పేరడీ మనకు బాగా పరిచయం ఉన్న పేరు. అసలు పేరడీ కి, పేరడీ సాహిత్యానికి ఆద్యుడు జరుక్ శాస్త్రి. అప్పటి దాకా ఉన్న సాహిత్యాన్ని సమకాలీన కవులని, వారి రచనలని సునిశిత పరిశీలనతో వ్యంగ్యంగా అనుకరించి పేరడీ శాస్త్రి గా ప్రసిద్ధి చెందారు. ఈయనని అందరూ ప్రేమతో “రుక్కాయి” అని అనేవారు. జరుక్ శాస్త్రి పూర్తి పేరు జలసూత్రం రుక్మిణినాథ శాస్త్రి. 1914 సెప్టెంబర్ 7 న బందరులో జన్మించిన ఈయన తన పేరడీ సాహిత్యంతో తెనాలి రామకృష్ణుడు తరువాత అంతటి ప్రతిభా మూర్తి గా, వికట కవిగా పేరుగాంచారు. కేవలం పేరడీ రచనలే కాక ఎన్నోరకాల రచనలు చేశారు. 1968 జూలై 20 న కన్నుమూసిన ఈయన తెలుగు సాహిత్యానికి పేరడీ రుచిని చూపించారు.
ఇప్పుడు మనం మహాకవి శ్రీశ్రీ రచించిన ఒక రచనకు జరుక్ శాస్త్రి రాసిన ఒక పేరడీనీ చూద్దాం.
శ్రీశ్రీ ” నవ కవిత ” నుంచి
సింధూరం, రక్తచందనం,
బంధూకం, సంధ్యారాగం,
పులిచంపిన లేడినెత్తురూ,
ఎగరేసిన ఎర్రని జెండా,
రుద్రాలిక నయన జాలిక,
కలకత్తా కాళిక నాలిక
కావాలోయ్ నవకవనానికి….
జరుక్ శాస్త్రి పేరడీ “సరదా పాట”
మాగాయి కందిపచ్చడీ
ఆవకాయ్, పేసరప్పడమూ
తెగిపోయిన పాత చెప్పులూ
పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగులో కారా కిల్లీ
సామనోయ్ సరదా పాటకు
తుప్పట్టిన మోటార్ చక్రం
తగ్గించిన చిమ్నీ దీపం
మహా వూరిన రంపంపొట్టు
పంగల్చీలిన ట్రంపట్టా
విసిరేసిన విస్తరి మెతుకులు
అచ్చమ్మ హోటల్లో చేపలు
సమనోయ్ సరదా పాటకు…..