త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మదేవుడు ఒక సందర్భంలో శివుడి కోపానికి కారకుడై శాపానికి గురవుతాడు. అయితే శాపానికి గురైన బ్రహ్మదేవుడు ఎన్నో ప్రదేశాలను సందర్శిస్తుండగా ఇక్కడ కొలువై ఉన్న ఈ అమ్మవారి ఆలయ ప్రదేశంలో తన శాపాన్ని పోగొట్టుకున్నాడని స్థల పురాణం చెబుతుంది. మరి బ్రహ్మ దేవుడు ఎందుకు శాపానికి గురయ్యాడు? ఆ అమ్మవారు ఎవరు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న గొప్పతనం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమబెంగాల్ రాష్ట్రం, బీర్ భూమ్ జిల్లా కి కొన్ని కిలోమీటర్ల దూరంలో సియూరి అను ప్రాంతం దగ్గర బక్రేశ్వర్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో మహిషాసురమర్దిని అమ్మవారి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోని అమ్మవారు 18 చేతులతో ఆయుధాలను ధరించి నిలబడి ఉన్న అమ్మవారు భక్తులకి దర్శనం ఇస్తుంది. ఈ ఆలయంలో అమ్మవారిని అష్టావక్ర మహర్షి ప్రతిష్టించినట్లు తెలియుచున్నది.
అయితే పూర్వం బ్రహ్మదేవుడు తానూ సృష్టించిన స్త్రీని కాముక దృష్టితో చూచినందున శివుని శాపానికి గురై చివరగా బ్రహ్మా చివరగా ఈ ఆలయంలో ఉన్న గుండంలో స్నానం ఆచరించగా పాపం నుండు విముక్తి పొందిన దివ్యస్థల ఇదేనని పురాణం.
ఇది ఇలా ఉంటె, సత్యయుగంలో శ్రీ లక్ష్మి నారాయణుల వివాహ సమయంలో అసితాంగ అనే మహర్షిని ఇంద్రుడు ఎగతాళి చేయగా ఆయనకు విపరీతమైన కోపం రావడంతో శరీరంలోని నరాలు వంకర తిరిగిపోయి అంగవైకల్యం ఏర్పడగా, అప్పుడు అయన ఈ క్షేత్రానికి వచ్చి గొప్ప తపస్సు చేయగా శివుడు అనుగ్రహించి ఈ క్షేత్రంలోని వక్రనాధునిగా ఉంటానని ఆయనకు మాట ఇచ్చాడు. అందుకే ఈ స్వామిని ఈ ఆలయంలో వక్రనాధుడు అని భక్తులు పిలుస్తారు.
ఈ ఆలయాన్ని 51 శక్తిపీఠాలలో ఒకటిగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారిని బాక్రేశ్వరి దేవిగా, స్వామివారిని బాక్రేశ్వరునిగా పిలుస్తారు. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే, ఇక్కడ బ్రహ్మగుండం ఉంటుంది. ఈ గుడంలోని నీరు ఎప్పుడు వేడిగా ఉంటుంది. అయితే ఇక్కడ 100 మీ. పొడవు, 15 మీ. వెడల్పు సుమారు నాలుగు అడుగుల లోతున ఉన్న నీటి బుగ్గలు చాలా కలవు. ఇవి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి.
ఇలా నిరంతరం ప్రవహించే ఈ నీటిలో స్నానము ఆచరిస్తే అనేక వ్యాధులు మటుమాయం అవుతాయని భక్తుల నమ్మకం. ఇలా నిరంతరం ప్రవహించే ఆ నీటిలో పొగలు వస్తుంటాయి. ఇక్కడ కొన్ని వందల విగ్రహాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఏ ఊరు లేదు. ఆలయానికి సంబదించవారే ఇక్కడ ఉంటారు.
ఇలా బ్రహ్మదేవుడు తన శాపం నుండి విముక్తి పొందిన ఈ ఆలయాన్ని సందర్శించి అక్కడ ఉన్న గుండంలో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు, పాపాలు తొలగిపోయితాయని భక్త ప్రగాఢ నమ్మకం.