వేంకటేశ్వరస్వామి బాలాజీ గా పూజలందుకొంటున్న ఈ ఆలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది. ఈ వడ్డీ కాసులవాడు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల వద్ద నుండి వడ్డికాసులు ఏ మాత్రం ఆశించాడు. ఇక్కడ పేద, ధనిక అంటూ ఎలాంటి తారతమ్యాలు ఉండవు. మరి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కు 23 కి.మీ. దూరంలో చిలుకూరు అనే గ్రామంలో బాలాజీ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజీని వీసా బాలాజీ అని పిలుస్తుంటారు. భక్త రామదాసు మేనమాలైన అక్కన్న, మాధన్నల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు. ఈ ఆలయానికి ప్రతి రోజు అనేకమంది భక్తులు మొక్కులు మొక్కుకోవడానికి మరియు తీర్చుకోవడానికి వస్తారు. ఇక్కడ ప్రదిక్షణలు చేయుట ముఖ్య ఆచారం. ఈ ప్రధాన ఆలయం పక్కనే శివాలయం ఒకటి ఉంది. ఇక్కడ ముందుగా కోరికను మొక్కు కొని 11 ప్రదిక్షణలు చేస్తారు. ఆ కోరిక తీరిన తరువాత 108 సార్లు ప్రదిక్షణలు చేస్తారు. ఈ ఆలయం లో విశేషం ఏంటంటే ఇక్కడ హుండీ అనేది ఉండదు. అంతేకాకుండా స్వామివారి దర్శనానికి ధనిక, పేద అధికార తారతమ్యాలు ఉండవు. అందరు ఒకేవరుసలో నిలబడి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయం లో ఆచారం ఏంటంటే, భక్తులు మొదటిసారిగా వచ్చినప్పుడు 11 సార్లు ప్రదక్షిణిలు చేయాలి. తమ కోరికలు నెరవేరిన తరువాత మరొకసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణాలు చేసి తమ మొక్కు తీర్చుకోవాలి. భక్తుడు తన కోరిక సఫలమయ్యే వరకు ఆ కోరికను తనకు స్వామివారికి మధ్యనే రహస్యంగా ఉంచాలి. ఇంకా ఈ స్వామి వారి విగ్రహాన్ని భక్తులు కన్నులు మూసుకోకుండా ఆయనను చూస్తూనే నమస్కరించుకోవాలి. ఇక ఆలయ పురాణానికి వస్తే, సుమారు 500 సంవత్సరాల క్రితం గొన్న మాధవరెడ్డి అనే భక్తుడు తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరుని దర్శనార్థం బయలుదేరి కొంత దూరం వెళ్లిన తరువాత వృద్యాప్యం తో ముందుకు నడవలేక అక్కడనే కుప్పకూలిపోయాడు. అప్పుడు స్వామివారు అతడికి ప్రత్యేక్షమై నాకోసం నువ్వు ప్రయాసపడి ఏడు కొండలు ఎక్కి రానవసరం లేదు. చిలుకూరు సమీపంలో ఉన్న పొదల్లో నా విగ్రహం కప్పబడి ఉంది. అక్కడ నన్ను సేవించుకుని తరించవచ్చు అని చెప్పి అదృశ్యమయ్యారు.
స్వామివారి ఆనతి ప్రకారం మాధవరెడ్డి పొదల్లో తవ్విచూడగా అతి సుందర రూపంతో దివ్యకాంతులతో ఉన్న శ్రీవారి విగ్రహం కనిపించింది. ఇలా వెలసిన వెంకటేశ్వరస్వామి వారి మహిమ అంత ఇంత కాదని చెబుతారు.