక్క భారతయుడు కూడా లేకపోవడం చూసి లాహోర్ కి ఈ కమిటీ వారు వచ్చినప్పుడు లాలాలజపతి రాయ్ దానికి నిరసనగా శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే బ్రిటిష్ వారు లాటి ఛార్జ్ చేయడం తో ఆ లాటి ఛార్జ్ లో వారు కొట్టిన దెబ్బలకి లాలాలజపతి రాయ్ గారు మరణించారు. ఇదంతా చూసిన భగత్ సింగ్ లాటి ఛార్జ్ చేసిన ఆ బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపేస్తా అంటూ ప్రతిజ్ఞ చేసాడు. అప్పుడు తన స్నేహితులైన శివరామ రాజగురు, జై గోపాల్, సుఖదేవ్ థాపర్ తో కలిసి ప్రణాలిక రచించారు. వాళ్ళ పధకం ప్రకారం, జైగోపాల్ ఆ అధికారిని చూసి, భగత్ సింగ్ కి సైగ చేయాలి. అయితే జైగోపాల్ తప్పిదం వల్ల, అసలు అధికారి బదులు, వేరే వాళ్ళని కాల్చేశాడు భగత్ సింగ్. ఒక పోలీస్ అధికారిని చంపివేయడంతో ఆయన పైన నిఘా ఎక్కువ అయింది.ఆ తరువాత కొన్ని రోజులకి భగత్ సింగ్ వారి సభ్యులు అసెంబ్లీ లో బాంబు పెట్టాలని భావించారు. ఇక ఏప్రిల్ 8, 1929 న భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ కలిసి, అసెంబ్లీలో పెద్దగా ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ బాంబ్ వేశారు. ఐతే వాళ్ళకి దాన్ని తయారు చేయడంలో అనుభవం లేకపోవడం వలన, అంతే కాక, దాన్ని అక్కడ ఉన్న సభ్యులకి దూరం గా విసిరి వేయడం వలన, ఎవరికీ ఏమి అవలేదు. ఇక బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది.ఆలా ఉరి శిక్ష పడి జైలుకి వెళ్లిన ఆయన ఈ మాత్రం భయపడలేదు. జైలులో బ్రిటిష్ ఖైదీలకు, భారతదేశ ఖైదీలకు చూపిస్తున్న వ్యత్యాసాన్ని సహించని ఆయన 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేసాడు. ఇక అప్పుడు ఆయన గురించి దేశం మొత్తం తెలిసిపోయింది. ఇలా జైలులో చివరకు మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు.పన్నెండు ఏళ్ళకి రక్తంతో తడిసిన నేలని ముద్దాడి శపథం చేసి, పధ్నాలుగు ఏళ్ళకి స్వాతంత్ర్య ఉదయమంలోకి అడుగుపెట్టి , ఇరవై మూడు ఏళ్ళకి దేశంకోసం ఉరి తాడుని పూల మాలగా స్వీకరించి తన ధైర్య సాహసాలతో యావత్తు దేశానికి ఆదర్శంగా నిలిచి చరిత్రలో నిలిచిపోయిన గొప్ప స్వాత్యంత్ర యోధుడు భగత్ సింగ్.