Everything About Jayasudha Garu & The Roles Which Made Her A Nati To ‘Sahaja Nati’

Contributed by Boddula Rakesh

సహజ నటి.. ఇది వినగానే మనకు టక్కున ఒకరు గుర్తొస్తారు. ఆవిడే జయసుధ గారు. ఎన్నో సినిమాల్లో, మరెన్నో భాషల్లో మంచి పాత్రలు చేసి మనందరికీ దగ్గరయ్యారు. తన కన్నా ముందు.. తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వచ్చారు.. వెళ్లారు, కానీ ఆవిడ మాత్రమే సహజ నటి అనిపించుకున్నారు. మహానటి సావిత్రి గారి తర్వాత అంతటి స్థాయిలో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ జయసుధ గారే. ఒక వైపు జయప్రద గారు, మరో వైపు శ్రీదేవి గారు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కొన్ని పాత్రలు తను మాత్రమే చేయగలదు అనేలా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి సినిమాల్లో హీరోయిన్ గా.. ఇప్పుడు అమ్మగా మనల్ని అలరిస్తున్నారు. మరి ఈ రోజు జయసుధ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆవిడ గురించి మనకు తెలిసిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.

కుటుంబ నేపథ్యం…

Jayasudhaజయసుధ గారి అసలు పేరు సుజాత. చెన్నైలో పుట్టి పెరిగారు. ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల గారు జయసుధ గారికి పిన్ని అవుతారు. ఆవిడ ప్రేరణతో జయసుధ గారు సినిమా రంగం వైపు అడుగులు వేశారు. కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో పిన్ని తనని ఎంతో ప్రోత్సహించారని జయసుధ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. భర్త నితిన్ కపూర్, ఇద్దరు పిల్లలు నిహార్, శ్రేయాన్. 2017లో నితిన్ కపూర్ గారు ఆత్మహత్య చేసుకుని మరణించారు. జయసుధ గారి చెల్లెలు సుభాషిణి కూడా సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరు ‘శివరంజని’, ‘మేఘ సందేశం’ చిత్రాల్లో కలిసి నటించారు. సుభాషిణి మనకు బాగా దగ్గర అయిన సినిమా అంటే ‘అరుంధతి’. ఆ సినిమాలో పశుపతికి తల్లిగా నటించి మనందరినీ భయపెట్టారు.

సినిమా జీవితం…

Jayasudhaజయసుధ గారు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు, బాలచందర్ లాంటి గొప్ప దర్శకుల దర్శకత్వంలో ఆమె నటించారు. ఎన్టీఆర్, ఏయన్నార్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రజినీకాంత్, శోభన్ బాబు, మురళీ మోహన్, చంద్ర మోహన్.. ఇలా ఒకరేంటి ఎంతో మంది అగ్ర హీరోలతో కలిసి పోటాపోటీగా నటించారు. 12 ఏళ్ళ వయసులో ‘పండంటి కాపురం’ సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రముఖ నటి జమున గారికి కూతురిగా నటించారు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో పాటు విలన్ గా కూడా చేసి మెప్పించారు. రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన ‘జ్యోతి’ ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఎన్టీఆర్ గారితో చేసిన ‘అడవి రాముడు’, ఏయన్నార్ గారితో చేసిన ‘ప్రేమాభిషేకం’, ‘మేఘ సందేశం’ జయసుధ గారిని అగ్ర స్థానంలో నిలబెట్టాయి. ఇంకో హీరోయిన్ తో కలిసి నటించే సందర్భాల్లో.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చేలా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకునేవారు. చేసేది చిన్నదైనా అది సినిమాలో మంచి పాత్ర అయ్యేలా జాగ్రత్త పడేవారు ఆవిడ.

ఇక ప్రస్తుతం వస్తున్న సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం ఆమె పక్కన ప్రకాష్ రాజ్ గారు సరైన జోడీ అని మనం ఒప్పుకోక తప్పదు. సిద్ధార్థ్, వరుణ్ సందేశ్, సుమంత్, రవితేజ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి మరెందరో యంగ్ హీరోలకి తల్లిగా అద్భుతమైన నటన కనబరిచారు. ‘అమ్మ నాన్న తమిళ అమ్మాయి’ సినిమాలో రవితేజకి అమ్మగా తను చేసిన పాత్రని అసలు మనం మర్చిపోగలమా..? కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాలో మనకు కనిపించి అలరిస్తూనే ఉన్నారు. త్వరలో రాబోతున్న నందమూరి బాలకృష్ణ గారి సినిమా ‘రూలర్’లో ఆవిడని చూడబోతున్నాం. అన్ని రకాల పాత్రలు చేసి తనలా సహజంగా ఇంకెవరూ నటించలేరు అనేంతగా మన మనసుల్ని కట్టిపడేశారు. చేసిన ప్రతి పాత్రకు పూర్తి న్యాయం చేశారు. తన ధీటైన నటనతో ఎన్నో ఫిలిం ఫేర్, నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. మంచి నటిగానే కాదు.. నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టి పలు సినిమాలు నిర్మించారు. ‘ఆది దంపతులు’, ‘కాంచన సీత’, ‘కలికాలం’, ‘హ్యాండ్సప్’ లాంటి మరికొన్ని సినిమాలతో నిర్మాతగా మారారు జయసుధ గారు.

గుర్తింపు తెచ్చిన సినిమాలు…

1. నోము

2. శివరంజని

3. జ్యోతి

4. మేఘ సందేశం

5. గృహ ప్రవేశం

6. ప్రేమాభిషేకం

7. తాండ్ర పాపారాయుడు

8. త్రిశూలం

9. బంగారు కుటుంబం

10. కంటే కూతుర్నే కను

11. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి

12. బొమ్మరిల్లు

13. కొత్త బంగారు లోకం

14. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

15. శతమానం భవతి

రాజకీయ జీవితం…

జయసుధ గారు 2009 నుండి 2014 వరకు రాజకీయ జీవితంలో ఉన్నారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మంచి ఆధిక్యంతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ప్రజలకు సేవలు అందించారు. 2014లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం మాత్రం ఆవిడని వరించలేదు. ఇక ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.

Jayasudhaఅదండీ.. మన సహజ నటి జయసుధ గారి ప్రస్థానం. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి మన అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆవిడ మరెన్నో సినిమాల్లో నటించి మనకు మరింత దగ్గర అవ్వాలని కోరుకుందాం. సహజ నటికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో ఆవిడ జరుపుకోవాలని ఆశిద్దాం. హ్యాపీ బర్త్ డే టూ యూ జయసుధ గారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR