ప్రతి ఆలయంలో శివుడు లింగ రూపంలో దర్శనం ఇస్తాడనే విషయం మనకి తెలుసు అయితే ఈ ఆలయ పురాణానికి వస్తే ఒక భక్తుడు మానికను శివలింగం లాగా భావించి ఇక్కడ పూజలు చేసాడని తెలుస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, అద్దంకి మండలంలో మణికేశ్వరం గ్రామంలో శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. ఇక ఈ ఆలయంలో ఉన్న శిలాశాసనాల ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ఉందని తెలియుచున్నది. ఈ ఆలయం ఎలా వెలసింది అనే పురాణ విషయానికి వస్తే, ఉప్పు అమ్ముకొని జీవించే ఒక భక్తుడు శివరాత్రి రోజున ఇక్కడ శివుడిని పూజించడానికి శివలింగం లభించకపోవడంతో తన వద్ద ఉన్న మానిక ను బోర్లించి పెట్టి, నామాలు అలంకరించి భక్తితో పూజించగా ఆ మానిక అలానే లింగమూర్తిగా మారిందని అందువల్లే ఆ స్వామికి మాణికేశ్వరుడు అనే పేరు వచ్చిందని కాలక్రమేణా అదే మల్లేశ్వరుడుగా మారినట్లు ప్రతీతి. ఈ ఆలయ స్థల విషయానికి వస్తే, ఇక్కడ కొండ దిగువ భాగాన దేవాలయం, దేవాలయానికి ఉత్తరంగా గుండ్లకమ్మ గా పిలువబడే జీవనది, నది ఒడ్డున స్మశాన వాటిక ఉన్నాయి. ఇలా ఇన్ని ఉన్నాయి కనుక దీనిని దక్షిణ కాశి అని పిలుస్తుంటారు. ఇక్కడ ఉన్న శిల శాసనాలను బట్టి ఈ దేవాలయం 1202 నాటిదని తొలుత ఈ గ్రామం పేరు బుద్ధంపూడి అని ఈ ఆలయం చోళరాజుల కాలం నాటిదని తెలుస్తుంది.శివరాత్రి సమయంలో ఇక్కడ ఉత్సవాలు గొప్పగా జరుగుతాయి. ఇంకా ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు.